మదర్ థెరీసా.. చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో ఖచ్చితంగా అందరూ ఆ మాత్రుమూర్తి గురించి తెలుసుకుని ఉంటారు.. మరి కొత్తగా ఇప్పుడు తెలుసుకునేదేముంది? అనుకునేవారికి ఈ వీడియో లో అనేక ఆశక్తికర విషయాలు తెలుస్తాయి.. అందుకే ఈ వీడియోని రెండు భాగాలుగా మీకు అందిస్తున్నాము.....
నిజానికి మదర్ థెరిసా తన జీవితం లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఎంతో సేవ చేసినప్పటికీ కొన్ని అపవాదులు మూటగట్టుకున్నారు... అవన్నీ తెలుసుకోబోయేముందు ఈ మొదటి భాగం లో ఆమె బాల్యం గురించి ఒకసారి తెలుసుకుందాం..
ఆగష్టు 26, 1910 న 'ఆగ్నీస్ గోక్షా బొజాక్షు' అనే పేరుతో జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని ఆమె..
ఆగ్నెస్ అనగా అల్బేనియన్ భాషలో గులాబీ మొగ్గ అని అర్ధం.. 1910 ఆగష్టు 26, ఉస్కుబ్, ఒట్టోమన్ సామ్రాజ్యంలోని మాసిడోనియా పట్టణంలో ఆమె జన్మించారు. ఆమె ఆగష్టు 26 న జన్మించినప్పటికీ, క్రైస్తవమతం స్వీకరించిన ఆగష్టు 27 ను తన నిజమైన జన్మదినంగా భావించే వారు. ఆమె అల్బేనియాలోని స్కోదర్ చెందిన నికోల్లే, డ్రాన బొజాక్షిహ్యు దంపతుల ఆఖరి సంతానం. ఈమె తండ్రి అల్బేనియా రాజకీయాలలో పాల్గొనేవారు. 1919 లో ఆగ్నెస్ కు ఎనిమిది సంవత్సరాల వయస్సున్నపుడు ఆమె తండ్రి జబ్బుపడి మరణించారు. ఆ తరువాత తల్లి ఆమెను రోమన్ క్యాథలిక్ గా పెంచారు. ఆమె తన బాల్యం లోనే మతప్రచారకుల జీవిత కథలపట్ల వారి సేవల పట్ల ఆకర్షింపబడ్డారు.. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి "సిస్టర్స్ అఫ్ లోరెటో" అనే ప్రచారకుల సంఘంలో చేరారు. తరువాతి కాలంలో తన తల్లిని కాని, సోదరిని కానీ ఆమె కలవలేదు.
ఆమె సిస్టర్స్ అఫ్ లోరెటో లో చేరిన మొదటి రోజుల్లో భారతదేశంలో విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్ ను నేర్చుకోవడానికి ఐర్లాండ్ కి వెళ్లారు. 1929 లో, ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారత దేశంలో హిమాలయ పర్వతాల వద్ద నున్న డార్జిలింగ్ కి వచ్చారు. మత ప్రచారకుల సంఘం కోరిక మేరకు తన పేరును "తెరెసా" గా మార్చుకున్నారు. 1937 లో తూర్పు కలకత్తాలోని లోరెటో కాన్వెంటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు..
పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆమె సంతోషకరమైన జీవితాన్ని గడిపారు.. అయితే కలకత్తా చుట్టుపక్కల పేదరికం ఆమెను కదిలించి వేసింది. 1943 లో ఏర్పడిన కరువు తో కలకత్తా నగరానికి అనేక కష్టాలు వచ్చి పడ్డాయి,అనేక వేల మంది మరణించారు.. ఆగష్టు 1946 లో జరిగిన హిందూ, ముస్లిం హింస కారణంగా కోల్కతా నగరం వణికిపోయింది.
ఇవన్నీ చూసి చలించిపోయిన థెరెసా 1946 లో "కాన్వెంటు" ను వదిలి పేదల మధ్య నివశిస్తూ వారికి సేవ చేయాలి అని నిర్ణయించుకున్నారు. 1948 నుండి ఆమె నిరాడంబరమైన, నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించి, భారత పౌరసత్వము స్వీకరించి కోల్కతా మురికి వాడలలో ప్రవేశించారు. ఆమె మొదట ఒక పాఠశాలను స్థాపించారు; వెంటనే అనాథల, అన్నార్తుల అవసరాలను తీర్చ సాగారు. కొద్దికాలం లోనే ఆమె కార్యక్రమాలు అధికారుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రధానమంత్రి ప్రశంసలు అందుకునేలా చేసాయి.
తన తొలి సంవత్సరం కష్టాలతో నిండి పోయింది. ఆమెకు సొంత ఆదాయం లేకపోవడం వలన ఆహారం, ఇతర అవసరాలకొరకు యాచకురాలిగా మారవలసి వచ్చింది. ఆశ్రమ జీవితంలోని సౌకర్యాలకు అలవాటు పడిన ఆమె ఆ సరికొత్త జీవితం లో ఇమడలేకపోయారు. ఈ విషయాలను తన డైరీలో ఇలా వ్రాసుకున్నారు తెరెసా.. "నా దేవుడు నన్ను పేదరికం అనే స్వేచ్ఛా సన్యాసిని గా వుండమంటున్నాడు. బీదరికం పేద వారికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు ఉండడానికి ఒక ఇల్లు కొరకు వెతికే సమయం లో నా కాళ్లు చేతులు నొప్పిపుట్టేలా తిరిగాను. మరి నిరు పేదలు ఇంటికొరకు, ఆహారం, ఆరోగ్యం కొరకు వెతుకుతూ శరీరంలో, ఆత్మలో ఎంత బాధపడుతున్నారోనని అనుకున్నాను.. ఒక్కసారి తాను తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకుంటే చాలు మరల ఆ పాత, సుఖమయమైన జీవితం పొందవచ్చు. కానీ దేవుడు నన్ను దేవుడు ఆగ్నాపించిన విధంగా వారి మధ్య గడుపుతూ వారికి సేవ చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను".. అని రాసుకున్నారు..
1950 లో కోల్కతా లో "మిషనరీస్ అఫ్ ఛారిటీ" ని స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలలో కూడా వ్యాప్తి చెందేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.
మదర్ థెరెసా చేసిన అసమానమైన మానవ సేవకు గాను 1979 లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980 లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు. మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, సుఖ వ్యాదులు, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, బాలలకు అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించారు.
ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను కూడా తన జీవితం లో ఎదుర్కున్నారు. ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర వ్యతిరేకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం, మరణశయ్య పై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను విశ్వ హిందూ పరిషత్ లాంటి అనేక సంస్థలనుండి ఎదుర్కున్నారు. మరో పక్క అనేక మెడికల్ జర్నల్స్ ఆమెకు చెందిన ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణాలను విమర్శించాయి.. విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల నీలినీడలు కమ్ముకున్నాయి..
ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ చేత "దైవ ఆశీర్వాదం" పొందారు మదర్ తెరెసా..
1950 న ఆమె వాటికన్ అనుమతి తో మతగురువుల సంఘాన్ని ప్రారంభించారు.. అదే తరువాత "మిషనరీస్ అఫ్ ఛారిటీ" గా రూపొందింది. ఆమె మాటలలో "ఆకలిగొన్న వారు, దిగంబరులు, నిరాశ్రయులు, కుంటి వారు,కుష్టు వ్యాధి గ్రస్తులు, అనాధలు, ప్రేమించబడని వారు, సమాజంచే నిరాకరింపబడిన వారు, సమాజానికి భారమైన వారు మొదలైన వారందరినీ ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవడమే ఈ సంఘం యొక్క ముఖ్య కర్తవ్యం". ఇది కలకత్తాలో స్వల్ప స్థాయిలో 13 మంది సభ్యులతో మొదలైంది; నేడు ఇది 4,000 కు పైగా సన్యాసినులను కలిగి ఉంది.
1952 లో మదర్ థెరీసా కలకత్తా నగర అధికారులు ఇవ్వబడిన స్థలంలో మొదటి "హోమ్ ఫర్ ది డయింగ్" ను ప్రారంభించారు. భారతదేశ అధికారుల సహాయంతో ఆమె ఒక పాడుబడిన హిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాలగా మార్చారు. ఆమె దానికి నిర్మల్ హృదయ్ అని పేరు పెట్టారు . ఈ నిలయానికి తీసుకురాబడిన వారికి వైద్య సహాయాన్ని అందించి, వారి నమ్మకాల ప్రకారం ఆచార కర్మల ననుసరించి గౌరవంగా చనిపోయే అవకాశం కల్పించారు. ముస్లింలు ఖురాన్ చదివేవారు, హిందువులకు గంగా జలం అందించేవారు, కాథలిక్స్ కు వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు జరుపబడేవి.
మిషనరీస్ అఫ్ ఛారిటీ అధిక సంఖ్యలో "తప్పిపోయిన పిల్లల" ను చేరదీసింది, మదర్ థెరీసా వారికి ఆశ్రయాన్ని కల్పించాలని భావించారు. 1955 లో ఆమె అనాథలకూ, నిరాశ్రయులైన యువకుల కొరకు, పరిశుద్ధ హృదయ బాలల ఆశ్రయమైన "నిర్మల శిశు భవన్" ను ప్రారంభించారు.
ఈ సంస్థ అతి త్వరలోనే అనేకమంది కొత్త వ్యక్తులను, విరాళాలను ఆకర్షించింది, 1960 నాటికి భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి అనేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. మదర్ థెరీసా తన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. భారతదేశం వెలుపల వీరి మొదటి ఆశ్రయం వెనిజులాలో 1965 లో ఐదుగురు సిస్టర్స్ తో మొదలైంది. తరువాత 1968 లో రోమ్, టాంజానియా, ఆస్ట్రియా, ఆసియా, ఆఫ్రికా, యూరోప్ లో, యునైటెడ్ స్టేట్స్ లో ఫౌండేషన్లను స్థాపించింది.
ఆమె తాత్త్వికత, ఆచరణలు కొంత విమర్శకు గురయ్యాయి. మదర్ థెరీసా వ్యాధి గ్రస్తులను కేవలం బ్రతికి ఉంచేందుకు పరిమితమయ్యారు కాని వారి దారిద్ర్యాన్ని సమూలంగా తొలగించేందుకు ప్రయత్నించ లేదని డేవిడ్ స్కాట్ పేర్కొన్నారు.. బాధితుల పట్ల ఆమె "దృక్పధం" కూడా విమర్శకులకు ఆయుధమైంది. అల్బెర్ట రిపోర్ట్ లోని ఒక వ్యాసం ప్రకారం ఆమె "బాధ" అనేది ప్రజలను క్రీస్తు కు దగ్గర చేస్తుందని ఆమె భావించేవారని తెలియజేసింది. ఆఖరి దశలో ఉన్న రోగగ్రస్తులకు "హోమ్ ఫర్ డయింగ్" లో అందించే సేవలు విమర్శలకు గురయ్యాయి.. ప్రత్యేకించి "ది లాన్సెట్", "బ్రిటిష్ మెడికల్ జర్నల్" ప్రకారం చర్మము క్రింద ఇచ్చే సూదులను తిరిగి వాడడం, అపరిశుధ్ర నివాస పరిస్థితులు కొనసాగించడం, రోగులందరికీ చన్నీటి స్నానాలను చేయాల్సిందిగా కోరడం, సరైన రోగానిర్ధారణకు వైద్య విధానం లో లేని పద్దతులను అవలంభించేవారని తెలిపాయి.
అయితే ఈ అపవాదులను ఆమె ఎలా ఎదుర్కొన్నారు? ఆత్మ విశ్వాసం తో ఎలా ముందడుగు వేశారు? ఆమెను వరించిన బిరుదులేమిటి? చివరి రోజుల్లో ఆమె జీవితం లో జరిగిన అనూహ్య పరిణామాలేంటి? అనే విషయాలు రెండవ భాగం లో తెలుసుకుందాం..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments