నా అహింసా మార్గానికి గురువు కస్తూరీబా!
భార్య కోసం కఠిన పథ్యం పాటించిన జాతిపిత
గాంధీజీ దంపతుల ఆదర్శం..
భార్యాభర్తల మధ్య చిన్నపాటి తేడాలు, సర్దుకోవడాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే గాంధీజీ, కస్తూరిబా దంపతుల మధ్య ప్రేమ ఎలా ఉండేది? వారి దాంపత్య జీవితం ఎలా సాగింది? అనే దానిపై అందరికీ అమితమైన ఆసక్తి ఉంటుంది. ఆ వివరాలను... వివిధ ఆధారాలను అనుసరించి సేకరించిన సమాచారం మీ కోసం అందిస్తున్నాం....
గాంధీజీకి కస్తూరిబా మీద ప్రేమ కలిగినపుడు ఆయనే స్వయంగా చక్కటి కాఫీ కలిపి ఆమెకు ఇచ్చేవారు. నిజానికి గాంధీజీకి కాఫీ, టీ అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ కస్తూరిబాకు కాఫీ అంటే ఎంతో మక్కువ. గాంధీజీ భోజనానికి కూర్చుంటే తప్పనిసరిగా ఆయనకు ఎడమవైపున కస్తూరిబా కూర్చోవలసిందే! ఎంతటి అతిథి అయినా కుడివైపున, ఇంకా ఎక్కువమంది అతిథులు ఉంటే ఎదురుగా కూర్చోవలసిందే. అంతేకాదు చాలా సమావేశాలలో గాంధీ వెనుక మౌనంగా రాట్నం వడుకుతున్నస్థితిలో కస్తూరిబా కనిపించేవారు. ఎంతోమంది స్త్రీలకు ఇది స్ఫూర్తి, మార్గనిర్దేశనంగా నిలిచింది. గాంధీజీ దంపతుల సాన్నిధ్యంలో రెండు దశాబ్దాలు గడిపిన రామ్ నారాయణ్ చౌధురి ‘బాపూ యాస్ ఐ సా హిమ్’ అనే పుస్తకంలో చాలా స్మృతులను నిక్షిప్తం చేశారు. దీనిని తెలుగులో నార్లవెంకటేశ్వరరావుగారు అనువదించారు.
ఈ దంపతుల పెద్దల మధ్య స్నేహబంధం ఉంది. గోకుల్ దాస్ మకంజీ కపాడియా, కరంచంద్ గాంధీలు మంచి మిత్రులు. ఒకే వీధిలో ఉండేవారు. స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని తమ పిల్లలు కస్తూరిబా, మోహన్‌లకు పెళ్ళిచేశారు. గాంధీకన్నా కస్తూరిబా నాలుగునెలలు పెద్దవారు. వారి వివాహం 1882...1883 మధ్యకాలంలో జరిగింది. పెళ్ళి అయ్యాక కస్తూరి ఇంటిపట్టున అత్తగారికి, ఇద్దరు తోడికోడళ్ళకు చేదోడుగా ఉండగా, గాంధీజీ స్కూలుకు వెళ్లేవారు. రాత్రిపూట భార్యకు చదువు చెప్పాలని గాంధీ విఫలయత్నాలు చేశారు. తాను చదువు నేర్చుకుంటే తోటికోడళ్ళు, ఇరుగుపొరుగువారు తప్పుబడతారని కస్తూరిబా బిడియడేవారు. 1885 నవంబరులో నెలలు నిండకుండా పుట్టిన తొలి బిడ్డ... కొన్నిరోజులకే కన్నుమూసింది. మరికొన్ని రోజులకే గాంధీజీ తండ్రి కూడా కన్నుమూశారు. సామల్ దాస్ కాలేజీలో గాంధీజీ 1888 జనవరిలో చేరారు. కొంతకాలానికి సరిగా చదువుకోలేక ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు కుటుంబ సభ్యులు గాంధీజీ విషయమై జ్యోతిష్యం చెప్పించారు. ఆ జ్యోతిష్యుడు.... గాంధీని లండన్ వెళ్ళి లా కోర్సు చదవమన్నారు.
దేశం కాని దేశం వెళితే కొడుకు ఏమవుతాడోనని తల్లి పుతలీబాకి బెంగ పట్టుకుంది. అయితే కస్తూరిబా తన నగలు తాకట్టు పెట్టి... గాంధీని బారిష్టరు చదివించడానికి నిశ్చయించారు. మద్యం, మాంసం, మగువ జోలికి పోనని ప్రమాణం చేసి... 1888 సెప్టెంబరు 4న గాంధీ బొంబాయిలో స్టీమరు ఎక్కారు. సముద్ర ప్రయాణం చేసేవారిని ఆనాటి రోజుల్లో కుల బహిష్కరణ చేసేవారు. అయితే గాంధీజీ దానిని ఖాతరు చేయకుండా విదేశం వెళ్లారు. అయితే దీని పర్యవసానం కస్తూరిబా మీద పడింది. ఫలితంగా కొడుకు హరిలాల్‌తో రాజ్‌కోట నుంచి పుట్టింటికి కూడా పోలేని నిస్సహాయత ఎదురైంది. 1891లో గాంధీ ఇంగ్లాండు నుండి బారిష్టర్‌గా తిరిగి వచ్చినా... సరైన ఉద్యోగం దొరకలేదు. ఆ సమయంలో గాంధీజీ ఆంగ్లేయుల తరహా దుస్తులు ధరించేవారు. భార్య కూడా పార్సీ స్టైల్లో చీరకట్టాలని, ఫ్రిల్ బ్లౌస్ వేయాలని, హైహీల్స్ వేయాలని, స్పూన్ తో తినాలని గాంధీ పట్టుబట్టేవారట. ఈ విషయం గాంధీ సినిమాలో కస్తూరిబా పాత్రలో కనిపించిన రోహిణి హత్తంగడి ద్వారా తెలుస్తుంది. అయితే కస్తూరిబా గాంధీజీ మాటలకు తలొగ్గేవారు కాదట. గాంధీజీ చెప్పిన విషయం తనకు నచ్చకపోతే కస్తూరీబా పాటించేవారు కాదు.
అప్పట్లో బొంబాయిలో కలరా తీవ్రంగా ఉండేది. దీంతో బొంబాయి నుంచి ఓడలు రావడం దక్షిణాఫ్రికాలోని వారికి ఇష్టం ఉండేదికాదు. అలాగే భారతదేశం నుండి వలస వస్తున్నవారు తమ ఉద్యోగాలను కబళిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసేవారు. దాంతో గాంధీజీ దంపతులకు ఓడ దిగగానే రాళ్ళ వర్షంతో ఆహ్వానం అందింది. ఇది కస్తూరిబా కుటుంబానికి దక్షిణాఫ్రికాలో ఎదురైన తొలి చేదు అనుభవం. గాంధీజీ దంపతులు ఎలాగోలా బీచ్ గ్రోల్ విల్లా అనే ఇంట్లో దిగారు. ఆ ఇంట్లో ఉంటున్న కాలంలోనే, అంటే.. 1898లో గాంధీజీ ఒకరోజు అర్థరాత్రి మాటామాటా పెరిగి కస్తూరీబాను ఇంటి బయటకు గెంటేశారు. ఈ సంఘటన కారణంగానే ఎంతోమంది గాంధీజీని నేటికీ నిందిస్తుంటారు. అయితే కస్తూరీబా ఏమాత్రం రాజీ పడకుండా, ధైర్యం వీడకుండా, శాంతియుతంగా సంఘర్షించడంతో గాంధీకి జ్ఞానోదయమైంది. ఈ సంఘటన తర్వాత ఆయన భార్యతో గొడవపడిన సందర్భాలు ఎక్కడా కనబడవు. దీనిని గుర్తుంచుకున్న గాంధీజీ... తన అహింసకు గురువు కస్తూరిబా అని చెబుతుండేవారు.
గాంధీజీ దంపతులకు 1897లో రాందాస్, 1900లో దేవదాస్ పుట్టారు. తెల్లనర్సులు సహకరించకపోవడంతో గాంధీజీనే స్వయంగా పుస్తకాలు చదివి కస్తూరిబాకు మంత్రసాని పనులు చేశారని పుస్తకాల్లో రాసివుంది. భార్య ప్రసవవేదన చూడలేక... దీనికితోడు అనారోగ్యంగా ఉండే కస్తూరిబా మీద బెంగతో గాంధీజీ ఇక పిల్లలు వద్దనుకున్నారు. నియంత్రణా పద్ధతులు పాటిస్తే... భార్య కేవలం సెక్స్ వనరు అవుతుందని గాంధీజీ భావించారట. అందుకే తనను తానే నియంత్రించుకోవాలని 1900లో గాంధీ నిర్ణయించుకున్నారు. కస్తూరిబా కూడా దీనికి అంగీకరించడంతో విడిగా మంచాలు ఏర్పాటు చేసుకున్నారు. 1904లో కస్తూరిబాలో మంచి సహచరిని గాంధీజీ గుర్తించారు. ఇదిలావుండగా జొహన్నెస్ బర్గ్‌లోని భారతీయ సంతతికి చెందినవారికి ప్లేగు వ్యాధి సోకింది. ఈ సందర్భంలో గాంధీ వారికి వైద్యసహాయం చేయడానికి ఉద్యమించారు. ఈ పనిలో కస్తూరిబా కూడా గాంధీజీకి సహకరించారు. ఉత్తమ ఫలితాలు రావడంతో గాంధీలో కొత్త ఉత్సాహం వచ్చింది. అదే సంవత్సరంలో గాంధీ... ఫినిక్స్ ఆశ్రమం స్థాపించారు. చెరకుతోటల మధ్య దీనిని ఏర్పాటు చేశారు. 1906లో కస్తూరిబా పిల్లలతో సహా అక్కడికి తరలివచ్చారు. అక్కడ ఆరుకుటుంబాలు మాత్రమే ఉండేవి. 1906 నుంచి గాంధీజీ పూర్తిగా బ్రహ్మచర్యవ్రతం చేపట్టారు. అప్పటికి వారిద్దరికీ 37 సంవత్సరాలు.
