తోకలేని పిట్టకు సాంకేతిక సొబగులు
తపాలాశాఖ చరిత్ర.. ఆధునికత
దానిని తోకలేని పిట్ట అని అంటారు... అది 90 ఆమడల దూరం పోతుందట... ఈ మాట వినగానే ఆ కాలం నాటి వారికెవరికైనా ఉత్తరం అని ఠక్కున గుర్తుకువస్తుంది. ఇంటి ముందు నుంచి పోస్ట్... అని గట్టిగా పిలుపు వినపడగానే ఏదో ఉత్తరం వచ్చిందనుకుని పరుగెత్తే దృశ్యాలు పాతకాలంలో కనిపించేవి. ఆ చిన్ని ఉత్తరం రాగానే ఇంటిల్లిపాది ఒకచోట చేరి దానిని చదివి ఎంతో ఆనందించేవారు. అదే పోస్టుకార్డు.... చిన్నగా ఉండే ఆ పోస్టు కార్డు ఎన్నో పెద్దపెద్ద విషయాలను మోసుకొచ్చేది. ఆ చిట్టి పోస్టుకార్డే కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచేది. మనుషుల మధ్య బలమైన సంబంధాలను ఏర్పరిచే అంతటి ఘన కీర్తి కలిగిన ఆ పోస్టుకార్డుకు ప్రస్తుతం ఆదరణ లేదు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో పోస్టాఫీసులు ఎటువంటి సేవలు అందిస్తున్నాయనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేడు సామాజిక మాధ్యమాల ప్రభావంతో పోస్టుకార్డుల వినియోగాన్ని ప్రజలు మరిచిపోయారు. దీంతో ప్రస్తుతం అర్ధ రూపాయి ధర కలిగిన పోస్టుకార్డును పోస్టు ఆఫీస్‌కు వెళ్లి కొనుగోలు చేసే వారేలేరని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అతి తక్కువ ధరకే సేవలందిస్తున్న తపాలాకు, గ్రామీణ ప్రజలకు మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. సమాచార రంగంలో రానురాను విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో, కాలానుగుణమైన మార్పులను అందిపుచ్చుకుంటూ మనుగడను కొనసాగిస్తూనే ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది తపాలశాఖ... తపాలా వ్యవస్థ భారత ప్రభుత్వంలో సమాచార మంత్రిత్వ శాఖలో ఒక భాగం. దీని నియంత్రణ తపాలా సర్వీస్ బోర్డు ఆదీనంలో ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 23 తపాలా సర్కిల్స్ ఉన్నాయి. ప్రతీ సర్కిల్ కు ప్రధాన తపాలా జనరల్ అధికారి ఉంటారు. ఇవి కాకుండా భారత రక్షణ వ్యవస్థ కోసం ప్రత్యేకమైన సర్కిల్ ఏర్పాటు చేశారు..
స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అంటే యూపీయూ స్థాపనకు గుర్తుగా అక్టోబరు 9న తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన తీర్మానాన్ని అనుసరించి ఇది ఓ ఆనవాయితీగా మారింది. 1969లో టోక్యో, జపాన్లో జరిగిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సమావేశంలో మొదట ఈ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటి నుండి, తపాలా సేవల అవసరాన్ని గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటగా ముంబై, చెన్నై, కోల్‌కతాలలో 1764-1766 మధ్య కాలంలో పోస్టాఫీసులు ప్రారంభించింది. వారెన్ హేస్టింగ్స్ గవర్నరుగా ఈ తపాలా సర్వీసులను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు.
ప్రపంచంలోని తపాలా శాఖలన్నింటిలో భారత తపాలా రారాజు లాంటిది. భారత దేశంలో మార్చి 31...2015 నాటికి దేశవ్యాప్తంగా లక్షా యాభైవేల తపాలా కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో లక్షా నలభైవేల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 23 వేల తపాలా కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. భారత తపాలా శాఖను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం అక్టోబర్ 1, 1854 న ఏర్పాటు చేసింది. భారత తపాలా శాఖ వరల్డ్ పోస్టల్ వారాన్ని అక్టోబర్ 9 నుంచి 14 మధ్య జరుపుకుంటుంది. 1776లో లార్డ్ క్లైవ్ తపాలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1774లో వారన్ హేస్టింగ్స్ కలకత్తా ఆఫీసును ప్రారంభించగా తర్వాత 1786లో మద్రాస్ జనరల్ పోస్టాఫీసును, 1793లో బొంబాయి జనరల్ పోస్ట్ ఆఫీస్‌లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1.55 లక్షలకు పైగా తపాలా కార్యాలయాలు ఉన్నాయి. దేశంలో ప్రతి 21.16 చదరపు కిలోమీటర్లకు ఒక పోస్టాఫీసు ఉంది. ప్రతి 6623 మందికి ఒక పోస్టాఫీసు అందుబాటులో ఉంది.
నేటి కంప్యూటర్ యుగంలో వచ్చిన సమాచార విప్లవం కారణంగా ఉత్తరాలు రాసేవాళ్లు లేకుండా పోయారు. ప్రయివేటు రంగంలో పుట్టుకొచ్చిన వందలాది కొరియర్ సేవలతో తపాలా శాఖకు పని లేకుండా పోయింది. ఫలితంగా తపాలాశాఖ నూతన సేవల వైపు దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది టెలిగ్రాఫ్ విభాగాన్ని పూర్తిగా ఎత్తివేసి, నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఆధునిక సేవలు అందించేందుకు తపాలా శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం తపాలాశాఖ వినియోగదారులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకుందాం.
బ్యాంకుల మాదిరి తపాలా శాఖ ఏటీఎంలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఖాతాదారులకు కార్డులు అందజేశారు. ఇకపై కార్యాలయాలకు రానవసరం లేకుండా ఏటీఎంలను ఏర్పాటు చేశారు. అలాగే తపాలా కార్యాలయాల్లో తిరుమల తిరుపతిలో శ్రీవారి శీఘ్ర దర్శనానికి రూ.300 టికెట్లను పొందవచ్చు. పలు ఆలయాల ప్రసాదాలు, ప్రత్యేక పూజల కోసం తపాలా శాఖ ద్వారా భక్తులు నగదు పంపవచ్చు. తిరుమలకు రూ.5 నుంచి రూ.5వేల వరకు నగదు పంపే అవకాశం ఉంది. తపాలాశాఖ ఈ-సేవ, మీ-సేవ తరహాలో 55రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. టెలిఫోన్, సెల్‌ఫోన్, ఆదాయపు పన్ను, తదితర చెల్లింపు కార్యకలపాలను నిర్వహిస్తోంది.
తపాలా జీవిత బీమా సేవలను అంతర్జాలం పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రీమియం ఏ కార్యాలయంలోనైనా చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 5 లక్షల వరకూ బీమా మెచ్యూరిటీలను ప్రధాన తపాలా కార్యాలయాల్లో పొందే వీలుంది. తపాలా బీమా, గ్రామీణ తపాలా బీమా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తపాలా జీవిత బీమా, గ్రామీణుల కోసం గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాలను అమలు చేస్తోంది. వాటికి ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇవే కాకుండా అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన లాంటి పలు పథకాలు అందిస్తోంది. ప్రధాన పోస్టాఫీసుల్లో నాన్ జ్యాడిషియల్ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉంటాయి.
వరల్డ్ నెట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో తపాలా శాఖ 220 దేశాలకు వస్తు సామగ్రిని చేరవేస్తోంది. ఈ విధంగా ఎవరైనా 32 కిలోల వరకు పంపుకోవచ్చు. మూడు కిలో గ్రాముల లోపు పంపేవారికి ప్యాకింగ్ సంచులను తపాలా శాఖ ఉచితంగా అందిస్తోంది. అనుమతించిన తినుబండారాలు, మందులు, పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలు తదితరాలను ఈ శాఖ విదేశాలకు పంపిస్తోంది. 180కి పైగా భాషల్లో టోల్ ఫ్రీ నంబర్‌లో మాట్లాడే వీలుంది. గ్రామాల్లో ఉన్న తపాలా కార్యాలయాల ద్వారా విదేశాలకు పార్సిల్ పంపే సౌకర్యం ఉంది. ఎన్‌ఆర్‌ఐలు తమ బంధుమిత్రులకు అధికారికంగా నగదు పంపే సౌకర్యాన్ని కూడా తపాలా శాఖ కల్పించింది. అధికారికంగా నగదు పంపాలంటే డీడీలు, చెక్కులే ఆధారం. వాటిని మార్చుకునేందుకు అధిక సమయం ఎదురు చూడక తప్పదు. ఈ నేపథ్యంలో తపాలా శాఖ ఐఎంటీఎస్ పథకం ద్వారా కేవలం పది నిమిషాల్లో నగదు మార్పిడికి అవకాశం కల్పిస్తోంది.
ప్రజలకు నిత్య జీవితంలో అవసరమైన అన్ని ముఖ్యమైన పనులు, సేవలను అందించి సమాజంతో మమేకం అయ్యేందుకు తపాలా శాఖ పూర్తిగా సన్నద్దమైంది. మారుమూలశాఖలను సైతం ఆన్‌లైన్ అనుసంధానం చేసి, ఎక్కడి నుంచైనా అన్ని తరహా సేవలు పొందేలా వీలు కల్పిస్తోంది. పూర్తిగా ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న తపాలా శాఖ సేవలను ఖాతాదారులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments