సీయం కావాల్సిన వాడు పంచాయత్ ప్రెసిడెంట్ అయ్యాడు!

img

ఆ పల్లెటూరిలో ఉసూరుమంటూ 1500 మంది ఉండేవారు.. నేడు ఆ సంఖ్య పదివేలకు చేరింది..అదెలా? అనుకుంటున్నారా? సాధారణంగా పల్లెలనుండి పట్టణాలకు వలసవెళుతుంటారు ఎక్కడైనా, ఇక్కడ సీన్ రివర్స్.. పట్టణాలనుండి ఆ పల్లెకు వలసలు పోతున్నారు.. ఆ ఊరిని ప్రపంచ స్థాయి అధికారులు కూడా తరచి చూసి వెళ్తున్నారు.. దీనంతటికీ కారణం ఆ ఊరి పంచాయితీ ప్రెసిడెంట్ "షణ్ముగం".. ఆ కధ ఎంటో ఈ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది..

ఒడంతురై. అదొక చిన్న పల్లెటూరు. అభివృద్ధికీ స్వావలంబనకీ నిఖార్సైన ఉదాహరణ ఆ పల్లె. ప్రజల బాగోగులే లక్ష్యంగా పనిచేసే నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆ పంచాయతీకి ప్రెసిడెంటుగా చేసిన షణ్ముగం. ఆయన ఆధ్వర్యంలో ఒకటీ రెండూ కాదు, పదుల సంఖ్యలో "ప్రథమ బహుమతులు" అందుకున్న ఆ ఆదర్శ పంచాయతీ అభినందనీయం..

నీలగిరుల సానువుల్లో కోయింబత్తూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. చుట్టూ పచ్చని అరటి తోటలూ, మబ్బులతో దోబూచులాడే కొబ్బరి చెట్లూ, పసుపు ఆరబోసినట్లుండే ఆవ తోటలు అక్కడి ప్రత్యేకత.

ఒడంతురై గ్రామ పంచాయతీ కింద ఉన్న ఓ డజను చిన్న చిన్న పల్లెల్లో అంతా కలిసి పదివేల జనాభా ఉంటుంది. అందులో రైతులు కొంతమందే ఉన్నారు. మిగతా ప్రజలు చుట్టుపక్కల తోటల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు,  గిరిజనులు.

పాతికేళ్ల క్రితం ఆ పంచాయతీ పేదరికానికి ఆలవాలంగా ఉండేది. చిన్న చిన్న గుడిసెల్లో బ్రతుకీడ్చేవారు. పొద్దున్నే లేచి పిల్లలూ పెద్దలూ తలా ఓ బిందె పట్టుకుని రెండు మూడు గంటలు నడిచి వెళ్లి నది నుంచి నీళ్లు తెచ్చుకునేవారు. ఆ తర్వాత పెద్దలు కూలికి వెళ్తే పిల్లలు వీధులమ్మట తిరుగుతూ చదువూ సంధ్యా లేకుండా ఉండేవారు. అలాంటిది పదేళ్లలో ఆ ఊరి రూపురేఖలే మారిపోయాయి. గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు. వాకిట్లో మంచినీళ్ల పంపులు. సౌరశక్తితో వెలిగే వీధి దీపాలు. పిల్లలకోసం చక్కటి బడులు. ఇప్పుడది ఎందరికో పాఠాలు చెబుతున్న ‘మోడల్‌ విలేజ్‌’. ఆ మార్పుకి కారణం ఆ గ్రామ ప్రెసిడెంట్ రామస్వామి షణ్ముగం.

అది దాదాపు పాతికేళ్ల క్రితం సంగతిది. రైతుగా ఎవరిమీదా ఆధారపడకుండా హాయిగా సాగిపోయేది నలభయ్యేళ్ల షణ్ముగం జీవితం. అయితే ఊరి పరిస్థితులే అతడికి విసుగు తెప్పించేవి. తాగునీటి వసతి లేదు, రోడ్లు లేవు, పిల్లలకు బడులు లేవు, కరెంటు లేదు. మరో పక్క ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్రం అభివ్రుద్ది లో దూసుకుపోతోందని మీడియా లో ఊదరగొడుతోంది... తన ఊరేమో ఎన్నేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. గ్రామసభ జరిగినప్పుడల్లా ఊరి ప్రజలు వారి ప్రెసిడెంటుని నిలదీసేవారు. కానీ అటునుంచి సరైన సమాధానం వచ్చేది కాదు. విసిగిపోయిన షణ్ముగం 1996లో తానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రెసిడెంటు అయ్యారు. ఊరి ప్రజలకు స్థానిక పాలన ఎలా ఉండాలో చేసి మరీ చూపించారు. ఊరి వాళ్లకు ఆయన చెప్పిందే వేదం. రెండు దశాబ్దాలపాటు ఆయన ప్రతిపాదించిన ఏ పథకానికీ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవలేదు. మొదటి పదేళ్లూ షణ్ముగం ప్రెసిడెంట్ గా ఉన్నాడు.. ఆ తర్వాత పదేళ్లూ పంచాయతీని మహిళలకు కేటాయించడంతో ఆయన భార్య లింగమ్మాళ్‌ ప్రెసిడెంట్ గా పనిచేసి ఊరి అభివృద్ధిని ఓ కొలిక్కి తెచ్చారు. ఈ దంపతుల కృషి వల్ల గ్రామం అభివ్రుద్ది చెందడమే కాక, ఆదాయం కూడా పదిరెట్లు పెంచుకుంది. దానికి తగ్గట్టుగా ప్రజల జీవన ప్రమాణాలూ పెరిగాయి. అవినీతిరహితంగా సాగిన వారి పాలనే అందుకు కారణం.

ఎన్నికల్లో గెలిచాక గ్రామం అసలు పరిస్థితి అర్థం అయింది అంటారు షణ్ముగం. ఊళ్లో ఎటు చూసినా సమస్యలే. పంచాయతీ ఆదాయమేమో కేవలం రూ.20 వేలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియలేదు. డబ్బుంటే ఏ పని అయినా చేయొచ్చని ముందుగా ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించారు. గ్రామసభ పెట్టి పరిస్థితి ప్రజలకు వివరించారు. నూరుశాతం పన్నులు కడితే దానికి మూడు రెట్లు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తుందనీ ఆ డబ్బు ఉంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చనీ చెప్పారు. వారు కూడా సహకరించారు. దాంతో ఆదాయం రూ.1.75 లక్షలకు పెరిగింది. ప్రభుత్వం నుంచి రూ.5.25 లక్షలు వచ్చాయి. అలా ఆ తర్వాత ఏడాది రూ. 3.5 లక్షలు వసూలు చేస్తే ప్రభుత్వం పదిన్నర లక్షలిచ్చింది. చేతికి డబ్బు అందడంతో షణ్ముగం అభివృద్ధి ప్రణాళికల మీద దృష్టిపెట్టారు. పన్నుల వసూళ్లలో కఠినంగా వ్యవహరించడం పట్ల ప్రజలెవరూ అభ్యంతరం చెప్పలేదు. అందుకు తగినట్లుగా పంచాయతీ అందిస్తున్న సేవల్ని వారు గుర్తించారు. ఎవరు ఏ ఫిర్యాదుతో వచ్చినా రెండురోజుల్లో పరిష్కారమయ్యేలా చూసేవారు షణ్ముగం.

నిజానికి ఆ రోజుల్లో ఊరి జనాభా 1500.. అక్కడ ఒకే ఒక్క బోరుబావి ఉండేది. అందుకే చాలామంది దూరంగా ఉన్న నదినుంచో, తోటల్లోని బావుల నుంచో నీరు తెచ్చుకునేవారు. అవి శుభ్రమైనవి కాకపోవటంతో తరచూ అనారోగ్యాలకు గురయ్యేవారు. మరికొన్ని బోరుబావులు వేయించినా వేసవిలో అవి ఎండిపోయే ప్రమాదం ఉంది. అందుకని భవానీ నది నుంచి పన్నెండు పల్లెలకూ పైపుల ద్వారా నీటి సరఫరాకి రూ.30 లక్షల ప్రతిపాదనతో ప్రాజెక్టు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. అంత డబ్బు ఒక్క పంచాయతీకే ఇవ్వడం కుదరదన్నారు అధికారులు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకు సహకారంతో గ్రామీణ నీటి సరఫరాకోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. దానికింద పది శాతం ఖర్చు పంచాయతీ పెట్టుకోవాలి. కలెక్టర్‌ ఆ విషయాన్ని షణ్ముగం దృష్టికి తెచ్చారు. మరోసారి ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందిస్తే ఈసారి ఖర్చు 48 లక్షలు తేలింది. దాంతో షణ్ముగం పరిస్థితిని ప్రజలకు వివరించారు. పదోవంతు అంటే దాదాపు ఐదు లక్షలు ఊరి తరఫున కట్టడానికి ప్రజలు అంగీకరించారు. డబ్బున్నవారు ఎక్కువిచ్చారు. లేనివాళ్లు తమ స్తోమత మేరకు వందా ఐదొందలూ ఇచ్చారు.. చుట్టు పక్కల గ్రామాలో ఇదే విధమైన ప్రతిపాదనలతో ముందుకు రావడం తో ఎక్కువ మొత్తం ఎవరు పెట్టుకుంటే వారికే పధకం డబ్బు మంజూరుచేస్తామన్నారు ప్రభుత్వ అధికారులు.. దీంతో షన్ముగం గ్రామ పంచాయితీ లోనే అధిక మొత్తం లో డబ్బులు వసూలు కావడం తో  ప్రాజెక్టు వారికే మంజూరయింది. ఏడాదికల్లా 13 కి.మీ.ల పైప్‌లైన్‌, ఫిల్టర్‌ పాయింట్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు సిద్ధమై అన్ని పల్లెలకీ నీళ్లు వచ్చాయి. ఆ గ్రామాల ప్రజలు ఆనందంతో పొంగిపోయారు. మరోపక్క పిల్లల్ని బడికి పంపించడం మొదలెట్టారు.

ఊరివాళ్లందరికీ నీళ్లిచ్చామన్న సంతోషం ఎంతో కాలం నిలవలేదు.. మోటార్లతో పంపింగ్‌ వల్ల కరెంటు బిల్లు భారంతో పంచాయతీ నడ్డి విరిగినంత పనైంది. బడ్జెట్‌లో సగానికి పైగా ఆ బిల్లుకే సరిపోతే ఇక మిగతా పనులేం చేయగలం అనుకున్న షణ్ముగం ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాట మొదలెట్టారు. బయోమాస్‌ గ్యాసిఫయర్‌ విధానాన్ని ప్రయత్నిద్దామనుకున్నారు. ఈ పద్ధతిలో ఏవైనా జీవవ్యర్థాలను ఉపయోగించి గ్యాస్‌ని తయారుచేయవచ్చు. దాని గురించి బరోడా వెళ్లి శిక్షణ పొంది వచ్చారు. రాగానే తొమ్మిది కిలోవాట్ల గ్యాసిఫయర్‌ని ఏర్పాటుచేశారు. కలప మిల్లుల్లో వ్యర్థంగా పడివుండే కర్రముక్కల్ని కిలో 60పైసల చొప్పున కొని అందులో వాడేవారు. దాంతో కరెంటు ఖర్చు సగానికి తగ్గి, నాలుగేళ్లు బండి సాఫీగా సాగింది. ఇంతలో కర్రముక్కల ధర కిలో రూ.3.50కి పెరిగింది. మరో పక్క కరెంటేమో యూనిట్‌కి రూ.1.75 మాత్రమే. దాంతో గ్యాసిఫయర్‌ని మూసేసి మళ్లీ కరెంటే వాడారు.

అయితే పునరుత్పాదక ఇంధన వనరుల అన్వేషణ మాత్రం ఆపలేదు షణ్ముగం. ఎక్కడ సదస్సు జరిగినా హాజరవుతూ సోలార్‌ వీధి దీపాల గురించి తెలుసుకున్నారు. రెండు పల్లెల్లో వీధి దీపాలకోసం 2 కెవి సోలార్‌ సిస్టమ్స్‌ని ఏర్పాటుచేశారు. దాంతో కరెంటు బిల్లు ఐదు వేలు తగ్గింది. ఈ రెండు ప్రయోగాల అనుభవాన్నీ క్రోడీకరించి రెండు పాఠాలు నేర్చుకున్నానంటారు షణ్ముగం. అవేంటంటే - విద్యుత్‌ బోర్డు ద్వారా సరఫరా అయ్యే కరెంటుని ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉపయోగించుకోవాలి. రెండోది పునరుత్పాదక విద్యుత్‌ వనరులతో డబ్బు పొదుపు చేయడమే కాదు, డబ్బు కూడా సంపాదించవచ్చు అని గమనించాడు. దాంతో ఈసారి పెద్ద లక్ష్యాన్నే పెట్టుకున్నారాయన. ఏకంగా విండ్‌ మిల్‌కి ప్రణాళిక సిద్ధంచేసుకున్నారు.

సరిగ్గా ఆ సమయానికి ప్రెసిడెంట్‌గా ఆయన పదవీ కాలం ముగిసింది.  మరి అప్పుడు ఏమయ్యింది? అభివ్రుద్ది అదే వేగం తో జరిగిందా? ఎలాంటి అడ్డంకులొచ్చాయి? తరువాత ప్రెసిడెంట్ ఎవరయ్యారు? ఇలాంటి ఆశక్తికర అంశాలు రెండవ భాగం లో తెలుసుకుందాం.. 

మరిన్ని

Comments

0 Comments

జాతీయం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()