టీచర్లు చెప్పే ఆన్‌లైన్ పాఠాలు 70 శాతం మందికి అర్థం కావట్లేదని తాజా సర్వేలో వెల్లడి..
ఫీజుల కోసం పాఠాలు చెప్తున్నారని వాపోతున్న తల్లిదండ్రులు..
మొత్తానికి టెన్త్ పాసయ్యాం.. మరిప్పుడేంటి?
ఇలాంటి ఆశక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆన్‌లైన్ పాఠాలు అర్థం కావడం లేదని 70% మంది విద్యార్థులు అభిప్రాయపడుతున్నట్టు ఓ ప్రముఖ సర్వే వెల్లడించింది.
లోకేష్ రెండో తరగతి స్టుడెంట్.. రోజూ ఆడుతూ పాడుతూ స్కూల్‌కి వెళ్లే వాడు.. స్కూల్లో ఆటలు, పాటలు, చదువు అన్నింటిలో ముందుండేవాడు. కానీ లాక్ డౌన్ పుణ్యమా అని స్కూల్‌కి వెళ్లలేని పరిస్థితి.. ఇంట్లోనే అన్నీ.. ఆన్‌లైన్ చదువు.. ఇంట్లోనే ఆటలు. ప్రారంభంలో బాగానే ఉన్నా రాను రాను ఎందుకో తెలియని ఒత్తిడితో కనిపించేవాడు. తల్లిదండ్రులు గమనించి అడిగితే ఆన్‌లైన్ పాఠాలు అర్థం కావట్లేదని చెప్పాడు.
లోకేష్ ఒక్కడే కాదు.. దాదాపు అందరు విద్యార్థులదీ ఇదే పరిస్థితి. లాక్ డౌన్ పేరుతో రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాయి కానీ విద్యార్థుల బుర్రలోకి అవి ఏ మేరకు ఎక్కు తున్నాయన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. తరగతి గదిలో కూర్చుని పాఠాలు వింటేనే కనీసం 30% మంది విద్యార్థులు శ్రద్ధ పెట్టలేరని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇక ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్‌లో గేమ్స్ ఆడకుండా... పాఠాలు ఏ మేరకు వింటారనేది సందేహాస్పదమే. ఆన్‌లైన్ పాఠాలు అర్థం కావడం లేదని 70% మంది విద్యార్థులు అభిప్రాయపడుతున్నట్టు ఇటీవల ఓ సర్వేలో వెల్లడి కావడం గమనార్హం.
ఈ దుస్తితికి కారణాలు ఏమిటి?
- వీడియో కాల్ లో టీచర్ చెప్పింది వినడమే కానీ.. ఏమైనా సందేహాలుంటే అడిగే పరిస్థితి లేకపోవడం..
- టీచర్ చెప్పినంత సేపు ఏకాగ్రతతో వినలేక పోవడం..
- ఇంటర్నెట్ సమస్య ఏర్పడితే క్లాసు మధ్యలో ఆగిపోవడం..
- స్మార్ట్ ఫోన్‌లో గేమ్స్ ఆడడమే కానీ.. పాఠాలు వినే ఓపిక విద్యార్థులకు లేకపోవడం..
- డబ్బులు పెట్టి కొనిచ్చాం..ఖచ్చితంగా పాఠాలు వినండంటూ తల్లిదండ్రుల ఒత్తిడి..
- ఆన్‌లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుందంటూ గంటల ముందు నుంచే సెల్‌ఫోన్లు ఆపరేట్ చేస్తుండడం.. కంప్యూటర్ల ముందు కూర్చుని పిచ్చాపాటి బ్రౌజింగ్ చేస్తున్న కారణంగా విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాఠం ప్రారంభం అయిన తర్వాత వాట్సాప్‌లో వచ్చే ఫోటోలు, వీడియో రూపంలో కనిపించే చిన్న అక్షరాలను చూసుకుని మళ్లీ నోట్సు రాసుకోవడం వారికి తలకు మించిన భారంగానే మారింది.
- ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభం అయిన విద్యార్థుల పరిస్థితి అలా ఉంటే ఇంకా ఆన్‌లైన్ పాఠాలు మొదలు కాని విద్యార్థులు మరో టెన్షన్ అనుభవిస్తున్నారు. తమ పక్కనే ఉండే మరో విద్యార్థి చదువుకుంటుంటే తాను ఇంకా చదువుకోవడం లేదనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. చదువుల్లో వెనుకబడతామేమోననే భయం వ్యక్తమవుతోంది. ఇదే ఆందోళన, ఆదుర్దా ఇంకా ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభం కాని విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ కనిపిస్తోంది.
పాఠాలయితే వింటున్నాం కానీ పరీక్షలు ఆన్‌లైన్‌లో ఎలా నిర్వహిస్తారో అనే ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. పోటీపరీక్షలు రాసేంత వయసు, అవగాహన వచ్చిన తర్వాతే ఆన్‌లైన్‌లో పరీక్షలు రాయడం సాధ్యం అవుతుందని, అలా కాకుండా చిన్న వయసులోనే కంప్యూటర్, సెల్‌ఫోన్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారో అనే ఉత్కంఠ కూడా తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం..
లాక్ డౌన్ నేపథ్యంలో విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకంటూ తెరపైకి వచ్చిన ఆన్‌లైన్ తరగతుల గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. గతంలో వృత్తి విద్యా కోర్సులకు మాత్రమే పరిమితమైన ఈ ఆన్‌లైన్ తరగతులు ఇప్పుడు ఎల్‌కేజీ వరకు వచ్చేశాయి.
ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లు, సెమీ కార్పొరేట్ స్కూళ్లు ఈ ఆన్‌లైన్ క్లాసుల విషయంలో దూసుకుపోతున్నాయి. భారీగా ఫీజులు వసూలు చేసుకునేందుకు జూన్ నుంచే తరగతులు ప్రారంభించాయి. ఈ క్లాసులు యాక్సెస్ అయ్యేందుకు పాస్‌వర్డ్ ఇవ్వాలన్నా వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి.
విద్యార్థులకు అసలు ఆ పాఠాలు అర్థం అవుతున్నాయా? లేదా? అన్నది ఓ పెద్ద ప్రశ్న. అయినప్పటికీ ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించాం కాబట్టి ఫీజులు చెల్లించడంటూ తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించిన కార్పొరేట్, సెమీ కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలైతే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లకు వచ్చి ఫీజు అగ్రిమెంట్ చేసుకొని మొదటి టర్మ్ ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచాయి.
అంతేకాదు యాజమాన్యాలు ఆ ఫీజల వసూలుకు ప్రిన్సిపాళ్లు, క్లాస్ టీచర్లకు టార్గెట్లను విధించాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన ఫీజులను చెల్లించేలా చూడాలని, అలా అయితే సగం జీతం ఇస్తామంటుండటంతో టీచర్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
లేకపోతే జీతం ఇవ్వమని యాజమాన్యాలు తెగేసి చెబుతుండటంతో టీచర్లు ఆవేదన చెందుతున్నారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో సార్.. కొంత ఫీజైనా చెల్లించండి.. అంటూ రోజూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి బతిమిలాడుకోవాల్సిన దుస్థితిలో పడ్డారు.
ఆన్‌లైన్ తరగతులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని తాము ఎవరికీ చెప్పలేదని చెపుతోంది. మరోవైపు ఆన్‌లైన్ పాఠాల వల్ల విద్యార్థులకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదని విద్యావేత్తలంటున్నారు. విద్యార్థులు ఇంట్లో శ్రద్ధగా ఆన్‌లైన్ పాఠాలు వినడం లేదని, ముఖ్యంగా ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి లోపు పిల్లలకు అసలు ఆన్‌లైన్ అంటేనే తెలియడం లేదని, వారు ల్యాప్‌టాప్‌లు ముందు పెట్టుకుని, స్మార్ట్ ఫోన్లలో చూస్తూ పాఠాలు నేర్చుకోలేకపోతున్నారని ఇప్పటికే కొన్ని సర్వేలు తేల్చి చెప్తున్నాయి.
రికార్డెడ్ వీడియో పాఠాలు పెద్దగా విద్యార్థులకు ఉపయోగపడడం లేదని, లైవ్ తరగతులను విద్యార్థులు సరిగా వినడం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆన్‌లైన్ పాఠాలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఆన్‌లైన్ తరగతుల వల్ల చిన్న పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం ఉంటుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఎన్‌ఎస్) సంస్థ ఇది వరకే పేర్కొంది.
దీంతో కర్నాటక ప్రభుత్వం కేజీ నుంచి 5వ తరగతి వరకు ఆన్‌లైన్ పాఠాలను నిషేధించింది కూడా. ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్, వీడియో, టీవీ పాఠాల విషయంలో ఏం చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అంతుపట్టడం లేదు. మరోవైపు ఆన్‌లైన్ పాఠాల కోసం కొత్త ఫోన్లు, కంప్యూటర్లు కొనుగోలు చేయలేక, ప్రైవేటు విద్యాసంస్థలకు ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అగచాట్లు పడుతున్నారు.
ఈ దుస్తితికి ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడమంటే కష్టమే. కానీ ప్రభుత్వాలు అందిరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల అవగాహన సామర్థ్యం, వాళ్లు చదువుతున్న తరగతి, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే తల్లిదండ్రులు చదువుకున్న వారైతే ఇంట్లోనే రోజు ఉదయం ఒక గంట.. సాయంత్రం ఒక గంట చదివించడం మంచిది. పిల్లలు చదువుకు దూరం కాకుండా.. మరిచిపోకుండా ఉంటారు. ఇక చదువులేని తల్లిదండ్రులు ఆయా ఊర్లలో చదువుకున్న వారి దగ్గరకు పంపడం మంచిది. ఎందుకంటే గ్రామాల్లో మహమ్మారి బాగా తక్కువగా ఉంది కనకు కొంచెం ధైర్యం చేయొచ్చు.
ఇదీ పరిస్తితి..
ఇక ఈ విషయం ఇలా ఉంటే టెన్త్ పాసైన విద్యార్థులకు తెలంగాణా ప్రభుత్వం గుడ్‌న్యూస్ తీసుకువచ్చింది.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే టెన్త్ విద్యార్థులకు మంచి అవకాశం లభించింది.
తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాల (టీఎస్‌ఆర్‌జేసీ) ప్రవేశ పరీక్షలో అర్హత సాధించేందుకు విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన పాఠ్యాంశాలను జులై 20 (సోమవారం) నుంచి టీశాట్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రసారం చేస్తున్నారు.
నిపుణ, విద్యా ఛానళ్ళలో ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు సంబంధిత ప్రసారాలు 25 రోజులు ఉంటాయి. ప్రవేశ పరీక్ష ఐదు సబ్జెక్టులు ఇంగ్లీష్, మ్యాధ్స్, ఫిజికల్‌సైన్స్, బయాలజీ, సొషల్‌స్టడీస్ సబ్జెక్టుల ఆధారంగా నాలుగు గ్రూపులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించనున్నారు.
నిపుణ ఛానెల్‌లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు.. అవే పాఠ్యాంశాలను తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విద్యాచానెల్లో ప్రసారమవుతాయి. ఆగస్టులో టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రసారాలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చు.
మొత్తం 35 కాలేజీల్లో 20 బాలికల కాలేజీలు, 15 బాయ్స్ కాలేజీలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం మరిన్ని వివరాలను www.tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోని వాళ్లు ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరితేదీ ఆగస్టు 5, 2020.
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
0 Comments