తొలి టాకీ ఆలం ఆరా..
అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ..
సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాలను, మనసులోని బాధలను మరిచిపోయేలా చేసిది సినిమా. అయితే సినిమాల నిర్మాణం వెనుక ఎంతో కష్టం దాగివుంటుంది. సాంకేతికత అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలోనే చిత్రాలు నిర్మించడం.. ఇంత కష్టంగా ఉంటే... మరి తొలినాళ్లలో చిత్రాలను ఎలా నిర్మించేవారో తెలుసుకుంటే తప్పక ఆశ్చర్యం కలుగుతుంది. మన దేశంలో రూపొందిన తొలి టాకీ చిత్రం ఆలం ఆరా వెనునకున్న శ్రమను, ఆ చిత్ర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం....
మన దేశంలో తొలి శబ్ద చిత్రాన్ని నిర్మించిన వ్యక్తి ఆర్దేషీర్ ఇరానీ. ఆయనకు అనుభవం లేకపోయినా ఉత్సాహమే ఊతంగా చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహేబ్ ఫాల్కే సహకారం, సూచనలతో అప్పట్లో బొంబాయిలో విశేష ప్రజాదరణ పొందిన రంగస్థల నాటకం ‘ఆలం ఆరా’ను చిత్ర కథగా ఎన్నుకున్నారు. జోసఫ్ డేవిడ్ అనే నాటక రచయిత సహాయంతో దాన్ని సినిమాకు అనుకూలంగా మలిచారు. ‘ఆలం ఆరా’ చిత్ర నిర్మాణ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇరానీ.
షూటింగ్ జరిగిన స్టూడియో సౌండ్ ప్రూఫ్ కాకపోవడంతో ఇతర శబ్దాలేవీ వినబడకుండా రాత్రి సమయంలో షూటింగ్ చేసేవారు. అదీగాక ఆ స్టూడియో సమీపంలోనే రైల్వేట్రాక్ ఉండేది. రైలు శబ్దాలవల్ల పనికి అంతరాయం కలగకూడదని, రైళ్లురాని సమయాలు తెలుసుకుని... షూటింగ్ చేసేవారు. అప్పట్లో పిక్చర్‌కి, సౌండ్‌కి విడివిడిగా నెగెటివ్‌ను ఉపయోగించేవారు. కెమెరా కన్ను పడని వివిధ ప్రదేశాల్లో మైక్రోఫోన్స్ అమర్చి నటీనటుల వాయిస్ రికార్డు చేశారు. ఈ సినిమాలో పది పాటలున్నాయి. చిత్రానికి ప్రత్యేకించి సంగీత దర్శకుడంటూ ఎవరు లేరు. ఇరానీ పర్యవేక్షణంలోనే తబలా, హార్మోనియం, వాయొలిన్‌తో చిన్న వాద్య గోష్ఠిని ఏర్పరుచుకున్నారు. ఆలం ఆరా చిత్రం నిర్మాణానికి ముందు ఇరానీ, ఓ విదేశీయుడి దగ్గర శబ్ద గ్రహణానికి సంబంధించిన కొన్ని మూల సూత్రాలు నేర్చుకున్నారు. కొనుగోలు చేసిన రికార్డింగ్ యంత్రాలను అమర్చడానికి మన దేశానికి వచ్చిన డెమింగ్ -రికార్డింగ్‌కి సంబంధించిన ఎన్నో విషయాలను ఇరానీకి, అసిస్టెంట్ బరుచాకీ చెప్పారు. ‘ఆలం ఆరా’ నిర్మాణ సమయంలో ఆయనను ఇక్కడ ఉండమని ఇరానీ కోరారు. అయితే రోజుకు వంద రూపాయలు చెల్లించాలని డెమింగ్ డిమాండ్ చేయడంతో, అంత డబ్బు చెల్లించలేక.. బరుచా సహాయంతో శబ్దగ్రహణాన్ని ఇరానీనే నిర్వహించారు. ఆ రోజులలో మూకీ చిత్రాలు తీయడానికి 30 నుండి 40 రోజుల వరకూ పట్టేది. కానీ ఆలం ఆరా సినిమా నిర్మాణానికి నాలుగు నెలల కాలంలో 40వేల రూపాయల వ్యయంతో నిర్మించారు.
ఇరానీ ఒకే కథతో పూర్తి నిడివి కథాచిత్రం ‘ఆలం ఆరా’ను పూర్తిచేసి, 1931 మార్చిన విడుదల చేశారు. ఫలితంగా ఇరానీకి భారతీయ శబ్ద చిత్రాల సృష్టికర్తగా చరిత్రలో ప్రత్యేక స్థానం లభించింది. భారతదేశంలో తొలి మూకీ చిత్రమైన రాజాహరిశ్చంద్రకు మహాభారతంలోని కథ ప్రాణం పోస్తే, తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’కు జానపద గాథ కథాంశంగా నిలిచింది. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు ఆర్దెషిర్ ఇరానీ. చిత్రాన్ని నిర్మించిన సంస్థ పేరు ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ. ఈ చిత్రంలో మాస్టర్ విఠల్ టాకీ హీరోగా, జుబేదా తొలి టాకీ హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ కపూర్ తొలి విలన్‌గా నటించారు. వీరితోపాటు డబ్ల్యు ఎమ్ ఖాన్, ఏవిజర్ జిల్లూబాయి, జగదీశ్‌సేఠ్, సుశాలి, సఖు, మోడీ, ప్రీతి విరాజ్, ఎల్‌వి ప్రసాద్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి ఆధారం ఓ పార్సీ నాటకం. ఇరానీ నిర్మించిన ‘ఆలం ఆరా’ బొంబాయిలోని ఆయన సొంత టాకీస్ మెజిస్టిక్ థియేటర్‌లో విడుదలైంది. దేశమంతటా అద్భుత సంచలనాలు సృష్టించింది. మెజిస్టిక్ థియేటర్ జనసందోహంతో నిండిపోయింది. ఫలితంగా పోలీసులను పిలిపించి మరీ జనాన్ని అదుపులోకి తేవాల్సి వచ్చింది. నాలుగణాలు అంటే.. 25 పైసలు విలువ చేసే టిక్కెట్టును ఐదు రూపాయిలకు బ్లాక్ మార్కెట్‌లో విక్రయించారు. ఆ చిత్రాన్ని తమకు చూపించాల్సిందిగా ఎందరో ఇరానీకి ఉత్తరాలు రాశారు. దాంతో ఆయన సౌండ్ ప్రొజెక్షన్ ఎక్విప్‌మెంట్, సహా దేశవ్యాప్త పర్యటనలు చేపట్టారు. సౌండ్ ఆపరేటర్‌గా ఆ యూనిట్‌తో టి.మహదేవ్ పర్యటించారు. మద్రాసు సెంట్రల్ స్టేషన్‌లో చిత్ర యూనిట్ దిగేటప్పటికి అక్కడ అభిమానులంతా టాకీస్ టాకీస్ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం చెప్పారు. మద్రాసులోని సినిమా సెంట్రల్ టాకీస్ మేనేజరు ప్లాట్‌ఫారమ్ మీద పరిగెత్తుకుంటూ వచ్చి పూలమాలలతో చిత్రయూనిట్‌ను సత్కరించారు.
తిరుచ్చిలో ఈ సినిమా వాళ్ల కోసం రైలును ఆలస్యంగా నడపాల్సివచ్చింది. మైసూరు రాష్ట్రంలోని తుమ్‌కూర్‌లోనూ ఈ టీం పర్యటించింది. ఈ చిత్రంలో మాటలు, పాటలు, నృత్యాలే ప్రధానాంశాలుగా నిలిచాయి. సంభాషణలు సంస్కృత మిళితమైన హిందీలోనూ, పర్షియన్ మిళితమైన ఉర్దూలోనూ కొనసాగాయి. ఈ చిత్రం కోసం ఏడు పాటలను చిత్రీకరించారు. మొట్టమొదట రికార్డు అయిన పాటను ఎం ఖాన్ పాడారు. రికార్డింగ్ యంత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి వచ్చి, ఇరానీ అనుమతితో ఫకీరు వేషం వేసి, ఆయన పాట పాడటం గమనార్హం.
1931 మార్చి 14...రోజు బొంబాయిలోని మెజెస్టిక్ థియేటర్‌లో భారతదేశపు మొట్టమొదటి టాకీ చిత్రం ఆలం ఆరా విడుదలై ఎనిమిది వారాలపాటు ఏకబిగిన హౌజ్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యింది. అంతకుముందు ఒక మూకీ చిత్ర ప్రదర్శనకు ఆ థియేటర్ బుక్ కావడంతో తొమ్మిదోవారంలో ఈ టాకీని తీసి వేయాల్సి వచ్చింది. బొంబాయితోపాటు ఏకకాలంలో విజయవాడ మారుతి టాకీస్‌లోనూ ఆలంఆరా విడుదలైంది. 1931 జూన్ నెలలో మద్రాసు సినిమా సెంట్రల్‌లోనూ, తర్వాత నెల్లూరు వినాయక్ థియేటర్‌లో విడుదలైంది. మాట్లాడే ఈ కథలే బొమ్మని జనం విరగబడి చూశారు. సెలక్టు టూరింగ్ టాకీస్ కంపెనీ నుంచి టిఎస్ మహదేవ్... మేనేజరు, అసిస్టెంట్‌లతో కలిసి ప్రొజెక్టరు, ఆంప్లిఫియరు, స్పీకర్‌లతో దక్షిణాన టూర్ చేశారు. అప్పుడు వాళ్లు ఏ రైలు దిగినా జనంలోంచి ‘టాకీ వచ్చింది, టాకీ వచ్చింది’ అనే కేకలు, హడావుడి కన్పించేది. వీళ్లకోసం రైల్వే వాళ్లు కూడా ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ చిత్ర యూనిట్ ఎక్కడికి వెళ్ళినా రాచ మర్యాదలు జరిగేవి.
నెల్లూరు వినాయక్ థియేటర్‌లో ‘ఆలం ఆరా’ను ప్రదర్శిస్తున్న సమయంలో ఆ థియేటర్ యజమాని బంధువు ఒకాయన మహదేవ్ దగ్గరికి వచ్చి ...అసలు శబ్దం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అని అడిగారు. దీనికి మహదేవ్ సమాధానమిస్తూ... సౌండ్ అనేది ఒక విధమైన శక్తిఅని.,,, ప్రొజెక్టర్లో ఫిల్మ్ నడుస్తున్నప్పుడు మాటలుగా పుడుతుందని చెప్పారు. ఫిల్ముపై ఉండే ‘గీతల’ ద్వారా శబ్దాలు పుడతాయని, అవి ‘ఆంప్లిఫియర్’ ద్వారా స్పీకర్‌లోకి వెళ్ళి మాటలుగా వినిపిస్తాయని చెప్పారు. వెంటనే ఆయన... సినిమాలోని మాటలు హిందీలోనే ఎందుకుండాలి?. తెలుగులో పాడేవిధంగా చెయ్యరూ... అంటూ అడగడంతో మహదేవ్‌కి చుక్కెదురైంది. తర్వాత మహదేవ్ గ్రూప్ ట్రిచి వెళ్లారు. అక్కడ ప్రదర్శన పూర్తికాగానే...మధుర,సేలం, కుంభకోణంలో పర్యటించింది.
ఆలం ఆరా కథ వివరాల్లోకి వెళితే.... ఇద్దరు పెళ్లాలున్న వృద్ధుడైన రాజుకు పుత్ర సంతానం కలగదు. అయితే భార్యలిద్దరికీ తామే ముందుగా కొడుకును కని రాజుకు బహూకరించాలని తపన పడుతుంటారు. అయితే ఆ ఇద్దరు రాణులలో ఒకరికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుందని ఓ సన్యాసి చెబుతాడు. దాంతో రెండో రాణి....తనకు దక్కని అదృష్టం ఇతరులకు మాత్రం ఎందుకు దక్కాలనే అసూయతో ఏకంగా రాజు కుటుంబాన్నే నాశనం చేయాలనుకుంటుంది. ఇందుకోసం సైన్యాధ్యక్షుడి మద్దతు కోరుతుంది. అయితే సైన్యాధ్యక్షుడు నిజాయితీపరుడు కావటంతో... ఆమె ప్రయత్నాలను అడ్డుకుంటాడు. దీంతో పగబట్టిన ఆ రాణి సైన్యాధ్యక్షుడి కుటుంబాన్ని హత్య చేయిస్తుంది. అయితే ఆ సమయంలో అదృష్టవశాత్తూ సైన్యాధ్యక్షుడి కుమార్తె ప్రాణాలతో బయటపడుతుంది. ఆమె పేరు ఆలం ఆరా అంటే ‘ప్రపంచ సుందరి’ అని అర్థం. ఆమె గిరిజనులు మధ్య పెరిగి పెద్దదై, వారి సాయంతో రాజభవనం మీదకు దండెత్తి కుటిలాత్మురాలైన రాణిని గురించి బహిర్గతం చేస్తుంది. అప్పటికీ యుక్త వయసుకు చేరిన రాకుమారుడు ‘ఆలం ఆరా’ను పెళ్లాడటంతో కథ సుఖాంతమవుతుంది.
ఇదీ ఆనాటి మొట్టమొదటి టాకీ నిర్మాణం, ఆ తర్వాత పరిణామాలు .. మన రాస్ట్రం లో వెండితెరపై సినిమా వచ్చినప్పటి సంగతులు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి..
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
నందమూరి నటసింహం బాలక్రిష్ణ, తెలంగాణా పోరాట యోధుడు "గోన గన్నా రెడ్డి" పాత్రలో ఒక మూవీ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. దాన వీర సూర కర్ణ సినిమా లో అభిమన్యు పాత్ర వేసినా, అక్బర్ సలీం అనార్కలి లో...
0 Comments