ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు..
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే..
నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా, ఎందరేడ్చినా తిరిగి రామురా' అంటూ ఓ సినీ గీత కవి పాడుకున్నాడు. నిజమే.... నవ్వటం మనిషికి మాత్రమే వున్న ఒక వరం లాంటిది. హాయిగా నవ్వుకోగల వాతావరణం, ఆ వాతావరణాన్ని నిర్మించగల సమాజం ఎంతో ఆరోగ్యవంతమైనది.... అందుకే మరి ఇప్పుడు నవ్వు వలన కలిగే ప్రయోగాల గురించి తెలుసుకుందాం ...
చారిత్రక పరిణామ క్రమంలో మానవజాతి సమకూర్చుకున్న ఉద్వేగాల అభివ్యక్తాలలో నవ్వు కూడా ఒకటి. బెంగ లేకపోవడం, సంతృప్తిగా వుండటం, ఆనందం, సంతోషం మొదలైనవన్నీ నవ్వుకోడానికి అనుకూలించే అంశాలు. ఉద్యోగాలు పోయి, ఉపాధి పోయి, బతుకు భారమై, ఆకలితో పేగులు నకనకలాడుతున్న వేళ నవ్వెలా వస్తుంది? అయితే ఎదురయ్యే సవాళ్ళను నవ్వుతూ స్వీకరించే వాళ్ళూ వుంటారు. సమస్యలను ఎదుర్కోవాల్సిందే. నూతన ఉత్సాహంతో కడుపునిండా నవ్వుకో గలిగిన వాతావరణాన్ని సృష్టించుకోవాల్సిందే..
నవ్వడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. నవ్వు శరీరానికి వ్యాయామం లాంటిదేనని అంటున్నారు. ఒక్కసారి నవ్వితే పదిహేను ముఖ కండరాలు కదులుతాయట. పదిహేను నిముషాల నవ్వు అర్థగంట వ్యాయామంతో సమానమట. పొట్ట చెక్కలయ్యేలా నవ్వగలిగితే మన మెటబాలిజం రేటు పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుందని, హాయిగా నిద్ర పట్టి అధిక బరువూ తగ్గుతుందనీ చెబుతున్నారు. నవ్వటం వల్ల ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలయ్యి, రక్త ప్రసరణ సరిగా జరిగి ఉత్సాహంగా తయారవుతాం. అవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవి. సామాజికమైన లాభాలకు వెలకట్టలేం. పూచిన చెట్టుపై పది మంది చూపులు చేరినట్లు నవ్వే వారి దగ్గరకు మనుషులు చేరతారు.... మృగం నుంచి వేరు చేసేది నవ్వు... మనిషి జీవిత కాలాన్ని పొడిగించేది నవ్వు... నవ్వు నాలుగు విధాల చేటు అనేది ఒకప్పటి మాట... నవ్వు నలభై విధాల మేలు అనేది నేటి మాట అని అంటున్నారు.
నవ్వడంలో స్వచ్ఛత వుండాలి. చిన్న పిల్లల నవ్వులను పాల నవ్వులంటాం. వాళ్లను చూస్తే మనం కూడా నవ్వుతాం. చిన్న చిరునవ్వు ఎవరితోనైనా ఆత్మీయతను పెంచుతుంది. మనసులోని విషయాలను పంచుకోవటానికి అవకాశం ఇస్తుంది. చిరునవ్వుండే మోము ఎప్పుడూ వెలుగుతూనే వుంటుంది. ఎదుటి వాళ్ళలోనూ ఏదో ఉత్సాహాన్ని నింపుతుంది.
"సిరిమల్లె పువ్వల్లె నవ్వు... చిన్నారి పాపల్లె నువ్వు... చిగురిస్తు వుండాలి నీ నవ్వు... చిరకాలముండాలి నా నువ్వు..." అని పాడుతూ పాటంతా గాయని జానకి నవ్వే "నవ్వు" మనందరికీ హాయిని నింపుతుంది.
నవ్వును... హాసం, అట్టహాసం, వికటాట్టహాసం అని అంటాం. నవ్వటం, పెద్దగా నవ్వుకోవటం పరవాలేదు. వికృత నవ్వులూ, వెకిలి నవ్వులూ, వ్యంగ్యమైన నవ్వులూ ఉంటాయి. ఇవి కొంత బాధను కలిగిస్తాయి. మహా భారతంలో మయసభలో దుర్యోధనుడి నడకను చూసి ద్రౌపది నవ్వుతుంది. ఎక్కడాలేని అవమానానికి గురయిన సుయోధనుడు పగ తీర్చుకోవటానికి పూనుకుంటాడు. ఆడది నవ్వరాదనే... ఒక ప్రచార వ్యాఖ్యానం కూడా స్త్రీలను వివక్షతతో చూసినా అది సమాజపు భావజాలంలో భాగమే. ఇక ఎద్దేవా చేస్తూ సమాజంలో బలహీనులైన, అంటే ఆర్థికంగా బలహీనులను చూసి నవ్వే నవ్వుకు సమాధానంగా నవ్విన నాప చేనే పండుతుంది అని అంటారు. కృషితో సాధించగలమనే ధీమా అది. నవ్వుతూ వుండాలని చెబుతున్నామంటే అయిన దానికి, కాని దానికి నవ్వమని కాదు, సందర్భాన్ని బట్టి నవ్వుకోవాలని అర్థం.
ఇక బాగా నవ్వుకోగలిగిన వాళ్ళు, నవ్వు ముఖంతో ఉండేవాళ్ళు, మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. స్వచ్ఛమైన నవ్వు మనకు తెలుస్తూనే వుంటుంది. హాస్య ప్రియత్వం ఉన్న వాళ్ళు బాగా నవ్వుకోగలరు. ప్రతి మనిషిలోనూ హాస్య ప్రియత్వం కొనసాగాలి. అదీ మానవ లక్షణమే. మన నాయకుల ముఖాలు ఒకసారి చూడండి. వాళ్లు నవ్వినా సహజంగా కనిపించదు మరి. లోపల స్వచ్ఛమైన ఆలోచనలు లేకుంటే "నవ్వు" రమ్మన్నా రాదు. చిరునవ్వుతో పలకరించగల నాయకులే ప్రజలకు దగ్గర కాగలుగుతారు. దొంగలు నీ సొమ్మేదో దోచుకుపోయినట్టు ముఖాలను ఎందుకలా దిగాలుగా పెట్టుకోవాలి? మనసారా నవ్వాలి. నవ్వించాలి. నవ్వు ఓ పెద్ద పకలరింపు, పరామర్శ. ఓ ఉత్తేజం. అందుకనే దర్శకుడు జంధ్యాల నవ్వమన్నాడు.... నవ్వకపోవడాన్ని రోగమన్నాడు.
నవ్వడం వలన కలిగే ప్రయోజనాలివే...
మనకు వచ్చే రోగాల్లో 70 శాతం ఒత్తిడి వల్ల ఏర్పడేవే. గుండె జబ్బులు, డయబెటీస్, రక్తపోటు, డిప్రెషన్, ఇన్సోమియా, మైగ్రేన్, ఆతృత, అలర్జీ, పెప్టిక్ అల్సర్ తదితరాలన్నీ ఒత్తిడితో ముడిపడినవే. ఇవి తొలగిపోవాలంటే మీరు తప్పకుండా నవ్వాలి.
నలుగురితో కలిసి సరదాగా నవ్వేవారికి, ఒంటరిగా ఉండే వ్యక్తులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని ఓ సర్వేలో తేలింది. తరచూ నవ్వేవారికి గుండెజబ్బు వచ్చే ప్రమాదం తక్కువట.
నవ్వు వల్ల ఆందోళన దూరమై.. ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల ద్రావకాలు తగ్గుముఖం పడతాయట. పది నిమిషాలు నవ్వడం వల్ల కొంతమేరకు రక్తపోటు తగ్గుతుందట.
నవ్వు వల్ల రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన లింపాజైట్స్ ఉత్పత్తి పెరుగుతుంది.
నవ్వడం వల్ల ముక్కు, శ్వాసకోశాల్లోని పొరలు ఆరోగ్యంగా ఉంటాయి.
నవ్వు శరీరంలో సహజ రోగ నిరోధక హార్మోన్ల ఉత్పత్తి పెంచుతాయి. ఫలితంగా ఆర్థరైటిస్, స్పాండలైటిస్, మైగ్రేన్ లాంటి వ్యాధులు దరిచేరవు.
నవ్వు వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ పరిమాణం పెరుగుతాయి.
ఆస్తమా రోగులకూ సైతం నవ్వు మంచిదే.
నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజమై శక్తి వస్తుంది.
గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది.
మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీలు కరిగిపోతాయి.
గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు.
నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిస్ విడుదల అవుతుంది.
నిత్యం నవ్వుతూ ఉండే వారికి జీర్ణశక్తి పెరుగుతుంది.
మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషధంలా పనిచేస్తుంది.
నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడ నొప్పి సమస్య ఉండదు.
మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్వ ఔషధం.
హాయిగా నవ్వుకునే వారికి హైబీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడి తదితర సమస్యలు దూరమవుతాయి.
మనసారా నవ్వుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
హాయిగా నవ్వే వారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు.
డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకు లాఫింగ్ థెరపీ ట్రీట్‌మెంట్ చేయగా 70 శాతం వరకు సత్ఫలితాలు వచ్చాయని తేలింది.
థైరాయిడ్, మైగ్రేన్, స్కాండిలైటిస్ వంటి ఎన్నో సమస్యలను పరిష్కారం చూపుతుంది నవ్వు..
నవ్వడం వల్ల హాయిగా ఉంటాం. పని చురుగ్గా చేసుకోగలుగుతాం. తద్వారా ఉత్పత్తిశక్తి పెరుగుతుంది. ఇంటర్నెట్‌లో హాయిగా నవ్వుతున్న చిన్నపిల్లల ఫొటోలు, ముద్దు ముద్దు జంతువుల ఫొటోలు చూడడం వలన ఆనందంగా ఉంటుంది. హాయిగా నవ్వుకోవచ్చు.
వ్యక్తుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి నవ్వు ఉపయోగపడుతుంది. మనిషి సంఘజీవి. నవ్వు వల్ల సంఘంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆనందం వెల్లివిరుస్తుంది. నమ్మకం పెంపొందుతుంది. నిజాయితీ లేని నవ్వుని ఇట్టే గుర్తుపట్టేస్తారు. కాబట్టి హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి.
నవ్వు వల్ల మనుషుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. దానివల్ల స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఇతరుల ఆలోచనలకూ గౌరవం ఇవ్వడం వల్ల వారేం అనుకుంటున్నారనే దానిపై దృష్టి సారించగలుగుతాం.
నవ్వకుండా ఉన్నపుడు చింత ఏర్పడుతుంది. హాయిగా నవ్వితే చింత తొలగిపోతుంది.
హాయిగా నవ్వడం సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి స్థాయిని నిర్మూలిస్తుంది.
హాయిగా నవ్వడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. మల్టీ టాస్క్ చేయగల శక్తి లభిస్తుంది. మన అంతః చేతనంపై, గ్రహణశక్తిపై కంట్రోల్ లభిస్తుంది.
మనం నవ్వగానే ఇతరులు కూడా నవ్వేస్తారు. ఒకరినుంచి ఒకరికి నవ్వు సులభంగా సంక్రమిస్తుంది. మనః స్పూర్తిగా నవ్వే నవ్వు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. నవ్వు సులభంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది.
నవ్వు ఆకర్షిస్తుంది. నవ్వుతూ ఉండే ఆడవారికే పురుషులు ఎక్కువగా ఆకర్షితులవుతారు..
ఆత్మవిశ్వాసం, ధీమా కలిగిన నవ్వు గెలుపుకి సోపానం.
నవ్వు యవ్వనంగా ఉండడానికి తోడ్పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు నవ్వని వారికంటే 7 ఏళ్ళు ఎక్కువగా జీవిస్తారట..
ఇలా నవ్వుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి.. నేడు డబ్బు మాయలో పడి నవ్వడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరూ.. ఈ పరిస్థితి మారాలని న్యూస్ 6జి ఆశిస్తోంది.. ఏమంటారు?
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
అనారోగ్యాలను దూరం చేసే.... బొడ్డుతాడు ఎలా భద్రపరుస్తారు? ఏ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారు? జన్మతః ఉండే బొడ్డుతాడును భద్రపరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఏ రకమైన...
0 Comments