సీఎం యోగి ఆదిత్యనాథ్
ఆశ్చర్యపరిచే ఆధ్యాత్మిక కోణం
యువతకు మార్గనిర్దేశం..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2017లో పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి యోగి ఆదిత్యనాథ్ పేరు నేటికీ దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆయన చేపట్టే ప్రతి చర్యా సంచలనంగా అవుతోంది. విపక్షాలు సైతం ముక్కున వేలేసుకునే రీతిలో సాగుతున్న ఆయన పాలన చర్చనీయాంశంగా కూడా మారుతోంది. సీఎం యోగి పాలన 20 కోట్ల మంది యూపీ ప్రజల్నే కాదు 130 కోట్ల మంది భారతీయుల్ని సైతం ఆకర్షిస్తోంది. అయితే ఆయనలో అణువణువునా మరో ఆధ్యాత్మిక కోణం కనిపిస్తుంది. యోగి జీవనశైలి ఎంతో భిన్నంగా ఉంటుంది. చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన యోగి జీవితం లోని కొన్ని విస్తుగొలిపే వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యోగి ఆదిత్యనాథ్ పూర్వనామం అజయ్‌సింగ్. ప్రస్తుత ఉత్తరాఖండ్‌లో ఉన్న ఒకప్పటి ఉత్తరప్రదేశ్‌లోని పౌరిగడ్వాల్ జిల్లా పాంచుర్‌లో ఓ రాజ్‌పుత్ కుటుంబంలో 1972 జూన్ 5న యోగి జన్మించారు. హేమవతి నందన్ బహుగుణ గర్‌వాల్ విశ్వవిద్యాలయంలో బిఎస్సీలో 1992లో పట్టభద్రులయ్యారు. ఆదిత్యనాథ్ మంచి బాడ్మింటన్ క్రీడాకారుడు, గజ ఈతగాడు కూడా. 1993లో ఎంఎస్సీలో చేరిన యోగి గోరఖ్‌పూర్ వచ్చి, గోరఖ్‌నాథ్ మఠ్ అధిపతి మహంత్ అవైద్యనాథ్‌ను కలిశారు. అక్కడే యోగి ఆదిత్యనాథ్.... నాథ సంప్రదాయానికి సంబంధించి దీక్ష తీసుకున్నారు. 1994లో పూర్తి సన్యాసిగా మారారు. అజయ్‌సింగ్ నుంచి యోగి ఆదిత్యనాథ్‌గా మారారు. మహంత్ అవైద్యనాథ్ అనంతరం మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో అవైద్యనాథ్ అప్పటివరకూ ప్రాతినిథిత్వం వహిస్తున్న గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాన్నీ వారసత్వంగా ఎంచుకుని యోగి రాజకీయాల్లో ప్రవేశించారు.
యోగి ఆదిత్యనాథ్ కాషాయం ధరించినప్పటికీ అన్నీ వదిలేసిన సర్వసంగ పరిత్యాగి కాదు. వ్యక్తిగతంగా గృహస్థాశ్రమానికి, ఇతర సుఖాలను త్యజించినా సమాజానికి పూర్తిగా దూరమైన వ్యక్తి కాదు. యోగిది పెద్ద వయసేమీ కాదు.. 50 ఏళ్లు కూడా పూర్తిగా నిండలేదు. జీవితం, సంసారం మిథ్య అనుకునే ధోరణి సీఎం యోగిలో కనిపించదు. సమాజంలో నిత్యం జరుగుతున్న పరిణామాలను చూస్తూ... ఇతర సాధుసంతుల్లాగా ధర్మ ప్రవచనాలు చేసే సాత్విక స్వభావం ఉన్నవానిగా కూడా యోగి కనిపించరు. దేశంలో విశిష్టమైన నాథ సాంప్రదాయాన్ని అనుసరిస్తూనే, తాను ఏదైతే అనుకున్నాడో, తనకు ఏదైతే మంచి అని అనిపిస్తుందో నిస్సంకోచంగా యోగి ఆదిత్యనాథ్ చెబుతుంటారు. తాను అన్న మాట మీద నిలబడగలిగిన వ్యక్తిగా యోగి పేరొందారు. యోగిలోని ఈ గుణాలను గమనించిన కొందరు ఆయనను ఫైర్‌బ్రాండ్ అంటారు. మరికొందరైతే యోగిని అత్యంత వివాదాస్పదుడంటారు.
ఆదిత్యనాథ్ అనుసరిస్తున్న సంప్రదాయం నాథ సంప్రదాయం. దీని గురువు మత్స్యేంద్రనాథుడు. ఆయన శిష్యుడు గోరఖ్‌నాథుడు దీనికి ఒక వ్యవస్థను కల్పించారు. యోగ విద్యలను ఈ సంప్రదాయంలో ప్రధాన భాగంగా చేర్చారు. నాథ సంప్రదాయం భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇతర ఆసియా దేశాల్లో విస్తృతంగా వ్యాపించింది. ఈ సంప్రదాయంలో 84 మంది సిద్ధులు ఉన్నారు. బౌద్ధ ధర్మంలో మాదిరిగానే ఈ సంప్రదాయంలోనూ గురుశిష్యులను మహా సిద్ధులుగా మహా యోగులుగా కీర్తిస్తారు. వీరు దేశమంతా పర్యటించి అంతిమకాలంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ స్థిరపడి అఖండ ధునిని వెలిగిస్తారు. లేకపోతే హిమాలయాల్లోకి వెళ్లి అదృశ్యమైపోతారు. వీరు ప్రధానంగా హఠయోగాన్ని సాధన చేస్తారు.
మొదట్లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ కాషాయం ధరించిన ఓ పూజారి మాత్రమే. బీజెపీ నాయకత్వం ఆయన్ని బయటి వ్యక్తిగానే పరిగణిస్తూ వచ్చింది. 1998 నుంచి గోరఖ్‌పూర్ నుంచి పార్టీ టిక్కెట్‌పైనే అయిదుసార్లు గెలుస్తూ వస్తున్నప్పటికీ ఆయన బీజెపీతో పూర్తిగా మమేకం అయినట్లు అంతగా కనిపించలేదు. గతంలో కొన్ని సందర్భాల్లో పార్టీలో తిరుగుబాటు నేతగా కూడా పేరు తెచ్చుకున్నారు. దీనికి ఆయనలోని అతివాద ధోరణే కారణమని విశ్లేషకులు అంటారు. 1990ల నుంచి ఆయన గురువు మహంత్ అవైద్యనాథ్ కానీ, ఆయన శిష్యుడిగా ఆదిత్యనాథ్ కానీ తమ అతివాద హిందూ జాతీయ వాద వైఖరిని ఏనాడూ దాచుకోలేదు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజెపీ ప్రచార సామగ్రిపై యోగి చిత్రం కానీ, ఆయన ప్రస్తావన కానీ చాలా తక్కువగా కనిపించింది.
దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ తీసుకోనంత వేగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాలు తీసుకుంటూ, అమలు చేస్తూ ఉంటారనే పేరు పొందారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిరోజూ చర్చనీయాంశమే అవుతుంటాయి. ఇవన్నీ ఆయన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటాయి. హిందూవాదం వినిపించే సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీ లాంటి భిన్న మతాలు, కులాలు, జాతులు అత్యధికంగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
యుక్త వయసులోనే ఇంటిని వదిలి, వ్యక్తిగత సుఖాలను పూర్తిగా త్యజించి రాజకీయాల్లోకి వచ్చిన ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలోని అత్యధిక సామాన్య ప్రజల ఆదరణ పొందిన నేతగా పేరుగాంచారు. హిందీ, ఆంగ్ల భాషల్లో ధారాళంగా మాట్లాడగలిగిన యోగి, ప్రధాని మోదీకి సన్నిహితునిగా పేరొందారు. మోదీ, ఆదిత్యనాథ్‌లలో కొన్ని సారూప్యతలు, అంతరాలూ కనిపిస్తాయి. సిద్ధాంత పరంగా ఇద్దరూ ఒకే దారిలో నడుస్తున్నారు. కానీ, మోదీ రాజనీతిజ్ఞతతో వ్యవహరిస్తే, ఆదిత్యనాథ్ కుండబద్దలు కొట్టినట్టు వ్యవహరిస్తారని పేరొందారు. మోదీ ఆర్ఎస్ఎస్ శాఖల్లో శిక్షణ పొందిన స్వయం సేవకుడు. పూర్తికాలం ప్రచారక్‌గా పనిచేశారు. ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయకపోయినా మోదీ అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తరువాత నుంచి ఆయన ఈ రోజు వరకూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆదిత్యనాథ్ ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు.
ఉత్తర ప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీల జనాభా చాలా ఎక్కువ. సమాజ్‌వాది పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ముస్లిం ఓటర్లు నిలుస్తూ వస్తున్నారు. అయితే గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గంలో ఇటువంటి పరిస్థితి కనిపించదు. గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం పరిధిలో తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, దాదాపు 3.5లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇతర మతాలు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల వారు 50 శాతం మేర ఉన్నారు. అయినప్పటికీ, ఈ నియోజక వర్గంలో మహంత అవైద్యనాథ్ నుంచి యోగి ఆదిత్యనాథ్ వరకు తిరుగులేని మెజారిటీతో ఓటర్లు గెలిపిస్తున్నారు. అది కూడా 51శాతానికి పైగా ఓట్లు సాధించటం మరో విశేషం. ఇదంతా వ్యక్తిగత ప్రజాదరణే తప్ప మరేమీ కాదని విశ్లేషకులు చెబుతుంటారు..
అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఆదిత్యనాథ్ పరిపాలన దూకుడుగా మొదలైంది. పని ప్రదేశాల్లో పాన్ గుట్కాల వినియోగాన్ని తక్షణ ప్రాతిపదికన నిషేధించారు. రాష్ట్రంలో అక్రమంగా ఉన్న కబేళాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మొదటి గంటలోనే తన కేబినెట్‌లోని మంత్రులంతా పదిహేను రోజుల్లోగా తమ ఆదాయ వివరాలను వెల్లడి చేయాలని ఉత్తర్వులిచ్చారు. అవినీతి, శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. అధికారులు కూడా పనిచేస్తే 18 నుంచి 20 గంటలు పనిచేయాలని, లేకుంటే సెలవుపై వెళ్లిపోవాలని కాస్త గట్టిగానే చెప్పారు. రోడ్డు రోమియోల భరతం పట్టేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
సో, ఆదిత్యనాధ్ పరిపాలనా తీరుపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments