నెపోలియన్ జీవిత చరిత్ర మొదటి భాగం:
నెపోలియన్ బోనపార్టీ ఆగష్టు 15, 1769 న కొర్సికా దీవిలో అజోసియాలో, ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు... తండ్రి కార్లో బోనపార్టీ, తల్లి లెటిజియా రామోలినో.. .. ఫ్రాన్స్ కు చెందిన సైన్యాధ్యక్షుడు, రాజకీయ నాయకుడు గా నెపోలియన్ వెలుగొందాడు. 1785 లో ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్ నెంట్‌గా నియమితుడయ్యాడు. నెపోలియన్ తన శక్తి యుక్తులతో ఐరోపా చరిత్రపై బలమైన ముద్ర వేశాడు..
మొదటి భాగం లో అతడి బాల్యం, చక్రవర్తిగా అతడు సాధించి విజయాల గురించి తెలుసుకుందాం.. రెండవ భాగం లో నెపోలియన్ పతనానికి కారణాలు, చివరి నాళ్ళలో తన జీవితం ఎలా గడిచింది అనే అంశాలు తెలుసుకుందాం..
నెపోలియన్ యుక్తవయసులో పారిస్ లో చదువుకున్నాడు. అతనికి చరిత్ర, రాజనీతి శాస్త్రము, గణితం, తత్వ శాస్త్రాల మీద ఎక్కువగా ఆసక్తి వుండేది. నెపోలియన్ మీద రూసో ప్రభావం అధికంగా వుండేది.
1792 లో ఫ్రెంచి విప్లవం జరుగుతున్న రోజుల్లో నెపోలియన్ అక్కడ జరుగుతున్న అరాచకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఫ్రెంచి విప్లవాన్ని అంతం చేయడానికి యూరోపియన్ దేశాలు చేసిని ప్రయత్నాల్లో భాగంగా 1793 లో ఫ్రెంచ్ నావికాదళ కమాండర్ "టేలర్" ను పట్టుకోవడానికి ఆంగ్ల నౌకాదళం ఫ్రాన్స్ మీద దాడి చేసింది. నెపోలియన్ వారిని సమర్ధవంతంగా నిలువరించాడు. ఈ విజయం తరువాత అతనిని "బ్రిగేడియర్ జనరల్" గా పదోన్నతి కల్పించారు. 1795 అక్టోబరు లో ఫ్రాన్స్ ప్రజలు "జాతీయ సమావేశానికి" వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, విప్లవ, రాజరిక వాదుల నుండి రాజ్యాంగాన్ని రక్షించడం లో నెపోలియన్ మరొకసారి విజయం సాధించాడు. నెపోలియన్ సాధించిన ఈ విజయం వల్ల అతనిని సైనికాధిపతిగా నియమించారు.
నెపోలియన్ ఆస్ట్రియా, ఇటలీ దేశాలమీద దాడిచేసి విజయం సాధించాడు. నెపోలియన్ ఇటలీ మీద చేసిన దాడి వలన ఇటలీ కూడా లాభపడింది. అప్పటివరకు అనేక ప్రాంతాలుగా విడిపోయి వున్న ఇటలీని నెపోలియన్ తన తెలివితేటలతో, సంస్కరణలతో "ఇటలీ రిపబ్లిక్" ను ఏర్పాటు చేసాడు. ఇటలీలో జాతీయవాదాన్ని ప్రేరేపించాడు. ఆస్ట్రియా, ఇటలీ యుద్ధాలు నెపోలియన్ వ్యక్తిగత ఘనతను పెంచాయి. నెపోలియన్ సాధించిన ఈ అద్భుత విజయాల వల్ల అతనిని ఫ్రెంచి ప్రజలు గొప్పనాయకుడిగా గౌరవించారు.
ఫ్రాన్స్ శత్రువయిన ఇంగ్లాండును ఓడించడానికి సిద్దపడ్న సైన్యానికి నెపోలియన్‌ను అధిపతిగా "డైరెక్టరీ" నియమించింది. విస్తృతమయిన నౌకాబలం లేకుండా ఇంగ్లాండు ను ఓడించడం కష్టమని, ఇంగ్లాండుకు కీలకమయిన ఈజిప్టు మీద 1798 మే నెల లో నెపోలియన్ దాడిచేసాడు. పిరమిడ్ యుద్ధంలో విజయం సాధించినప్పటికీ, ఇంగ్లాండు నౌకాథిపతి నెల్సన్ చేతిలో పరాజయం పొందాడు. దీంతొ నెపోలియన్ ఫ్రాన్స్ కు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఫ్రాన్స్ ను ఐదుగురు సభ్యులతో కూడిన డైరెక్టరీ పాలకమండలి పరిపాలించేది. ఈ పాలకమండలిలో ఐక్యత కొరవడింది. శక్తివంతమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లో విఫలం చెందింది.. తగాదాలు, కుట్రలతో పాటూ సాంఘిక, ఆర్థిక అక్రమాలు సర్వ సాధారణమయ్యాయి. డైరెక్టరీ విధానం క్రమ క్రమంగా ప్రజల మద్దతును కోల్పోయింది. ఫ్రాన్స్ అంతరంగిక పరిస్థితి దెబ్బతింది. ఖర్చు మితిమీరిపోయింది. ప్రజలు "పాలన" లో మార్పును కోరుకున్నారు. పటిష్ఠమయిన, సమర్దవంతమయిన పరిపాలన కోసం ఎదురు చూశారు. అదే సమయానికి నెపోలియన్ ఫ్రాన్స్ చేరుకుని తన సైన్యంతో పాటూ శాశన సభ లోకి ప్రవేశించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. నెపోలియన్ "అధికారాన్ని" చేపట్టిన తరువాత, కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాడు. ఈ ప్రభుత్వం 1799-1804 ల మధ్య కొనసాగింది.
