బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఎన్జీఓ చేసిన అధ్యయనం లో భారతదేశాన్ని "ఆసియా - పసిఫిక్" ప్రాంతంలో అత్యంత అవినీతి దేశంగా తేల్చింది..
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) లెక్కల ప్రకారం, ప్రపంచం ఇప్పటికే 2 ట్రిలియన్ డాలర్ల డబ్బును అవినీతి కారణంగా కోల్పోయింది. ఇది చిన్న మొత్తం కానే కాదు.. ప్రపంచ జిడిపిలో ఇది రెండు శాతం. అవినీతి ఎక్కడున్నా దాన్ని తక్షణమే అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించిన ఐక్యరాజ్యసమితి, ప్రతి ఏటా డిసెంబర్ 9 న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించింది. అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న "ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్" అనే ఎన్జీఓ ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో 10 మందిలో ఏడుగురు ప్రజా సేవలను పొందటానికి ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం చెల్లించాల్సి వస్తోందని పేర్కొంది. అవినీతి, నల్లధనం వంటి భూతాలను అరికట్టడానికి అనేక సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమకారులు పోరాడుతున్నా అవి ఉపన్యాసాలకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణలో ఎండమావి లానే ఉంటున్నాయి. భారతదేశాన్ని అవినీతి రహితంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు గమనిస్తే, "వస్తు సేవల పన్ను" అమలు మరియు "డీమోనిటైజేషన్" తో సహా వివిధ చట్టాలను అమలులోకి తీసుకు రావడం చెప్పుకోదగ్గ పరిణామమే అయినప్పటికీ డశాబ్దాలుగా వేనూళ్ళుకుపోయి ఉన్న అవినీతిని కూకటి వేల్లతో పెకిలించి వేయడం అంత సులభం కాదని తెలుస్తోంది... ఇక వివరాల్లోకి వెళితే అత్యంత అవినీతి దేశం గా భారత్ మారడానికి, అదే సమయం లో మన దేశాన్ని ప్రపంచం ముందు సిగ్గుపడేలా నిలబెట్టిన 8 అతిపెద్ద మోసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక మనిషి, మూడు కుంభకోణాలు. అభిషేక్ వర్మ ప్రధాన ఆయుధ వ్యాపారి గా ఉండేవాడు. అయితే అతడు ఆ తర్వాతి కాలం లో "స్కార్పెన్" జలాంతర్గాముల వ్యవహార కేసు, "అగస్టా వెస్ట్ ల్యాండ్" వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం, "నేవీ వార్ రూమ్ లీక్" కేసు మొదలైన వాటిలో అతడు ప్రధాన నిందితుడుగా గుర్తించబడ్డాడు. తన తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ అధికారులుగా ఉండడమే కాక రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్న కుటుంబం కావడం తో వీరి కుమారుడైన అభిషేక్ ఈ దుర్మార్గాలకు తెగబడ్డాడని తెలుస్తోంది... అభిషేక్ తన చిన్ననాటి నుండి మీడియా మరియు ప్రజా జీవితానికి అలవాటయ్యాడు. అతడు 1997 న తన 28 సంవత్సరాల అతి పిన్న వయసులో అతిపెద్ద అవినీతికి పాల్పడిన వ్యక్తిగా పేరు పొందాడు. బిఎస్ఎన్ఎల్, బహుళజాతి ఎఫ్ఎమ్సిజి బ్రాండ్లు మరియు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో సహా అనేక రకాల వ్యాపార సంఘాలతో సంభందాలు కలిగి ఉండేవాడు.. అందరూ అతన్ని 'లార్డ్ ఆఫ్ వార్' అని పిలిచేవారు.. అంతర్జాతీయ రక్షణ మరియు ఆయుధ సంస్థ సర్కిల్స్ తో కూడా తరచూ కలుస్తుండేవాడు. 2006 లో అభిషేక్ సుమారు 200 మిలియన్ల కిక్‌బ్యాక్ లను అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.. 35 వేల కోట్ల రూపాయల విలువైన సైనిక ఒప్పందం ద్వారా భారత ప్రభుత్వం ఆరు జలాంతర్గాములను కొనుగోలు చేసింది. ఆ ఒప్పందం లో అభిషేక్ తలదూర్చి పెద్దమొత్తం లో కమీషన్ గుంజుకున్నాడు... దీంతో సిబిఐ అతనితో పాటూ అతని భార్యపై అనేక అవినీతి మరియు మనీలాండరింగ్ కేసులను నమోదు చేసింది.. ఆ తరువాత అతని నివాసం మరియు సంస్థలపై దాడి చేసింది. అతన్ని 2012 లో పోలీసులు అరెస్టు చేశారు. 2013 అగస్టా వెస్ట్‌ల్యాండ్ వివిఐపి హెలికాప్టర్ల లంచం కుంభకోణంలో ఆయనను నిందితుడిగా పేర్కొన్నారు, ఈ వ్యవహారం లో భారత ప్రభుత్వ నాయకులు కొందరు 400 కోట్ల రూపాయలు అతడికి లంచం ముట్టజెప్పారని తేలింది. ఏప్రిల్ 2017 లో, ప్రత్యేక సిబిఐ కోర్టు ఈ రెండు ఆరోపణలలో అనేక రాజకీయ వత్తిడుల కారణంగా వారిని నిర్దోషులుగా ప్రకటించి వదిలేసింది..
ఈ రోజు వరకు దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా పేరుగాంచిన కర్ణాటక వక్ఫ్ బోర్డు వ్యవహారం లో రూ. 14 వేల కోట్ల విలువైన భూ కేటాయింపులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక వక్ఫ్ బోర్డు నియంత్రణలో ఉన్న 27,000 ఎకరాల భూమిని అపహరించడం లేదా చట్టవిరుద్ధంగా కేటాయించడం జరిగిందని ఆరోపిస్తూ 2012 లో కర్ణాటక రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఒక నివేదికను సమర్పించింది. ఈ ఆస్తిని ముస్లిం ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు విరాళంగా ఇవ్వవలసి ఉంది. కర్ణాటక రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ "అన్వర్ మణిప్పడి" మాట్లాడుతూ 50 శాతం భూమిని రాజకీయ నాయకులు, బోర్డు సభ్యులు దుర్వినియోగం చేశారు. కర్ణాటక వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కై దాని మార్కెట్ విలువతో పోలిస్తే అతి తక్కువ ధరకే నిందితులు కొట్టేశారని అభియోగాలు నమోదయ్యాయి.. . ప్రస్తుతం ఈ వ్యవహారం పై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కుంభకోణం ఒక హాలీవుడ్ చిత్రం తరహాలోనే జరిగినట్టు కనిపిస్తోంది. 2002 లో, "అబ్దుల్ కరీం తెల్గి" భారతదేశంలో స్టాంప్ పేపర్‌కు నకిలీ స్టాంప్ లు ముద్రణ చేసినందుకు గానూ అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. బ్యాంకులు, భీమా సంస్థలు మరియు స్టాక్ బ్రోకరేజ్ సంస్థలకు స్టాంప్ పేపర్లను విక్రయించడానికి 350 మంది నకిలీ ఏజెంట్లను అతడు నియమించాడు. ఈ కుంభకోణం 12 రాష్ట్రాలలో వ్యాపించింది.. ఇందులో చేతులు మారిన అవినీతి సొమ్ము విలువ మొత్తం రూ .14 వేల కోట్ల రూపాయలు. అధిక భద్రత కలిగి ఉండాల్సిన ఈ స్టాంపుల ఉత్పత్తి మరియు అమ్మకాల వ్యవహారం లో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు తెల్గీతో కుమ్మక్కయ్యారని దర్యాప్తులో తేలింది. జనవరి 2006 లో, తెల్గి మరియు పలువురు సహచరులకు 30 సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష విధించబడింది.
అధికారులు, రాజకీయ నాయకులు మరియు పలువురు మంత్రులు కలిసి తెగబడ్డ ఈ కుంభకోణాన్ని సెప్టెంబర్ 2012 లో వెలికి తీశారు. భారతదేశం యొక్క "ఆడిట్ వాచ్ డాగ్" అయిన "కంంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ శాఖ వివరించిన ఆధారాల ప్రకారం " 2004 మరియు 2009 మధ్య బొగ్గు బ్లాకులను ప్రభుత్వ వర్గాలు అసమర్థంగా మరియు చట్టవిరుద్ధంగా అనుయాయులకు పంచిపెట్టినట్టు తేలింది. ప్రారంభంలో ఖజానాకు జరిగిన నష్టం రూ .10.7 లక్షల కోట్లు అని తేలినప్పటికీ తుది నివేదిక ప్రకారం ఈ కుంభకోణం విలువ రూ .1.86 లక్షల కోట్లు. ముఖ్యంగా, బొగ్గు బ్లాకులను కేటాయించడానికి భారత ప్రభుత్వం "బిడ్డింగ్" విధానాన్ని అనుసరించకుండా ఏకపక్షంగా తమకు కావలసిన వారికి ప్రాజెక్ట్ కట్టబెట్టింది.. ఏదేమైనా, కాగ్ యొక్క దర్యాప్తులో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శించిన కారణంగా వివిధ ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు అతి తక్కువ ధరలు చెల్లించి ఎక్కువ వనరులను కొట్టేసినట్టు గుర్తించింది.. ఫలితంగా ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో నష్టాలు వచ్చాయి.
2008 లో, ప్రభుత్వం "మొబైల్ టెలిఫోన్ ఫ్రీక్వెన్సీ" కేటాయింపు లైసెన్సుల కోసం వివిధ టెలిఫోన్ కంపెనీలకు అప్పణంగా అతితక్కువ ధరలకే లైసెన్సులు అమ్మడం తో ఈ కుంభకోణం బయటపడింది. సెల్‌ఫోన్‌ల కోసం 2 జి స్పెక్ట్రం వినియోగదారులకు అమ్మడానికి ఈ లైసెన్స్‌లను ఉపయోగిస్తారు. "కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా" సేకరించిన సమాచారం ప్రకారం ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి, వసూలు చేసిన డబ్బుకి మధ్య వ్యత్యాసం రూ. 7 లక్షల కోట్లు అని తేల్చింది. ఫిబ్రవరి 2012 లో, భారత సుప్రీంకోర్టు స్పెక్ట్రం కేటాయింపును "రాజ్యాంగ విరుద్ధంగా మరియు ఏకపక్షంగా ప్రకటించింది" అని చెప్పడంతో పాటూ 2008 లో అప్పటి కమ్యూనికేషన్స్ మరియు ఐటి మంత్రి ఎ. రాజా ఆధ్వర్యంలో జారీ చేసిన 122 లైసెన్సులను రద్దు చేసి అతడిని జైలుకు పంపింది. ఆ తర్వాత లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సుప్రీం కోర్టు ద్వారా జాతీయ సంపదను కంపెనీలకు కట్టబెట్టే సమయం లో బిడ్డింగ్ విధానం పకడ్బందీగా అమలు చేసి ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయాన్ని కూడగట్టాలని తీర్పు రప్పించడం లో కీలక పాత్ర పోషించారు.. దీంతో సహజ వనరుల వేలం విషయం లో పారదర్శకత ఏర్పడింది.. 2 జి స్పెక్ట్రం కుంభకోణం లో కూడా బిడ్డింగ్ విధానం అమలుకావడంతో ఏకంగా ఈ రెండు సహజ వనరుల విషయం లోనే 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరింది..
ముంబైలోని కొలాబాలో ఉన్న 31 అంతస్తుల భవనం "యుద్ధ వితంతువులు" మరియు "రక్షణ మంత్రిత్వ శాఖ సిబ్బంది "సంక్షేమం కోసం నిర్మించబడింది. 2011 లో, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా 10 సంవత్సరాల కాలంలో "ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ" వివిధ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలను ఉల్లంఘించిందని గమనించారు. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు మరియు సైనిక అధికారులు భూ యాజమాన్యం, జోనింగ్ కు సంబంధించి అనేక నియమాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు... మార్కెట్ రేట్ల కంటే తక్కువ రేటుకే అందులోని సభ్యులు ఫ్లాట్లను కొట్టేశారు అని తేల్చారు. 2011 లో ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ.. "ఆదర్శ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎపిసోడ్, ప్రధాన ప్రభుత్వ భూములను, ప్రజా ఆస్తి ని లాక్కోవడానికి అధికారులు ఎన్ని అడ్డదారులు తొక్కగలరో నిరూపించింది.." అని పేర్కొంది.. ఈ కుంభకోణం కారణంగా అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ 2010 లో పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. అంతేకాకుండా, మరో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు - విలాస్ రాఒ దేశ్ ముఖ్, సుశీల్‌కుమార్ షిండే మరియు శివాజీరావ్ - ఇద్దరు మాజీ పట్టణ అభివృద్ధి మంత్రులు - మరియు 12 మంది అగ్రశ్రేణి అధికారులు అందరూ కలిసి వివిధ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని తేలింది..
కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం 2010 లో భారతదేశం లోనే అతి పెద్ద కుంభకోణంగా పేరుగాంచింది.. 70,000 కోట్ల రూపాయల విలువైన ఈ స్క్యాం అప్పట్లో సంచలనం అయ్యింది... ఇందులో ప్రాజెక్టు కయ్యే ఖర్చుల అంచనాలను భారీ గా పెంచి నిధులను తప్పుదోవ పట్టించారు.. అప్పటి పూణే లోక్ సభ ఎంపీ సురేష్ కల్మాడి ఇందులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అవినీతి నిరోధక చట్టం క్రింద అతనిపై అభియోగాలు మోపారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.
2009 లో జరిగిన ‘ఇండియాస్ ఎన్రాన్ కుంభకోణం’ గా పిలువబడే ఈ కార్పొరేట్ కుంభకోణం భారతీయ పెట్టుబడిదారులను మరియు వాటాదారుల సంఘాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఛైర్మన్ రామలింగరాజు, తాను కంపెనీ ఖాతాల విషయం లో పెట్టుబడి దారులకు తప్పుడు సమాచారం అందించారనే అభియోగాలను ఎదుర్కొన్నాడు. ఆదాయాలను ఎక్కువచేసి చూపానని విచారణలో ఒప్పుకున్నాడు. ఈ మోసం విలువ రూ. 14 వేల కోట్లు. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయగా, రాజుతో పాటు మరో 10 మంది సభ్యులు జైలు కు వెళ్ళారు. టెక్ మహీంద్రా ఈ సంస్థను కొనుగోలు చేసి నడిపిస్తోంది..
ఇలా భారత దేశం అవినీతి అనే క్యాన్సర్ తో బాధపడుతూ బ్రతుకీడుస్తోంది.. ఈ క్యాన్సర్ కు సరైన మందు మోడీ ప్రభుత్వం కనిపెడుతుందని ఆశిద్దాం.. అవినీతి అనే ఈ క్యాన్సర్ భారత్ ను వదిలి పోవాలంటే ఏం చెయాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments