ఏం పిల్లడో ఎల్దమొస్తవా.....
ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు"..
ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్లడో ఎల్దమొస్తవా....అంటూ అందరినీ ఉర్రూతలూగించారు. ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరు తెచ్చుకున్న అతను మరెవరో కాదు...వంగపండు ప్రసాదరావు.
జానపద బాణీలో అనేక పాటలు రాసి పాడిన వంగపండు జూన్ 1943 లో విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పెదబొండపల్లి గ్రామంలో జన్మించారు. జగన్నాథం, చిన్న తల్లి దంపతులకు వంగపండు ప్రసాదరావు జన్మించారు.. వీరిది ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. ఆయన పుట్టిపెరిగినదంతా గ్రామీణ వాతావరణమే. వీరి కుటుంబంలో వంగపండే పెద్దవాడు. పెద్దగా చదువుకోలేదు. బొబ్బిలిలో ఐటిఐ చేసి, విశాఖపట్నం షిప్‌యార్డ్ లో ఫిట్టర్‌గా కొంతకాలం ఉద్యోగం చేశారు. ఉన్న ఊరిలో భూమిని అమ్ముకుని రాయగడ్‌లో తిరిగి భూమి కొన్నారు. ఆ భూమి అడవులకు సమీపంలో ఉండటం చేత, గిరిజనులతో వంగపండుకు పరిచయాలు పెరిగాయి. ఈ విధంగా గిరిజనుల మాటలు, పదాలు వంగపండు పాటల్లో విరివిగా కనిపిస్తాయి. వంగపండు ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఆయన మనసంతా ఉద్యమాల మీదనే ఉండేది.
మూడు దశాబ్దాలపాటు 300 కు పైగా జానపద పాటలు రాసి, పేద బలహీన, గిరిజన వర్గాల ప్రజలను ఎంతో చైతన్యవంతం చేశారు. ఆయన పాటలు ప్రజా చైతన్యానికి ప్రతీకలయ్యాయి. విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు. 1972 లో జననాట్యమండలి స్థాపించారు. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు, గద్దర్ మొదలైనవారి విప్లవ భావాలను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు ఎంతగానో కృషి చేశారు.. వంగపండు రాసిన 12 పాటలు తమిళం, బెంగాలీ, కన్నడ, హిందీ తదితర భాషల్లోకి అనువదింపబడ్డాయి. ముఖ్యంగా వంగపండు రాసిన అర్ధరాత్రి స్వతంత్రం సినిమాలో ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా… పాట 40 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువదించారు. ఈ ఒక్క ఉదాహరణతో మనం వంగపండు కీర్తి ప్రతిష్టలు ఏ స్థాయికి ఎదిగాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు. విప్లవ గేయాలతో పాటు కార్మికుల కష్టాలపైనా ఆయన ఎన్నో పాటలు రాశారు. విశాఖ షిప్‌యార్డులో ఆయన ఫిట్టర్‌గా పనిచేస్తున్న సమయంలో రాసిన ‘ఓడా! నువ్వెల్లిపోకే’’ అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది. అనేక విభాగాల కార్మికులు నౌకను తయారుచేసిన తరువాత.. తమ చెమట ఫలితంగా తయారైన ఆ ఓడ వెళ్లిపోతుంటే పడే బాధకు పాట రూపమిచ్చారాయన.
వంగపండు. కార్మిక పక్షపాతి అని చెప్పడానికి ‘యంత్రమెట్టా నడుస్త ఉందంటే…’ పాట ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ గీతం దాదాపు పది భాషల్లోకి తర్జుమా అయింది. ఈయన “అర్థరాత్రి స్వతంత్రం” సినిమా కంటే ముందు మాదాల రంగారావు, టి.కృష్ణ తదితరుల చిత్రాలకు పాటలు రాశారు. ‘జజ్జనకర జనారే…’ వంటి పాపులర్ గీతం వంగపండు కలం నుంచి వచ్చిందే.... అలాగే టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన “రేపటి పౌరులు” చిత్రంలో “అయ్యా నే చదివి బాగుపడతా…” పాటలో నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపిన వైనం ఆలోచింపచేస్తుంది. పోరు తెలంగాణ చిత్రంలో ‘జ్ఞానం ఒకడి సొత్తు కాదన్నా… అది సర్వ జాతుల సంపద ఓరన్నా’ పాటలో చాతుర్వర్ణ వ్యవస్థను చాలా బలంగా నిరసించారు. పురాణేతిహాసాల నుంచి వర్తమానం వరకూ దళిత, నిమ్న, బడుగు జాతులు వారిలో ఎంతటి గొప్పవారు ఉన్నారో చెప్పారు. “గుర్రం జాషువా మహాకావ్యం రాయలేదా… ఎన్ని నేర్చినా అర్జునుణ్ణి ఏకలవ్యుడు తన్నలేదా… దళిత బిడ్డ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదా…” అంటూ ఎలుగెత్తి చాటారు. కులవృత్తుల వారి నైపుణ్యాలను అక్షరాల్లో పొదిగారు. వంగపండు ప్రసాదరావు ‘అర్థరాత్రి స్వాతంత్య్రం’ సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ..’ పాటతో ఆయన ప్రఖ్యాతి పొందారు. ‘జజ్జనకర జనారే’ పాటతో ఆయన ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 30కి పైగా సినిమాలకు వంగపండు పాటలు రాశారు. దాసరి నారాయణరావు, టి. కృష్ణ, ఆర్.నారాయణమూర్తి, మాదాల రంగారావు సినిమాలతో పాటు అనేక చిత్రాలకు వంగపండు పాటలు రాశారు. ముఖ్యంగా ఆర్.నారాయణమూర్తి సినిమాల్లోని వంగపండు పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
కమ్యూనిస్టు ఉద్యమాల దారిలో సాగిన వంగపండు... గద్దర్ వంటి వారితో కలిసి సుదీర్ఘ కాలం జననాట్యమండలి కోసం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పల్లెపల్లెనా ప్రదర్శనలు ఇచ్చి, తమ పాటతో జన చైతన్యానికి కృషి చేశారు. వంగపండు సుమారు 400 వరకు పాటలు రాశారు. ఆయన పాడిన పాటల్లో జజ్జనకరి జనారే, నాంపల్లి స్టేషన్ కాడ, యంత్రమెట్ట నడుస్తున్నదంటే అంటూ సాగిన పాటలు విశేష ఆదరణ పొందాయి. అనేక మంది కళాకారులకు వంగపండు శిక్షణ ఇచ్చారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమార్తె వంగపండు ఉష కూడా కళాకారిణి. ఆమె ప్రస్తుతం వైసీపీ నాయకురాలిగా ఉన్నారు.
వంగపండుకు చిన్నతనం నుండి శివుడంటే ఇష్టం. శివుని నిరాడంబరతను అనుసరిస్తూ, అతి సామాన్యమైన జీవితాన్ని గడిపారు. ఈ క్రమంలో వంగపండు శివుని మీద ‘ఓమ్ ఉమాశంకరా .. వందిత పురంధరా.. హిమాచలాద్రి మందిరా.. ’ అంటూ పాటలు కట్టి, వాటిని పాడారు. శివయ్య బుర్ర కథలకూ బాణీలు కట్టాడు. అలాగని ఏనాడూ శివాలయానికి వెళ్లిన ఉదంతాలు లేవు. వంగపండు పూజల పేరిట వృథాగా డబ్బు ఖర్చుపెట్టేవాడు కాదు. కనపడని దైవాన్ని నిందించడం, కోపం తెచ్చుకోవడం ఎందుకని చెబుతుండేవారు. ఈ విధంగా చేస్తే మనలోని శక్తిని మనమే తిట్టుకున్నట్టు అవుతుందనేవారు. దైవం, దైవత్వం అంటే ఆపదలో ఉన్నవారికి సాటిమనిషిగా సాయపడటం అని వంగపండు నమ్మేవారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం సెంటు భూమికూడా ఉంచుకోకుండా తనకున్న 150 ఎకరాలను నిరుపేదలకు రాసిచ్చేశారు. ఆ భూములు పొందిన వారు ఇళ్లలో ఆయన్ని ఓ దేవునిగా కొలుస్తారు. ఎదుటివాడికి సాయపడాలనే విషయాన్ని భగవద్గీత, ఖురాన్, బైబిల్ బోధిస్తున్నాయని, కానీ మనం వాటిని మతగ్రంథాలుగానే చూస్తున్నామనీ వ్యాఖ్యానించేవారు. దైవం అంటే భయం కంటే భక్తి ఉండాలనీ, మనం నమ్మి భక్తిగా ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుందని... భయంతో ఏ పని చేసినా ఫలితం దక్కదనీ వంగపండు అభిప్రాయ పడేవారు.
సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి నడిచిన వంగపండు ప్రసాదరావు 2000 సంవత్సరం తరువాత జననాట్య మండలికి, ఇతర ప్రజా సంఘాల నుంచి కాస్త పక్కకు జరిగారు. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ఆయనను, ఆయన పాటను వాడుకునే ప్రయత్నం చేశాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పాటలు పాడారు. అనంతర కాలంలోనూ వివిధ రాజకీయ పార్టీల పక్షాన పాటలు రాయడమే కాకుండా వాటిని పాడేవారు. రాష్ట్ర విభజనకు ముందు కొద్దికాలం సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగిన సమయంలో ఆయన సమైక్యాంధ్ర ఉద్యమకారులతో కలిసి పనిచేశారు. తన జీవితమంతా ప్రజా ఉద్యమాలు, జానపద కళలకే వెచ్చించిన వంగపండు చనిపోయేవరకు అతి సామాన్య జీవనమే గడిపారు. తన కళను కానీ, పేరును కానీ ఆయన డబ్బు సంపాదనకు వాడుకున్న దాఖలాలు లేవు. ఆయన జీవితం పేదరికంలోనే గడిచింది. జననాట్యమండలి సిద్ధాంతాలకు కట్టుబడి, అందివచ్చిన సినిమా పాటల అవకాశాలను కూడా వదులుకున్నారు. వంగపండు తన జీవిత కాలంలో పెద్దగా ఆస్తులు కూడ పెట్టకపోయినా, ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్నారు.
వంగపండు ప్రసాదరావు రాసిన "ఏం పిల్లడో ఎల్దమొస్తవా" పాటను అతని అనుమతి లేకుండా మగధీర చిత్రంలోని అశ్లీల సన్నివేశంలో వాడుకున్నారు. దీనిపై వంగపండు అభ్యంతరం తెలిపారు. దాన్ని తొలగించాలని డిమాండ్ చేసారు. వంగపండు చేసిన సేవలకుగాను 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం అందుకున్నారు. ఇదే విధంగా అనేక పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడూ చలాకీగా కనిపించే వంగపండు ప్రసాదరావు... తన 77 వ ఏట... 2020 ఆగస్టు 4న తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.
వంగపండు జీవితం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.. మీకు ఇంకెవరి జీవిత చరిత్ర ఐనా తెలుసుకోవాలని ఉంటే కూడా మాకు తెలియజేయండి.. ఆ అంశం పై వీడియో చేసే ప్రయత్నం చేస్తాము..
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
అంతర్వేదిలో జరిగిన రథం కాల్చివేత ప్రమాదము మరియు ఆ తరువాత జరిగిన సంఘటనలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా దుశ...
0 Comments