నెపోలియన్, ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా వున్న ఇంగ్లాండు, ఆస్ట్రియా దేశాలతో సంధి కుదుర్చుకొని యుద్ధాల నుండి ఫ్రాన్స్ ను కాపాడి శాంతి ఏర్పరిచాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని పునర్మించడానికి తన విలువైన కాలాన్ని వినియోగించాడు. ప్రజల మధ్య సాంఘిక, ఆర్థిక సమానత్వాన్ని కల్పించడానికి ప్రయత్నించాడు. నెపోలియన్ దృష్టి లో "ఫ్రాన్స్ ప్రజలకు కావలిసినది సమానత్వం, కానీ స్వేచ్చ కాదు". దేశ శాంతిభద్రతల కోసం బలమయిన కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు.
"ప్రజలకు కావలిసినది మతం, కాని ఆ మతం ప్రభుత్వ ఆధీనంలో వుండాలి" అని నమ్మాడు.. విప్లవకాలంలో రూపొందించిన రాజ్యాంగం కారణంగా సమాజంలో ఒక వర్గం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుందని గ్రహించి రోమన్ కేథలిక్ చర్చి యొక్క మతాధికారి అయిన పోప్ తో ఒక ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ఈ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ లో మతాచార్యుల నిర్వాహణ బాధ్యతలను నెపోలియన్ స్వీకరించాడు. చర్చి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనపరుచుకోవడానికి పోప్ అంగీకరించాడు. మతాచార్యులను ప్రభుత్వం నియమిస్తే వారిని పోప్ అనుమతిస్తాడు. వారంతా ప్రభుత్వానికి విధేయత ప్రకటించాలి.
ఫ్రెంచి విప్లవానికి ముందు ఫ్రాన్స్ లో నిర్ణీత న్యాయవ్యవస్థ లేదు. విభిన్న న్యాయవిధానాలు అమలులో ఉండేవి. నెపోలియన్ వీటన్నింటినీ ఏకం చేసి, ప్రఖ్యాత న్యాయ సలహాదారుల సహాయంతో "నెపోలియన్ న్యాయ స్మృతి" ని రూపొందించాడు. దీనిని సివిల్, క్రిమినల్, వాణిజ్య స్మృతులుగా విభజించారు. నెపోలియన్ రూపొందించిన న్యాయస్మృతి వల్ల ప్రజలకు స్థిరమయిన, క్రమమయిన న్యాయం లభించడమే గాక, త్వరగా, తక్కువ ఖర్చుతో, విశ్వాస పాత్రమయిన న్యాయం లభించింది.
ఫ్రెంచి విప్లవం సంభవించడానికి ఆర్థిక సమస్యలు ముఖ్యకారణమని నెపోలియన్ గుర్తించాడు. ఫ్రాన్స్ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఆయన ప్రయత్నించాడు. దేశం మొత్తానికి ఒకే విధమైన పన్ను వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టి, అవినీతి ఉద్యోగులను కఠినంగా శిక్షించాడు. వ్యయంలో దుబారా తగ్గించాడు. దేశీయ పరిశ్రమలను ప్రొత్సహించాడు. నదుల మీద ఆనకట్టలు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేసాడు. 1800 వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ ను స్థాపించాడు. నాణాల చెలమణీని క్రమబద్దం చేసాడు.
మొదటి కౌన్సిల్ గా అధికారం చేపట్టిన తరువాత నెపోలియన్ తన స్థానాన్ని భద్రపరచుకోవడానికి వీలుగా అనేక చర్యలు చేపట్టాడు. క్రమ క్రమంగా కొన్నేళ్ళ కాలం లో ఈ లక్ష్యాన్ని చేరుకో గలిగాడు. 1804 డిసెంబరు 2 న పోప్ చేత నెపోలియన్ "చక్రవర్తి" గా పట్టాభిషిక్తుడయ్యాడు. ఫ్రాన్స్ లో తిరిగి రాచరికం పునరుద్దరింబడినప్పటికీ, ఫ్రెంచి విప్లవ ఫలితాలు ప్రజలకు అందించ బడ్డాయి.
ఫ్రాన్స్ చక్రవర్తిగా నెపోలియన్ అధికారం లోకి వచ్చిన తరువాత కొన్ని రాజ్యాలపై చేసిన దాడుల ద్వారా ఐరోపా ను తిరిగి ఏకం చేశాడు. ఇంగ్లాండును అణచివేయడానికి అనేకమార్లు ప్రయత్నించాడు కానీ విఫలం చెందాడు.
పరోక్ష యుద్ధంలో ఇంగ్లాండును ఓడించడానికి ప్రసిద్ది చెందిన "ఖండాంతర" విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానం ద్వారా ఇంగ్లాండు కు చెందిన వర్తక, వ్యాపారాలను ధ్వంసం చేయాలని భావించాడు. తమ ఓడరేవులలో ఇంగ్లాండు ఓడల ప్రవేశాన్ని నిషేధించమని తన సామంత రాజ్యాలను కోరాడు. ఫలితంగా ఫ్రాన్స్ లో కూడా వివిధ రకాల వస్తువుల ధరలు పెరిగి పోయాయి. పేద ప్రజలు తమ నిత్యావసరాలకు కూడా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అందువల్ల ప్రజలు తమ కష్టాలకు నెపోలియన్ కారణమని భావించి అందరూ అతడిని నిందించడం ప్రారంభించారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా తన ఖండాంతర విధానాన్ని సమర్ధవంతంగా అమలుపరచడానికి రష్యా, పోర్చుగల్, స్పెయిన్ దేశాలమీద యుద్ధాలు ప్రకటించాడు. అతడు చేపట్టిన ఈ అనాలోచిత చర్యలన్నీ కాలక్రమం లో అతని పతనానికి కారణం అయ్యాయి.
నెపోలియన్ ను అణచివేయడానికి ఇతర ఐరోపా దేశాలన్నీ కూటమిగా ఏర్పడ్డాయి. స్వీడన్, రష్యా, ఆస్ట్రియా లతో అప్పటి ఇంగ్లాండు ప్రధానమంత్రి "పిట్" ఒక నూతన కూటమిని ఏర్పరిచాడు. ఈ విధంగా ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా మూడవ కూటమి ఏర్పడింది. కూటమి విషయం తెలిసిన వెంటనే నెపోలియన్ ఆస్ట్రియా మీదకు సైన్యాలను పంపించి రష్యా, ఆస్ట్రియా సైన్యాల మీద జరిగిన యుద్దం లో ఘనవిజయం సాధించాడు. ఈ యుద్ధంతో మూడవ కూటమి విచ్చిన్న మవడయే కాక ఆస్ట్రియా అవమానకరమైన రీతిలో "ప్రెస్ బర్గ్" సంధి కి అంగీకరించవలసి వచ్చింది. ఈ సంధితో నెపోలియన్ ఖ్యాతి మరింత విస్తరించింది. ఈ యుద్ద విజయం తరువాత నెపోలియన్ తన దృష్టిని రష్యా మీద నిలిపాడు. 1807 లో "ఫ్రీడ్ లాండ్" యుద్ధంలో రష్యన్ సైన్యాలపై గొప్ప విజయం సాధించి, నాటి రష్యా చక్రవర్తి "జార్" తో "టిల్ సిట్" సంధి కుదుర్చుకున్నాడు. ఈ సంధి అనంతరం నెపోలియన్ రాజ్యం గణనీయముగా అభివృద్ధి చెందింది. ఖండాంతర విధానాన్ని వ్యతిరేకించిన కారణంగా నెపోలియన్ తన సోదరుడైన లూయి నెపోలియన్ ను హాలెండ్ రాజ్య సింహాసనం నుండి తొలగించి హాలెండ్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఉత్తర జర్మనీలో బాల్టిక్ సముద్రం వరకూ గల విశాల ప్రాంతాన్ని నెపోలియన్ ఆక్రమించాడు. స్పెయిన్, ఫ్రాన్స్ కు సామంత రాజ్యంగా ఏర్పడింది. స్పెయిన్ పాలకునిగా నెపోలియన్ సోదరుడు జోసఫ్ నియమింప బడ్డాడు. పోర్చుగల్ కూడా స్పెయిన్ ను అనుసరించింది. ఆస్ట్రియా కూడా బలహీనంగా మారింది. జర్మనీ కూడా ఫ్రాన్స్ కు లోబడి ఉండే విధంగా చేసి తాను దానికి సంరక్షకుడిగా అధికారాన్ని స్థాపించాడు. ఈ విధంగా నెపోలియన్ "యూరప్" మొత్తానికి అధిపతి అయ్యాడు. "ఫ్రాన్స్", యూరప్ మొత్తానికీ "రాజకీయ రాజధాని" అయింది.
ఈ విధంగా నెపోలియన్ తన రాజకీయ జీవితాన్ని అనేక మలుపులుతిప్పుతూ ప్రజల మన్ననలను చూరగొన్నాడు..
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments