దూకుడుమీదున్న బీజేపీ
తగ్గేది లేదంటున్న టీంఎసీ
పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు
డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ
బెంగాల్‌లో ఏం జరుగుతోంది?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలు రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ రణరంగంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. బెంగాల్‌లో అధికారం దక్కించునేందుకు భారతీయ జనతాపార్టీ, సత్తా నిరూపించుకునేందుకు తృణమూల్ పార్టీ తాపత్రయ పడుతున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం.
కేంద్ర హోంమంత్రి, అపర చాణిక్యుడు అమిత్ షా ఇటీవల రెండు రోజుల పాటు బెంగాల్‌లో పర్యటించారు. మొదటి రోజు బెంగాల్లోని పది మంది ప్రస్తుత ఎంఎల్‌ఎలు, ఒక మంత్రి, ఒక ఎంపి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. ఇందులో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత మంత్రి సువేందు అధికారితో పాటు, బర్ధమాన్ తూర్పు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న టిఎంసి సిట్టింగ్ ఎంపి సునీల్ మండల్ కాషాయ కండువా కప్పుకున్నారు.. బిజెపి పార్టీలోకి ఫిరాయించిన పది మంది ఎంఎల్‌ఎలలో ఆరుగురు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారు కావడం విశేషం. వారితో పాటు మరో నలుగురు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల ఎంఎల్‌ఎలు కావడం కూడా గమనార్హం.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఏ పార్టీనీ విడిచిపెట్టకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఎన్నికలకు ముందుగానే బిజెపి తమ రాజకీయ పునాదిని పటిష్ఠ పరుచుకుంది. అమిత్ షా తన రెండవరోజు బెంగాల్ పర్యటనలో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న హింసను ప్రస్తావించారు. గత పదేళ్లుగా బిజెపి పార్టీకి చెందిన మూడు వందల మంది కార్యకర్తలను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు హత్య చేశారని అమిత్ షా ఆరోపించారు. ఇటీవల తమ పార్టీ అధ్యక్షుడైన జెపి నడ్డా పైన దాడి ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఇలాంటి హింసా రాజకీయాలకు ఇకముందు చరమగీతం పాడతామన్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా ఖాళీ అయిపోయి రాబోయే ఎన్నికల్లో ‘దీది’గా పేరొందిన మమతా బెనర్జీ ఒక్కరే తన పార్టీలో ఒంటరిగా మిగిలిపోతారని అమిత్ షా విమర్శించారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 200 కు పైగా అసెంబ్లీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తామన్నారు.
బెంగాల్‌లో ఒక వంక బిజెపి పార్టీ బలం పుంజుకుంటుంటే మరో వైపు... హైదరాబాదీ పార్టీగా పేరుగాంచిన అసదుద్దీన్ ఓవైసి ఆధ్వర్యంలోని ఎంఐఎం పార్టీ బెంగాల్ రాజకీయాల్లో కాలుమోపుతోంది. దీనికి బలమైన కారణం కూడా ఉంది. బిజెపికి ఎంఐఎం ‘బి’ టీంగా వ్యవహరిస్తుందని ఇప్పటికే అన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బిజెపి, ఎంఐఎం ఇద్దరూ ఎన్నికల్లో పోటీ చేసి ఆయా మతాలను రెచ్చగొట్టి లాభం పొందుతున్నాయని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు సీట్ల గెలుపుతో అది కొంతవరకు నిజమే అనే వాదన వినిపిస్తోంది.
ఇక బెంగాల్ ఓటర్ల విషయానికి వస్తే అక్కడి ఓటర్లలోలో సుమారు ముప్పై శాతానికి పైగా ముస్లింలు ఉన్నారు. వందకు పైగా నియోజకవర్గాలలో వీరి ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ దశలో బిజెపి ఎంఐఎం, మతతత్వ రాజకీయాలు ఓటర్ల ‘పోలరైజేషన్’ కు దారి తీస్తుందా అనేది కూడా పలు ఆలోచనలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసింది. కొంత వరకు సక్సెస్ కూడా అయ్యింది. అదే ఒరవడిలో పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి ఆ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటోంది. దేశ రాజకీయాల్లో పెను మార్పులకు ఇది మరొక సంకేతంగా మారింది.
స్వాతంత్య్రానంతరం మొదట మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బెంగాల్ రాష్ట్రం ఆ తర్వాత మరొక 27 సంవత్సరాల పాటు కమ్యూనిస్టుల కంచు కోటగా ఉంది. కాంగ్రెస్ నుండి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టి తన తన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ పార్టీని మరింత పటిష్ఠం చేశారు. ఏదైనా తాను అనుకున్నది సాధించేదాకా పట్టువదలని గట్టి మహిళా నేతగా పేరు ఉన్న మమతా బెనర్జీ ప్రస్తుతం బిజెపి పార్టీ ని ఎదుర్కోలేక రాజకీయంగా డిఫెన్స్‌లో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా తన చుట్టూ తిరిగిన వారే, తనకు వెన్నుదన్నుగా ఉన్న వారే పార్టీని విడిపోతుంటే కాపాడుకుందామని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
బెంగాల్ ఘనమైన చరిత్రను ఒకసారి పరిశీలిస్తే చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కలకత్తా కేంద్రంగా అలనాటి ఈస్టిండియా కంపెనీ ద్వారానే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చారు. వ్యాపారానికి వచ్చిన వ్యాపారులే ఆ తర్వాత మన దేశానికి పాలకులుగా మారి రెండు వందల సంవత్సరాలు పాలించారు. ఒకనాడు భారతదేశ సాంస్కృతిక, సాహిత్య, ఆర్థిక, రాజకీయ రంగంలో ధ్రువతారగా వెలిగిన బెంగాల్ ఈరోజు దేశ రాజకీయాల్లో కానీ ఆర్థిక సామాజిక రంగాల్లో చాలా వెనకబడిపోయింది. దానికి కమ్యూనిస్టులే కారణమని కాంగ్రెస్, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మూడు దశాబ్దాల పాటు మీరే పాలించారుగా అని కమ్యూనిస్టులు ఒకరినొకరు విమర్శించుకుంటుంటారు. ఇక ఈ రెండు పార్టీలను ఎదిరించిన మమతా బెనర్జీ తన ప్రాంతీయ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్‌తో వీరిద్దరినీ మట్టికరిపించారు. ఆ తర్వాత కాంగ్రెస్.... కమ్యూనిస్టు పార్టీల నుండి తన పార్టీలోకి ఎంతో మందిని ఆకర్షించింది.
కలకత్తా నగరం గురించి ఒక నానుడి బహుళ ప్రచారంలో ఉంది. యాభై సంవత్సరాల క్రితం కలకత్తా నగరానికి వెళ్లిన వారు మళ్లీ ఇప్పుడు వెళ్తే అప్పటి పాతకాలం నాటి భవనాలు... ఎలాంటి మార్పులేని రోడ్లు కనిపిస్తాయని వారంటారు. ఒక పురాతన నగరాన్ని చూసిన అనుభూతి కలకత్తా నగరాన్ని చూస్తే కలుగుతుంది. దానికి సాక్ష్యంగా ఇటీవలనే కలకత్తా నగరపాలక సంస్థ... అక్కడి పౌరులకు ఒక విజ్ఞప్తి చేసింది. నగరంలో ఉన్న ఇళ్లకు ఎవరైతే కొత్తగా రంగులు వేసుకుంటారో వారికి ఆ సంవత్సరం పూర్తిగా పన్ను మాఫీ చేస్తామని ఆ ప్రకటన సారాంశం. అంటే కలకత్తా నగరంలోని పౌరుల ఆర్థిక స్థితిగతులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఎవరైనా కొత్తవారు వస్తే... తమ నగరం అందవిహీనంగా కనబడుతుందని, మొత్తం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలంటే... తమ సంవత్సర పన్నుల బడ్జెట్ సరిపోదని నగరపాలక సంస్థ ఈ ఉపాయం ఆలోచించింది. అందుకే ఎవరింటికి వారు రంగులు వేసుకుంటే వారికి పన్ను రాయితీని ప్రకటించింది. ఇలాంటి దుస్థితికి బెంగాల్ రాష్ట్ర రాజధానికి పట్టడం చూస్తే గతంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టు కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.
దేశ రాజకీయాల్లో ఆర్థిక సామాజిక రంగాలలో బెంగాల్ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని కమ్యూనిస్టుల మీద మండిపడిన మమతా బెనర్జీ తన పదేళ్ల పాలన తర్వాత సరిగ్గా అవే ఆరోపణలను బిజెపితో ఎదుర్కొంటోంది. అటు కాంగ్రెస్, ఇటు కమ్యూనిస్టులు చేసిన హింసా రాజకీయాలనే మమతా బెనర్జీ కొనసాగిస్తోందని బిజెపి ఆరోపిస్తోంది. బెంగాలీ బాబులు, బెంగాలీ ప్రజలు అంత త్వరగా మారరని ఒకసారి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన పార్టీ వారికే దశాబ్దాల పాటు ఓటు వేసి వారినే కొనసాగిస్తారనే పేరుంది. అలాగే కొత్తను అంత త్వరగా ఆమోదించరని కూడా అంటారు. అందుకే బెంగాల్ రాష్ట్రం అధోగతి పాలు అయిందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఈ స్థితిలో బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనడానికి ఒకటి రెండు సాక్ష్యాలు కనబడుతున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లో ఉన్న 42 పార్లమెంటు స్థానాలలో 18 స్థానాలను బిజెపి గెలుచుకుంది. దీంతో బిజెపికి ఎక్కడలేని బలం వచ్చింది. మరోవైపు గత 18 నెలలలో బిజెపి రాష్ట్రంలోకి చొచ్చుకుపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం కూడా బిజెపికి కలిసి వచ్చింది. కాంగ్రెస్, కమ్యూనిస్టు, తృణమూల్ కాంగ్రెస్‌లోని అసంతృప్తి నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడంలో బిజెపి నేతలు సఫలం అవుతున్నారు. దీంతో కమ్యూనిస్టు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు పునరాలోచనలోపడ్డాయి. ఏది ఏమైనప్పటికీ రాబోయే 2021 అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ ముఖచిత్రాన్ని మార్చనున్నాయి.
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
అనాధ ఆడపిల్లలకు దేశ వ్యాప్తంగా ఉన్న అనేక వందల శరణాలయాలు ఎంతో పెద్ద మనసు చేసుకుని భావి భారత వీరమహిళలుగా తీర్చిదిద్దుతున్నాయని మనందరం అనుకుంటూ ఉంటాం.. ఆ శరణాలయాలకు దేశ విదేశీ దాతలు విరాళాలు పంపిస్...
0 Comments