గాంధీ పిత్రార్జిత ఆస్తిని ఇద్దరు అన్నయ్యలకు ఇచ్చేశారు. ఆయన బంధువులు ఎంతోమంది ఆశ్రమంలో ఉండటమే కాదు, ఉద్యమాలకు చాలా తోడ్పాటునందించారు. తమకు నలుగురు కుమారులు ఉన్నప్పటికీ కూతురు లేదని కస్తూరిబా బాధపడేవారు. ఈ లోటు తీరేందుకు లక్ష్మి అనే అమ్మాయిని పెంచుకున్నారు. 1942లో లూయీస్ ఫిషర్ ‘ఏ వీక్ విత్ గాంధీ’లో రాసిన వివరాల ప్రకారం... దక్షిణాఫ్రికాలో గాంధీ జైలుపాలయినపుడు, ఆయన జైలులో ఎలాంటి ఆహారం తినేవారో... కస్తూరీబా కూడా అలాంటి ఆహారమే తీసుకునేవారు. 1904లో గాంధీజీ ఉద్యమంలో పాలుపంచుకున్న కస్తూరీబా... చివరి వరకూ అదే ధోరణిలో ఉన్నారు. గాంధీ ప్రతినిధిగా కూడా కస్తూరీబా బాధ్యతలు నెరవేర్చారు. దక్షిణాఫ్రికా ఉద్యమం జరుగుతున్న సమయంలో ఒక గుంపు గాంధీని దెబ్బతీయాలని వచ్చింది. ఆ సమయంలో కస్తూరిబా ఎంతో సమయస్ఫూర్తితో, ధైర్యంతో గాంధీని దొడ్డిదారిన బయటకు పంపారు. ఎంతో నిబ్బరంగా కస్తూరీబా వ్యవహరించారు.
ఒకసారి కస్తూరిబాకు పాలు, ద్రాక్షరసం ఇవ్వమని అనుచరునికి గాంధీజీ చెప్పారు. ఆ అనుచరురాలు వాటిని కస్తూరీబాకు ఇచ్చారు. అయితే కస్తూరిబా వాటిని తాగనని మారాం చేశారు. విషయం తెలుసుకున్న గాంధీ స్వయంగా వచ్చి... ఔషధంలా వాటిని తీసుకోమనగానే కస్తూరీబా మారుమాట్లాడకుండా వాటిని తాగేశారు. మరో సందర్భంలో కస్తూరిబాను వైద్యుడు... పప్పులు, ఉప్పు తీసుకోవద్దని... పథ్యం పాటించాలని చెప్పారు. కస్తూరిబా వైద్యుని మాట వినలేదు. దీంతో గాంధీజీ తాను కూడా వాటిని ఒక సంవత్సరం పాటు ముట్టనని చెప్పారు. దాంతో కస్తూరిబా కూడా అలానే వాటిని తినలేదు. 1944లో గాంధీజీ దంపతులు అగాఖాన్ ప్యాలెస్‌లో బందీలుగా ఉన్న సమయంలో ఫిబ్రవరి 22న... రాత్రి 7.35 నిముషాలకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కస్తూరీబా గాంధీ ఒడిలోనే కన్నుమూశారు. అదే భవనంలో మరుసటి రోజు కస్తూరిబా అంత్యక్రియలు జరిగాయి. ఆ చితిమంటలు అరిపోయేదాకా అంటే సుమారు ఆరుగంటలపాటు గాంధీ మండుటెండలో నిలుచునే ఉన్నారు. ఇదే గాంధీజీ తన జీవిత భాగస్వామి కస్తూరీబాకు అర్పించిన ఘన నివాళి అని చెప్పవచ్చు..
అయితే గాంధీజీ అనుసరించిన కొన్ని సిద్ధాంతాలను, తీసుకున్న నిర్ణయాలను ఎత్తి చూపుతూ అసలు గాధీ మంచివాడు కాదని ప్రచారం చేస్తుంటారు.. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆయన కూడా ఒక మానవ మాత్రుడే .. తప్పొప్పులనేవి సహజం.. అంత మాత్రానికి నిందించడం న్యాయం కాదు.. ఆ మాటకొస్తే ఈ భూమ్మీద తప్పుచెయ్యని వాడెవడు?
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments