వీడియో గేంస్ ఆడితే పిల్లలు చదువులో వెనుకబడతారనే అభిప్రాయం ఉంది.. కానీ అతడి తల్లి ఆడుకోవడానికి ఒక కంప్యూటర్ కొనిచ్చింది.. అయితేనేం, అతడు స్కూల్ ర్యాంకుల్లో వెనుకబడినా జీవితం లో వందరెట్లు ముందుకు దూసుకుపోయాడు.. ఈ చదువులే అంతేనేమో! చదువును పక్కనబెట్టిన ఎంతో మంది తమ జీవితం లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు.. ఈ విషయం పై తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి..
అతడికి 13 ఏళ్ల వయసు.. అందరు పిల్లలు ఆ వయసులో పుస్తకాలతో కుస్తీ పడుతుండేవారు... కొంతమంది వీధుల్లో క్రికెట్ ఆడుతుండేవారు... జీవితం మీదా, భవిష్యత్తుపైనా ఒక ఆలోచనా, అవగాహనా ఉండని ప్రాయమది. కానీ ఆ పిల్లాడు అలా కాదు... తనకేం కావాలో, తనేం కావాలో పదేళ్లు కూడా నిండకుండానే నిర్ణయించేసుకున్నాడు! అతడే అయాన్ చావ్లా..
అయాన్ గుర్గావ్ లో జన్మించాడు. అతడి తల్లి కుంజమ్ చావ్లా.. ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తుండేది. అయాన్ అక్క పేరు జ్యోల్షా చావ్లా... ఆమె సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. చిన్నప్పుడు ఇంట్లో అతడికి సంతోషంగానే గడిచింది. కానీ అయాన్ మిగతా పిల్లలతో ఎక్కువగా కలిసేవాడు కాదు, ఆడుకునేవాడు కూడా కాదు. అతడిదో ప్రత్యేక ప్రపంచం. అతడి ఆలోచనలూ, తీరూ మొత్తం వేరేగా ఉండేవి. అందరిలా ఉండడం లేదని ఎవరైనా అన్నప్పుడు అతడి తల్లి లోలోపల బాధపడేదేమో తెలియదు గానీ, ఆ ప్రభావం అతడి మీద మాత్రం పడనివ్వలేదు. అయాన్ ఎలా ఉన్నా అతడి తల్లి ఏమీ అనకుండా ప్రోత్సహిస్తూ ఉండేది. బాగా చదువుకోవాలి, మంచి డిగ్రీ అందుకోవాలి అని చుట్టుపక్కలవారు చెబుతున్నా తనకు నచ్చిన అంశం పైనే ద్రుష్టి పెట్టేవాడు.. ఆయాన్ కు 8 ఏళ్లు వయసు ఉన్నప్పుడు అమ్మ వీడియో గేమ్స్ ఆడుకోవడం కోసం ఒక కంప్యూటర్ కొని తీసుకొచ్చింది. దాన్ని చూసి అయాన్ సంతోషం తో ఎగిరి గంతేశాడు.. ఆ రోజునుండీ అయాన్ కాలక్షేపం అంతా దాంతోనే. వీడియో గేములు తెగ ఆడేవాడు. కొన్నాళ్లకు వాటి మీద బోర్ కొట్టేసింది. మెల్లగా ఫొటో, వీడియో ఎడిటింగ్‌ల మీద ఆసక్తి పెంచుకున్నాడు. ఇంటర్నెట్‌లో దొరికే రకరకాల అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేసుకుని వాటి ద్వారా వీడియో, ఆడియో ఎడిటింగ్ చేసేవాడు. అప్పుడే అతడికి ఒక ఆలోచన వచ్చింది. "నేను ఇలా కొన్ని అప్లికేషన్లు వాడుతున్నానంటే... వాటిని ఇదివరకే ఎవరో తయారుచేసి ఉండాలి కదా! ఎవరో చేసింది నేను వాడటం ఎందుకు? నేనే సొంతంగా తయారు చేయొచ్చు కదా?" అనుకున్నాడు!! ఆ ఆలోచనలతో అయాన్ జీవితమే మారిపోయింది.
అయాన్ ఎప్పుడైతే సొంతంగా గేం అప్లికేషన్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడో వాటికి సంబంధించి రకరకాలైన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద పట్టుకోసం వివిధ లాంగ్వేజ్‌లు కూడా నేర్చుకున్నాడు. ఒక్క ఏడాదిలోనే దాదాపు 12 లాంగ్వేజ్‌ల మీద పట్టు సాధించాడు. చిన్న చిన్న వెబ్‌సైట్లూ, యాప్‌లూ తయారు చేసేవాడు. తొలిసారిగా పూర్తిస్థాయిలో ‘గ్రూప్ ఫర్ బడ్డీస్’ అనే సోషల్ కనెక్టివిటీ ప్లాట్‌ఫాంను అయాన్ సృష్టించాడు. అది కూడా ఫేస్‌బుక్ వంటిదే. దీని ద్వారా ప్రపంచంలో ఏ మూలనున్న వారైనా తమ స్నేహితులతో అనుసంధానం కావొచ్చు. పది లక్షల మంది వరకూ దీన్ని వాడే అవకాశం ఉంది. ఆ అప్లికేషన్‌కు అప్పట్లోనే మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఇక తిరిగి చూసుకున్నది లేదు. ఒక లెదర్ కంపెనీ తమ సంస్థకు లోగో తయారుచేసే పనిని అయాన్ అప్పజెప్పింది. దాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు అయాన్. ఒక కంపెనీ స్థాపిస్తే కస్టమర్స్ కి సేవలందించడం సులభమని తలచి ‘ఏషియన్ ఫాక్స్ డెవలెప్‌మెంట్స్’ ను స్థాపించాడు. ఐటీ, మార్కెటింగ్ ఉత్పత్తుల కోసం ఇది పనిచేస్తుంది. ఆ తర్వాత రెండేళ్లకు వెబ్ సొల్యూషన్స్ కోసం ‘గ్లోబల్ వెబ్ మౌంట్’, మీడియా-మార్కెటింగ్ కోసం ‘మైండ్-ఇన్ అడ్వర్టైజింగ్’ కంపెనీలను మొదలుపెట్టాడు. తొలి కంపెనీ స్టార్ట్ అయ్యేసరికి అయాన్ కు 13 ఏళ్లు. దాంతో చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. ఈ వ్యాపారాలకు తొలి పెట్టుబడి కేవలం 10,000 రూపాయలు మాత్రమే. అది కూడా అయాన్ అమ్మ తాను దాచుకున్న డబ్బుల నుంచి తీసి అయాన్ పై నమ్మకం తో ఇచ్చింది. అప్పుడు అయాన్ తో కేవలం అయిదుగురు సభ్యులు మాత్రమే కలిసి పని చేశేవారు. వాళ్లు కూడా అమ్మలాగే అతడి ప్రతిభను నమ్మి పనిచేసేవారు. ఇప్పుడు ఈ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా కస్టమర్లు ఉన్నారు. అమెరికా, ఇంగ్లాండ్, టర్కీ, హాంగ్‌కాంగ్ వంటి దేశాలకు బిజినెస్‌ను విస్తరించాడు అయాన్. ‘బిల్డ్, గ్రో, ఇన్‌స్పైర్’ అనేది అయాన్ కంపెనీ ట్యాగ్‌లైన్. అయాన్ అదే చేశాడు కాబట్టి విజయం అతడిని వరిస్తూ ఉంది...
కొత్తలో చిన్నవయసు కావడంతో ప్రతిదానికీ చాలా మొహమాటపడేవాడు. ఎవరిని ఏ సాయం అడగాలన్నా ఇబ్బంది పడేవాడు. కానీ బిజినెస్ లో ఎదగాలంటే అలా ఉండకూడదని తర్వాత అయాన్ కు అర్థమైంది. అన్నీ తెలిసిన వారు ఎవ్వరూ ఉండరు, అందరూ ఎప్పటికప్పుడు కొత్తగా తెలుసుకునేవారే! అది అర్థం అయ్యాక భయం వదిలేశాడు. అందువల్లే అయాన్ ప్రతి రోజూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఆచరణలో పెట్టేవాడు.. వ్యాపారంలో మెలకువలు తనకు తానే తెలుసుకున్నాడు. అంతకు ముందు అయాన్ కుటుంబ సభ్యులెవరూ బిజినెస్ చేసిన దాఖలాలు లేవు.. పైగా అయాన్ ఎలాంటి మేనేజ్‌మెంట్ కోర్సులూ పూర్తి చేయలేదు. కానీ అతడికున్న ఒకే ఒక్క గురువు, ఇంటర్నెట్! ఏ సమాచారం కావాలన్నా, కొత్తగా ఏం నేర్చుకోవాలన్నా, అన్నింటికీ దాని మీదనే ఆధారపడేవాడు అయాన్. ఇంటర్నెట్‌ను సరిగ్గా వాడితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పడానికి అయాన్ అతి పెద్ద ఉదాహరణ. కొత్తలో చాలా మంది క్లైంట్లు అయాన్ చిన్నపిల్లాడు అంటూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. వారి బిజినెస్ విషయాలకై అయాన్ తో సంప్రదించకుండా నేరుగా అతడి ఏంజెట్లను అప్రోచ్ అయ్యేవారు. కానీ కొన్నిరోజుల తర్వాత అయాన్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని అతడితో నేరుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ‘ఏషియన్ ఫాక్స్ డెవలెప్‌మెంట్స్’ మొదలుపెట్టేసరికి అయాన్ మరీ చిన్నవాడు కావడంతో దాని ఫైనాన్స్ విషయాలన్నీ అతడి తల్లి చూసుకునేది. ఆమే కంపెనీ ఛైర్‌పర్సన్ గానూ ఉండేది. కానీ ఎప్పుడూ వ్యాపార నిర్ణయాల్లో మాత్రం జోక్యం చేసుకునేది కాదు. "కేవలం పర్సనల్ కేర్, ఫైనాన్స్ మాత్రమే చూసుకోవాలని ముందుగానే ఆమెకు చెప్పా" అని అంటాడు అయాన్.. అయాన్ సంస్థలకు సంబంధించి ఎవ్వరి సలహాలూ, సూచనలూ తీసుకోడు. పూర్తిగా తన స్వంత ఆలోచనలు, నిర్ణయాలపైనే ఆధారపడతాడు. ముందు నుంచీ అదే అలవాటు చేసుకున్నాడు అయాన్. వ్యాపారం మొదలుపెట్టిన తొలి ఏడాది చాలా కష్టపడ్డాడు. బాగా చిన్నవాడు కావడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయేవాడు. కానీ ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదు. ఇప్పుడు అయాన్ కు 23 ఏళ్లు. ఈ వయసులో చాలా మందికి సాధ్యం కాని విజయాలను అతడు అందుకున్నాడంటే అతడు ఈ ప్రయాణాన్ని ముందుగా ప్రారంభించడం వల్లే.. ఎటువంటి ఇబ్బందీ లేకుండా అంత చిన్న వయసులో బిజినెస్‌ను మేనేజ్ చేయడం చాలా పెద్ద టాస్క్. కానీ ఆ ఛాలెంజ్‌ను సంతోషంగా స్వీకరించాడు. ఏ వ్యాపారం అయినా విజయవంతం కావాలంటే సేల్స్, మార్కెటింగ్ చాలా ముఖ్యం. అందుకే అయాన్ తన ఫోకస్ ఎక్కువగా వాటి మీదే పెట్టేవాడు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందడమెలాగో ఇంటర్ నెట్ లోనే తెలుసుకుని అమలుచేసి విజయం సాధించాడు.
అయాన్ డబ్బును మేనేజ్ చేసే పని తన అమ్మ గారికి అప్పజెప్పడం తో కొంచం ఒత్తిడి తగ్గినట్టైంది.. టర్నోవర్ ఎంత పెంచినా అప్పులు మాత్రం చేయలేదు అంటాడు అయాన్. అమ్మ పెట్టుబడిగా ఇచ్చిన డబ్బు మీద వచ్చిన చిన్నచిన్న లాభాలనే కలుపుతూ పెద్దస్థాయి పెట్టుబడిగా మార్చుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేసి వ్యాపారం చేయకూడదు అనేది అయాన్ ఫాలో అయ్యే సూత్రం. పార్టీలూ పబ్బులకు అస్సలు వెళ్లడు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటాడు. అది లేకపోతే ప్రపంచం ప్రస్తుతం ఉన్నట్టు ఉండేదే కాదని అయాన్ అభిప్రాయం. సోషల్ మీడియా శక్తి మీద అయాన్ కు చాలా నమ్మకం. చాలా దేశాల వారు అయాన్ ని సెమినార్లకూ, డిబేట్లకూ ఆహ్వానిస్తుంటారు. ఖాళీ ఉంటే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అక్కడ పిల్లలతో మాట్లాడుతుంటాడు. అతడికి తెలిసిన దాంట్లోనే అక్కడి పిల్లలకి కొత్తగా ఏదైనా నేర్పించేందుకు ప్రయత్నిస్తాడు. అది వారి భవిష్యత్తులో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుందనే ఆత్మ సంత్రుప్తి పొందుతాడు..
‘క్యాంపెయిన్ శిక్ష’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి చదువుకునే పిల్లల కోసం పనిచేస్తున్నాడు. చిన్నవయసులోనే ‘యంగ్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును రెండుసార్లు అందుకున్నాడు ఆయాన్. ప్రధాని నరేంద్రమోదీ అతడి ప్రతిభను మెచ్చుకుంటూ పంపిన అభినందన సందేశం అతన్ని ఎంతగానో ఉత్తేజపరిచింది. వ్యాపారం మొదలు పెట్టాక ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటాయి. ఎవరి ప్రయాణమూ పూలపాన్పు కాదు, ఎవరికీ విజయం ఊరికే రాదు. అందులో కష్టనష్టాలు తెలుసుకుంటేనే ఎవరైనా ముందుకు వెళ్లగలరు. అందుకే కాలేజీలూ, యూనివర్శిటీలకు అప్పుడప్పుడూ వెళ్లి ఎంట్రప్రెన్యూర్‌షిప్ పై మాట్లాడుతూ ఉంటాడు. అతడు నమ్మే సిద్ధాంతం ఒక్కటే, ‘మెచ్యూరిటీ కమ్స్ విత్ ఎక్స్‌పీరియెన్సెస్, నాట్ ఏజ్’. అనుభవం నేర్పే పాఠాలకు వయసుతో సంభందం లేదు. సరైన దారిలో వెళ్తే చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించవచ్చు. అందుకే ఈ కొటేషన్ ఎప్పుడూ అయాన్ తన టేబుల్ పై ఉంచుకుంటాడు. వ్యాపారాన్ని ఇంకా ఇంకా వృద్ధి చేసి నంబర్‌వన్‌గా ఎదగాలి అనేది అయాన్ కల..
"నేను ఇవాళ ఇలా ఉన్నానూ అంటే అది పూర్తిగా అమ్మ వల్లే" అని ఆనందంగా చెబుతాడు అయాన్. రోజంతా బిజీబిజీగా గడిచిపోయే అయాన్ కు ఏమాత్రం ఖాళీ దొరికినా అమ్మ తోనే సమయం గడుపుతాడు. అమ్మ పుట్టినరోజు, మదర్స్‌డే వంటి సందర్భాల్లో ప్రత్యేకంగా లంచ్, డిన్నర్లకు తీసుకువెళ్తుంటాడు. అయాన్ ఏ చిన్న బహుమతి ఇచ్చినా ఎంతో పొంగిపోయే అమ్మను చూస్తే అయాన్ కు చాలాసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది... "అసలు, పదేళ్ల పిల్లాడిపైన అంత నమ్మకం ఎలా పెట్టుకుందా?" అని, ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాడు అయాన్! బహుశా అమ్మంటే అంతేనేమో. తనకంటే కూడా ఎక్కువగా బిడ్డనే నమ్ముతుంది, బిడ్డ కోసమే బతుకుతుంది. అందుకే అయాన్ జీవితంలో అమ్మకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది.
అందుకే చిన్న పిల్లలలో ఎలాంటి ప్రతిభ ఉంది? వారు ఏం కోరుకుంటున్నారు? వారు ఎలాంటి వాటిపై ఆశక్తి కనబరుస్తున్నారు? అనే విషయాలు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి, వారితో మాట్లాడుతూ వారి అభిరుచులను తెలుసుకుంటూ ఉండాలి.. ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లలతో అధిక సమయం గడిపితే చిన్న వయసులోనే అద్భుతాలు చేసి చూపిస్తారు.. అయాన్ లాంటి మేధావులు ఎందరో సరైన పెంపకం లేక తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయలేక మరుగున పడిపోతున్నారు.. అలాంటి వారందరి ప్రతిభను వెలికి తీసిన రోజే సమాజం గా మనందరం విజయం సాధించిన వారమవుతాం..
ఎంతోమంది బావి భారత చిన్నారులకు, వారి తల్లి దండ్రులకు అయాన్ జీవితం ఆదర్శం కావలని భావిస్తోంది న్యూస్6జి..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments