మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్
చివరికేమైంది?
ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్‌తో తినేంత ఆస్తి ఉన్న వ్యక్తి జీవితం ఎలా సాగిపోతుందో మనం ఊహించడగలం. అయితే అలాంటి వ్యక్తికి మరణించే నాటికి ఎంత ఆస్తి ఉండాలి? అనే మాట మనమదిలో తలెత్తుతుంది. ఆస్తిమాట దేవుడెరుగు... అప్పుల్లో మునిగి చనిపోయాడంటే నమ్మలేం... కానీ ఇదే జరిగింది... ఇటువంటి దుస్థితిని ఎదుర్కొన్నవ్యక్తి మరెవరో కాదు.... పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్...
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ మరణించే నాటికి నాలుగు వందల మిలియన్ డాలర్ల అప్పులో మునిగిపోయారు. ఆదాయం లేక కాదు... సంపాదించిన డబ్బును ఎలా కాపాడుకోవాలో తెలియక. మనీ మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్ల అప్పుల్లో మునిగిపోయారు. నాటి రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లు చేసేదే డ్యాన్స్ అనుకున్న తెలుగు సినిమా ప్రేక్షకులు చిరంజీవి డ్యాన్స్ చూసి విస్తుపోయారు. ఆయనకు ఫిదా అయ్యారు. ప్రభుదేవాను చూసిన తరువాత వావ్ డ్యాన్స్ అంటే ఇదీ అనుకున్నారు. చిరంజీవి, ప్రభుదేవాలు తెలుగు వారికి తెలిసిన నటులు. ఇలా ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఎంతో మంది డ్యాన్సర్లకు ఏలకలవ్య గురువు మైఖేల్ జాక్సన్. అది శరీరమా? మైనపు ముద్దనా? శరీరాన్ని ఎలా అంటే అలా బొమ్మలా తిప్పేస్తున్నాడని ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అతని ఏకలవ్య శిష్యులే తిరుగులేని హీరోలుగా నిలబడితే ఇక ఆ గురువు ఎలా ఉండాలి? నిజంగా ఎలా ఉండాలో అలా లేరు. మైఖేల్ జాక్సన్ మరణించిన తరువాత వేల కోట్ల ఆస్తుల మాట కాదు కదా... నిండా అప్పుల్లో మునిగిపోయాడని తెలిసి ప్రపంచం విస్తుపోయింది. శరీరాన్ని ఎటు పడితే అటు తిప్పడంలో నైపుణ్యం సాధించారు కానీ మనీ మేనేజ్‌మెంట్‌లో మైఖేల్ జాక్సన్ ఘోరంగా విఫలమయ్యారు. తన పిల్లలకు తనను నమ్ముకున్న వారికి ఏమీ మిగల్చకుండా పోయారు.
పాప్ సామ్రాజ్యపు రారాజుగా మైఖేల్ జాక్సన్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 20 మంది టాప్ సింగర్స్ రంగంలో నిలిచిన పోటీలో... 103 దేశాల నుంచి పది మిలియన్ ఓటర్లు మైఖేల్ జాక్సన్‌ను మొదటి స్థానంలో నిలిపారు. మైఖేల్ జాక్సన్ రూపొందించిన 61 మిలియన్ అల్బమ్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. లెక్కలేనంత డబ్బు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. 17 మిలియన్ డాలర్లతో 1988లో కాలిఫోర్నియా వద్ద నెవర్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడమే అతని ఆర్థిక ఇబ్బందులకు కారణమని చెబతుంటారు. నెవర్ ల్యాండ్‌లో ఉద్యోగి కుమారునిపై అభ్యంతరకరంగా వ్యవహరించారని 2004 లో మైఖేల్ జాక్సన్‌పై ఒక కేసు నమోదైంది. ఆ కేసులో ఆయన్ని అరెస్టు చేశారు. కేసులో రాజీ కోసం డబ్బు బాగానే ఖర్చు చేశారనే వార్తలు వినిపించాయి. విచ్చల విడిగా డబ్బు ఖర్చు, సరైన ప్రణాళిక లేకుండా పెట్టుబడులు పెట్టడం, కోర్టుల కేసులతో మైఖేల్ జాక్సన్ నిండా మునిగిపోయారు. తనపై ఉన్న కేసుల విచారణలో న్యాయవాదులకే 22 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేశారు. తన శరీరం రంగును మార్చుకోవడానికి వైద్య ఖర్చులకే 61 వేల డాలర్లు ఖర్చు చేశారు.
ఒకవైపు కోట్ల రూపాయలు సంపాదిస్తూ, మరోవైపు తన ఖర్చుల కోసం, జాక్సన్ బ్యాంకుల్లో అప్పు కూడా చేశాడు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో రెండువందల మిలియన్ డాలర్ల అప్పు చేశారు. 4.5 మిలియన్ డాలర్ల వడ్డీ కట్టేవారు. ప్రపంచ వ్యాప్తంగా జాక్సన్‌కు పేరు, బోలెడు సంపాదన ఉన్నా ప్రమాదాన్ని గ్రహించిన అమెరికా బ్యాంకు జాక్సన్ అప్పును ఇతరులకు అమ్మేసింది. అమెరికాలో బ్యాంకులు ఇలా అప్పులను అమ్ముకునే సౌకర్యం ఉంది. లెక్కల్లో తేడాలు ఉండొచ్చు కానీ మైఖేల్ జాక్సన్ మరణించే నాటికి నిండా అప్పుల్లో మునిగిపోయారనేది మాత్రం వాస్తవం. ఎంతటి క్లిష్టమైన చికిత్సనైనా పొందే స్థాయిలో ఉన్న మైఖేల్ జాక్సన్ 48 ఏళ్లకే తనువు చాలించారు.
ఎంత సంపాదిస్తున్నారని కాదు.. సంపాదించిన డబ్బు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారనేది ముఖ్యం. సావిత్రి నుంచి మైఖెల్ జాక్సన్ వరకు అందరిదీ ఇదే కథ. ఆమధ్య విడుదలైన మహానటి సినిమా తరువాత మరోసారి సావిత్రి జీవితం గురించి అందరూ చర్చించుకున్నారు.... కన్నతల్లి తప్ప నన్ను అందరూ మోసం చేశారు. స్పృహలో ఉంటే ఆ మోసాన్ని తలుచుకుంటూ ఉండలేను. అందుకే మద్యానికి అలవాటు పడ్డాను అని సావిత్రి చెప్పుకొచ్చారు. హీరోలను మించి పాపులారిటీ, డబ్బు సంపాదించిన సావిత్రి చివరి దశలో ఏమీ లేకుండా అద్దె ఇంట్లో తనువు చాలించారు. నమ్మిన వారు అందరూ ఆమెను మోసం చేశారు. తండ్రి లేని బిడ్డ.... చిన్నప్పటి నుంచే బంధువుల ఇంట్లో పెరగడం, సినిమాల కోసం ప్రయత్నాలతో ఆమెకు లోకం ఎలా ఉంటుందో తెలియకుండా పోయింది.
సావిత్రి జీవితానికి మైఖేల్ జాక్సన్ జీవితానికి సంబంధం లేకపోవచ్చు కానీ.. సావిత్రి అయినా మైఖేల్ జాక్సన్ అయినా మరొకరైనా తమ రంగంలో అత్యున్నత స్థానానికి వెళ్లి ఎంత సంపాదించినా, సంపాదించిన డబ్బును ఏం చేస్తున్నామనే అవగాహన ఉండాలి. వారి వారి రంగాల్లో వారు అత్యున్నత స్థాయికి చేరి ఉండవచ్చు. ఆ స్థానం శాశ్వతం కాదు. ఆ స్థాయి గుర్తింపు, ఆదాయం శాశ్వతం కాదు. ఎందుకంటే వయసు మీరుతుంది. ఆ రంగంలో పోటీ పెరుగుతుంది. కాలం మారుతుంది. కాలం మారినప్పుడు మన స్థానం మారవచ్చు అనే అవగాహన ఉండాలి. ఇలాంటి వారి జీవితాలు ప్రముఖులకే కాదు. అందరికీ ఒక చక్కని గుణపాఠం. మనీ మేనేజ్‌మెంట్ తెలియకపోతే చివరి దశలో అష్టకష్టాలు తప్పవు. జీవితం చివరి దశ కూడా బాగుండాలంటే ప్రారంభంలోనే జీవితం పట్ల సరైన అవగాహన అవసరం అని ఇలాంటి వారి జీవితాలు లోకానికి చాటి చెబుతున్నాయి.
ఆర్థిక నిపుణులు డబ్బు లక్షణాలు వివరిస్తూ మీవద్ద కూడా సంపద నిలిచి ఉండాలంటే ఏం చేయాలో వివరించారు. మన వద్ద డబ్బు నిలవాలి అంటే ముందు ఆ డబ్బుకుండే లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలి. ప్రధానంగా డబ్బుకు తగిన గౌరవం, విలువ ఇచ్చినవారి వద్దనే అది నిలుస్తుంది. అంటే మీ వద్ద డబ్బు నిలవాలి అంటే దానికి తగిన గౌరవం ఇవ్వాలి. డబ్బు మనిషి కాదు కదా? దానికి గౌరవం ఇవ్వడం ఏమిటీ అనుకోవద్దు. అది మనిషి కాకపోయినా మనిషిలా స్పందించే గుణం లేకపోయినా, మాట్లాడక పోయినా డబ్బు తనకు విలువ ఇస్తున్నారా, లేదా.. అని గ్రహించే శక్తి దానికి ఉంటుంది. విలువ ఎలా ఇవ్వాలి అంటే మీ జీతం, సంపాదన ఎంతైనా కావచ్చు దానిలో కనీసం ఒక పది శాతం పొదుపు చేయాలి, అలా పొదుపు చేసిన డబ్బును తనకు, తన కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే విధంగా ఇన్వెస్ట్ చేయాలి. చాలా మంది ప్రతి నెలా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. తిరిగి ఏదో పని పడినప్పుడు ఆ డబ్బును ఖర్చు చేస్తారు. మా వద్ద డబ్బు నిలవడం లేదు అని ఆవేదన చెందుతారు. ఆరంభశూరత్వం అన్నట్టు ఐదారు నెలలు పొదుపు చేయడం కాదు. కనీసం పది శాతం పొదుపు చేయడం అనేది సంపాదన ప్రారంభించినప్పటి నుంచీ ఉండాలి. వీలుంటే పొదుపు లేదంటే లేదు అనే వైఖరి కాకుండా క్రమం తప్పకుండా ఈ పొదుపు ఉండాలి. రెగ్యులర్‌గా పొదుపు చేసి మదుపు చేసేవారి వద్దనే డబ్బు నిలుస్తుంది. సంపద సమకూరుతుంది.
మీకు తెలిసిన మరికొన్ని మనీ మేనేజిమెంట్ సూత్రాలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మొదట చైనా పప్పెట్, తర్వాత మిలిటరీకి సరెండర్, ఇప్పుడు అతివాదులకు సలాం.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి చివరకి పట్టబోయే గతేంటి? తాజా పరిణామాల నేపధ్యం లో పాకిస్తాన్ ఏం కాబోతోంది? ఈ వీడియోలో...
0 Comments