దక్షిణాది లుక్‌తో ఉత్తరాదిన విజయ ఢంకా ..
తెలుగుజాతి ఆణిముత్యం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ..
మారుమూల పల్లెలో పుట్టిన వారు సైతం ఉన్నత పదవిని అధిష్ఠించే అవకాశం ఉందని ఆయన నిరూపించారు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన ఈ దేశ ఉప రాష్ట్రపతి పదవి వరకూ చేరుకున్నారు. 1998 లో ఆయన తొలిసారి రాజ్యసభలో ప్రవేశించినపుడు... నేను ఈ సభకు నేతృత్వం వహించే రోజు వస్తుందని ఏనాడూ అనుకోలేదని చెప్పారు.... ఆయన మరెవరో కాదు.. మన ముప్పవరపు వెంకయ్యనాయుడు..
వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూన్ 1న జన్మించారు.. ఆయన పుట్టిన ఏడాది మూడు నెలలకే ఒక ప్రమాదంలో తల్లి రమణమ్మ మరణించారు.. తల్లి ముఖం కూడా గుర్తులేని పిల్లవాడిగా పెరిగిన వెంకయ్య అమ్మమ్మ ఊరు మంగళగుంటకు చేరుకున్నారు.. మేనమామ ఇంట్లో పెరిగారు.. కసుమూరు పాఠశాలలో ప్రాధమిక విద్య పూర్తి చేశారు. నిత్యం మూడు కిలోమీటర్లు దూరం నడచివెళ్లి ప్రాథమిక విద్య పూర్తి చేశారు... నెల్లూరు వి ఆర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివారు.. ఎలాంటి అంశంపైనైనా అలవోకగా సుదీర్ఘంగా గణాంకాలతో సహా మాట్లాడటం వెంకయ్య నాయుడుకు అక్కడే అలవాటైంది... విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్శిటీలో లా పూర్తి చేశారు.
నెల్లూరు లో ఉండగానే ఆర్‌ఎస్‌ఎస్‌వైపు ఆకర్షితులయ్యారు. అదే ఆంధ్రాయూనివర్శిటీలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యేందుకు కారణమైంది. విద్యార్థి రాజకీయాల్లో ఉంటూ ప్రజాసమస్యలపై దృష్టిపెట్టారు. 1972లో కాకాని వెంకటరత్నం ప్రారంభించిన జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా గళమెత్తారు. జైలు జీవితాన్ని గడిపారు. రాజకీయ సభల్లో ఎలా మాట్లాడాలో, ఎలాంటి పద ప్రయోగాలు చేస్తే ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చో తనకు తెన్నేటి విశ్వనాధం బోధించారని వెంకయ్య నాయుడు చెబుతుంటారు. జైలు జీవితంలో గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాధం, చలసాని ప్రసాద్ తదితరులు అతని సహ ఖైదీలు, ఆ సమయంలో వారి జీవితానుభవాల నుండి వెంకయ్య ఎంతో నేర్చుకున్నారు. మంగళగుంటకు చెందిన మేనమామ కుమార్తె ఉషతో 1971 ఏప్రిల్ 14న వెంకయ్యనాయుడుకు వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీప వెంకట్.
తొలుత 1974 లో లోక్‌నాయక్ జయప్రకాష్‌నారాయణ్ యువజన సంఘర్షణ సమితికి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా వెంకయ్యనాయుడు వ్యవహరించారు. తరువాత జనతా పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడు అయ్యారు. అక్కడి నుండి ఆయనకు పార్టీతో అనుబంధం పెరిగింది. ఎబివిపి నాయకుడిగా, బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా, బిజెపి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1975లో ఒంగోలులో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తర్వాత 1978, 83 లలో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందారు. స్వల్పకాలంలో శాసనసభ ప్రతిపక్ష నేతగా ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత ఆత్మకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1985 లో ఎపి బిజెపి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన వెంకయ్య 1988లో పార్టీ అధ్యక్షుడయ్యారు. 1993 నుండి 2000 సంవత్సరం వరకూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1996 నుండి 2000 సంవత్సరం వరకూ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1998లో కర్నాటక నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2010 లో కూడా రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు.
ఎపుడూ తెల్లని ఫుల్‌షర్టు, అడ్డపంచెతోనే దక్షిణాది లుక్‌లోనే కనిపించే వెంకయ్యనాయుడును కేవలం ఒక కులం వారే కాదు, తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు తమ ఆత్మీయునిగానే భావిస్తారు. అందమైన అంత్యప్రాసలకు, అనర్గళ ఉపన్యాసాలకు వెంకయ్య పెట్టింది పేరు. హిందీలోనూ అనితరసాధ్యమైన పదాల విరుపులతో ఉత్తరాదివారిని సైతం ఆకట్టుకున్న మాటల మాంత్రికుడు వెంకయ్య. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలను అతి వేగంగా పర్యటించిన వ్యక్తిగా వెంకయ్య రికార్డు సృష్టించారు. కొన్ని జిల్లాలలో ఆయన గరిష్ఠంగా పదిసార్లు సైతం పర్యటించారు. ఒకే రోజు నాలుగైదు రాష్ట్రాలు తిరుగుతూ, పత్రికా విలేకరులతో సంభాషిస్తూ ప్రభుత్వ విధానాలను విడమరచి చెప్పేవారు. విమర్శలకు పదునైన మాటలతో, ఘాటైన విమర్శతో దీటైన సమాధానం ఇవ్వడంలో దిట్టగా వెంకయ్యనాయుడు పేరుగాంచారు.
1999లో ఎన్‌డిఎ విజయంతో వెంకయ్యనాయుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆ సమయంలోనే వెంకయ్య ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని రూపొందించారు. బిజెపికి జాతీయ అధ్యక్షునిగా దక్షిణాది నుండి పనిచేసిన వారిలో వెంకయ్య రెండో వారు. తమిళనాడులో జన్మించిన తెలుగువాడు జానా కృష్ణమూర్తి, 2003లో వెంకయ్య పార్టీ జాతీయ అధ్యక్షులుగా వ్యవహరించారు. 2004 జనవరి 28న ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడయ్యారు, 2004 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమితో ఆయన పదవికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో బిజెపి ఘనవిజయంతో నరేంద్రమోదీ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగానూ, సమాచార మంత్రిగా, పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన మంత్రిగానూ , స్వచ్ఛ భారత్ మంత్రిగా వ్యవహరించారు. ఐక్యరాజ్యసమతి ఆవాస సంస్థ చైర్మన్‌గా అంతర్జాతీయ పదవిని కూడా దక్కించుకున్నారు. చివరికి భారత 13వ ఉప రాష్టప్రతిగా 2017 ఆగస్టు 11వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.
పార్టీని తల్లిగా భావించి ఎదిగాను, నేనీ స్థాయికి చేరుకోవడానికి పార్టీయే కారణం, ఉప రాష్టప్రతిగా వెళ్తే తల్లి లాంటి పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది, పార్టీ వదిలి వెళ్తుంటే నాకు మనసు రావడం లేదు’ అంటూ వెంకయ్యనాయుడు చాలా సార్లు భావోద్వేగానికి గురయ్యారు. అయినా పార్టీ ఆదేశాన్ని శిరసావహించి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో పాల్గొన్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వాదించిన వెంకయ్య, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం విమర్శలకు తావిచ్చింది. ప్రత్యేక హోదా చట్టంలో లేదని, ఒక వేళ ఇచ్చినా రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ అది పరిష్కారం కాదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం చాలామందిని బాధించింది.
ప్రతి రోజూ సహాయక సిబ్బందినిపేరు పేరునా పిలిచి మాట్లాడటం వెంకయ్యకు చాలా ఇష్టమైన కార్యక్రమం. చివరికి పాత్రికేయులను సైతం పేరుపెట్టి పిలవడం అలవాటు. ఆమధ్య బిజెపి జాతీయ కార్యాలయంలో పనిచేసిన సిబ్బందిని తన ఇంటికి పిలిచి వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. కొందరిని ఆర్థికంగా ఆదుకున్నారు. అంతేకాదు నిరంతరం వెంకయ్య వెన్నంటే ఉండే సత్యకుమార్‌ను బహిరంగ సభలో సత్కారం చేశారు. తనకు వేళాపాళా లేదని, అయినా వారంతా తనను అర్ధం చేసుకుని సేవలు అందిస్తారని వెంకయ్య చెప్పుకొచ్చారు.
రెండుమార్లు పెనుప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడిన రాజకీయ నేత వెంకయ్యనాయుడు. ఇక చిన్నాచితకా ప్రమాదాలకు లెక్కేలేదు. 2005 జనవరి 29న బీహార్‌లోని గయ పర్యటనలో ఉండగా మావోయిస్టులు ఆయన హెలికాప్టర్‌కు నిప్పు అంటించారు. అపుడు నాయుడు ఎన్నికల సభలో ప్రసంగిస్తున్నారు. వెంటనే ఆయన తేరుకుని తప్పించుకున్నారు. మరోమారు 2007 జూలై 15న ఉత్తరప్రదేశ్ లక్నో విమానాశ్రయం సమీపంలో వెంకయ్యనాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైడ్రాలిక్ బ్రేకులు విఫలం కావడంతో అత్యవసరంగా కిందకు దిగాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఆయన చిన్న గాయాలతో బయటపడ్డారు.
వెంకయ్యనాయుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా సేవలందిస్తున్నారు. భవిష్యత్తులో రాష్టప్రతి కానున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి ఉప రాష్టప్రతిగా నియమితులైన తరువాత వారు రాష్టప్రతి అయ్యారు. అదే బాటలో వెంకయ్యనాయుడు కూడా రాష్టప్రతి అవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
వెంకయ్యనాయుడు గారి పై మీ అభిప్రాయం ఏమిటి?
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments