గంగవ్వ.. ఇప్పుడీమె గురించి తెలియని తెలుగు వారు ఉండరు.. ఈమె జీవిత చరిత్ర వింటే చదువుకుని ఖాళీగా ఉంటున్న అనేకమంది యువత ముక్కున వేలేసుకోవాల్సిందే.. జీవితం లో ఎదగాలంటే చదువొక్కటే సరిపోదు, ఆత్మ స్థైర్యం, దూసుకుపోయే మనస్తత్వం ఉండాలి అని గంగవ్వ నిరూపించింది.. తెలంగాణా యాస లో అనర్గళంగా మాట్లాడడం తప్ప ఆమెకు ఏమీ తెలియదు, అయితేనేం, నేడు ఆమె యూట్యూబ్ సెన్సేషన్.. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో అడుగుపెట్టి మరింత ఫేమస్ అయిన “గంగవ్వ” లైఫ్ లోకి ఒకసారి తొంగిచూద్దామా?
ఆమె సొంతూరు జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని లంబాడి పల్లి... అనిల్, శ్రీకాంత్ అనే ఇద్దరు యువకులు "మై విలేజ్ షో" అనే యూట్యూబ్ చానెల్ నడుపుతూ ఉండేవారు. అయితే ఒక షార్ట్ ఫిల్మ్ లో భాగంగా వాళ్ళు గంగవ్వ వద్దకు వెళ్ళి సరదాగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అడిగారు.. ఆమె ఉత్సాహంగా చెప్పిన ఆ సమాధానాలు, హావభావాలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.. ఇంకేముంది.. మై విలేజ్ షో లో ఆమె చుట్టూ కొన్ని ప్రశ్నలు, లేదా ఆమెకు తగ్గట్టు కొన్ని కధ లు అళ్ళి ఆమెతో మంచి మంచి వీడియోలు రూపొందించి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవారు.. దీంతో గంగవ్వ పేరు యూట్యూబ్ ప్లాట్ ఫాం లో సెన్సేషన్ అయ్యింది..
యూట్యూబ్ స్టార్ కాకముందు ఆమె ఓ వ్యయసాయ కూలి. ముగ్గురు పిల్లలు. పెళ్లిళ్లు అయిపోయాయి. వాళ్లమ్మ నటనాచాతుర్యం, పేరుప్రఖ్యాతులకు ముచ్చటపడ్తున్నారు పిల్లలు. అన్నట్టు మిల్కూరి గంగవ్వకు సినిమా అవకాశాలూ వచ్చాయి.. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో. ‘‘నన్ను చూసేటందుకు హైద్రవాద్, దుబాయ్, మస్కట్ కెంచి వస్తుండ్రు. సంతోషంగా ఉంటది కదా మరి’’ అంటారు గంగవ్వ. ఆమెను చూడ్డానికి వచ్చే అభిమానులతో ఓ పర్యాటక కేంద్రంగా మారిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
గంగవ్వ నాయన లచ్చయ్య ఆమెకు ఊహ తెలియక ముందే కన్నుమూశాడు. పదమూడేళ్ల వయసులో అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తమ్ముళ్ల బాధ్యత గంగవ్వే తీసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె భర్త గంగయ్య ఏ పనీ చేయక తాగుడుకు బానిసయ్యాడు. ఏ రాత్రీ గొడవ లేకుండా తెల్లారలేదు. పగటిపూట కూలి పనులకు వెళుతూ, రాత్రిపూట బీడీలు చుట్టేది. కంటినిండా నిద్ర అన్న విషయమే మర్చిపోయింది. బాగా సంపాదిస్తానని మా ఆయన పదిహేనేళ్ల క్రితం గల్ఫ్‌కి వెళ్లాడు. వెళ్లడమే గానీ తను ఉన్నాడో లేడో కూడా తెలిసేది కాదు. నయాపైసా పంపిందిలేదు. ఆ తర్వాత ఎప్పుడో అక్కడే చనిపోయాడని తెలిసింది.
గంగవ్వ చిన్న కూతురు అనితకు ఎనిమిదేళ్ల వయసులో బాగా జ్వరం వచ్చింది. అప్పుడు గంగవ్వ భర్త గల్ఫ్‌లో ఉన్నాడు. జగిత్యాలలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చింది గంగవ్వ. వారం రోజులు గడిచాక డాక్టర్ ‘ఇక నీ బిడ్డను ఇంటికి తీసుకుపో’ అన్నాడు. బిడ్డకు నయం అయ్యింది, డాక్టరు మంచోడు అనుకుంది. అనితను భుజాన వేసుకుని బస్టాండుకు వెళ్ళీంది. అనిత కాళ్లు, మెడ వేలాడుతుండడంతో బస్టాండులో ఎవరో చూసి సచ్చిపోయిన బిడ్డను ఎందుకు ఎత్తుకున్నావు? అని అడిగారు. సచ్చిపోలేదు, నిద్రపోయింది అని చెప్పింది. సచ్చిపోయినోళ్ల కాళ్ళే ఇట్లా వేలాడుతాయి, అది కూడా నీకు తెలవడం లేదా? అనడంతో బిడ్డను కిందికి దించి, చూసేసరికి ఊపిరి ఆగిపోయిందని తెలిసింది. బస్టాండులోనే శవాన్ని పెట్టుకుని బోరున విలపించింది గంగవ్వ..
గంగవ్వ ఇప్పటి వరకు సుమారు 100 షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. తన ఇంట్లో టీవీ కూడా లేని గంగవ్వ టీవీ, సినిమా స్టార్‌గా ఎదిగింది. గంగవ్వ సహజ నటన ను చూసిన సినిమా డైరెక్టర్లు అవకాశం ఇవ్వడంతో మల్లేశం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో అవకాశం కల్పించారు. టీవీ ఛానల్‌లో ప్రసారమైన సిక్త్స్‌సెన్స్ కార్యక్రమంలో విజేతగా నిలిచి అబ్బుర పరిచింది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గంగవ్వ పేరు మారుమోగుతోంది. బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ తరపున రివర్స్ స్టోరీ అంశంపై గంగవ్వ క్షేత్రస్థాయిలో పర్యటించి రిపోర్టింగ్ చేసింది. అమెరికా, ఆస్ట్రేలియాలోని తెలుగువాళ్లు గంగవ్వను కలిసేందుకు ఇష్టపడుతున్నారు. ఒక్కసారి నీ తిట్లతో దీవించు అంటూ గంగవ్వను వెతుక్కుంటూ వెళ్లి, ఆమె మాటలు, తిట్లు వింటూ సంబరపడిపోతున్నారు. పదేళ్ల చిన్నారుల నుండి పండు ముసలివాళ్ల వరకు గంగవ్వను చూడాలని, మాట్లాడాలని పోటీ పడుతున్నారు.
బడికి పోలేదు, పలక బలపం పట్టి చదువు నేర్చుకోలేదు, కాని ఇప్పుడు ఇంగ్లిష్ కూడా కొంచెం కొంచెం మాట్లాడుతుంది. డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆమెను పిలిచి సినిమాలో నటించమంటే ‘నటించుడు రాదు సారూ మీరు చెప్పింది చెప్పినట్లు సేత్తా’ అని చెప్పడం తో "ఇస్మార్ట్ శంకర్" సినిమాలో అవకాశం ఇచ్చాడు. మల్లేశం సినిమాలో కూడా మెరిసింది గంగవ్వ. టీవీలో ఓ ఏడాది పాటూ యాంకర్‌గా చేసింది. ఎక్కడైనా నమ్మకంగా ఉండి, ఆత్మవిశ్వాసంతో పని చేస్తే విజయం లభిస్తుంది. అని గంగవ్వ ప్రపంచానికి చాటిచెప్పింది..
"వరికోత ఐనంక" షార్ట్ ఫిల్మ్ లో ఆమె పెర్ఫార్మెన్స్ బెస్ట్ అని అంటాడు అనిల్.. కుదిరితే మీరూ ఓలుక్కేయండి..
ఇదీ మన గంగవ్వ లైఫ్ స్టోరీ.. మీకు బాగా నచ్చిన గంగవ్వ పెర్ఫార్మెన్స్ గురించి కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి…
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments