మహిమాన్వితుడు మణికంఠుడు-2
అయ్యప్ప దీక్ష నియామాలేమిటి?
ఆయాన్ని ఎప్పుడెప్పుడు తెరుస్తారు?
శబరిమలలో మహిళల వివాదమేమిటి?
మహిమాన్వితుడు మణికంఠుడు మొదటి భాగంలో అయ్యప్పస్వామి చరిత్ర, మహిమలు, ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మహిమాన్వితుడు మణికంఠుడు రెండవ భాగంలో శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి సంబంధించిన వివరాలు, అయ్యప్ప దీక్షా విధానం, నియమాల గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం.
ఒకప్పుడు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకే శబరిమలయాత్ర పరిమిమై ఉండేది. ఆ తరువాతి కాలంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన భక్తులు కూడా అధిక సంఖ్యలో శబరిమలకు వెళ్లడం మొదలైంది. 1950లో బందిపోటు దొంగలు ఆలయాన్ని ధ్వంసం చేసి విలువైన ఆభరణాలను దోచుకెళ్లడంతో దేవస్థానం బోర్డు, భక్తులు కలసి 1951లో ఆలయాన్ని మూడోసారి పునరుద్ధరించారు. భక్తుల సంఖ్య లక్షల నుంచి కోట్లకు చేరుకోవడంతో దేవస్థానం బోర్డు 1980 నుంచి 1982 మధ్యకాలంలో పంబ నదిపై వంతెన, సన్నిధానం వద్ద ఫ్లైఓవర్, క్యూ లైన్లు, విద్యుద్దీపాలు, మంచినీటి కుళాయిలు, వసతి గృహాలు, ఆస్పత్రి మొదలైన సదుపాయాలను సమకూర్చారు. పరశురాముడు నిర్మించినదిగా చెప్పబడుతున్న పదునెట్టాంబడి అంటే 18 రాతి మెట్లు... భక్తులు కొట్టే కొబ్బరి కాయలతో అరిగిపోవడంతో 1985లో వీటిపై పంచలోహ కవచాన్ని ఏర్పాటు చేశారు. 1989-90లో పంబ మార్గంలో కొంత భాగాన్ని, సన్నిధానం ఆవరణను సిమెంట్ కాంక్రీటుతో నిర్మించారు.
అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులే స్వయంగా స్వాములుగా మారి 41 రోజుల పాటు కఠోర మండల దీక్ష పాటిస్తారు. కఠిన నియమాలతో కూడిన ఈ దీక్ష స్వామివారి దర్శనంతో ముగుస్తుంది. దీక్ష చేయనివారు కూడా అయ్యప్పను దర్శించుకోవచ్చు. కానీ వారు తలపై ఇరుముడి ఎత్తుకొని పదునెట్టాంబడి ఎక్కడానికి అర్హులు కారు. దీక్ష చేపట్టిన స్వాములను అయ్యప్ప అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. రెండు వందల ఏళ్ల క్రితమే అయ్యప్ప దీక్షలు కొనసాగినట్టు పందళరాజ వంశీయుల గ్రంధాల్లో నిక్షిప్తం అయినట్టు చరిత్ర చెబుతోంది. 1819లో 70 మంది స్వాములు శబరి ఆలయాన్ని సందర్శించారని, వారి ద్వారా ఏడు రూపాయల ఆదాయం వచ్చినట్టు రాజవంశీయుల రికార్డులలో ఉంది. శబరి ఆలయాన్ని ఏటా నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొన్ని రోజుల పాటు మాత్రమే తెరుస్తారు. మిగతా కాలమంతా అయ్యప్ప ఆలయం మూసే ఉంటుంది. భక్తులు నవంబర్ 17న మండల పూజను ప్రారంభించి డిసెంబర్ 27న ముగిస్తారు. సంక్రాంతి తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. ఈ మధ్యకాలంలోనే దీక్ష వహించిన అయ్యప్పలు మండల పూజ, జ్యోతి దర్శనం అంటే మకరవిళక్కు అనే రెండు సందర్భాల్లో స్వామిని దర్శనం చేసుకుంటారు.
శబరిమల సందర్శనకు వచ్చే భక్తులు, స్వాములకు అక్కడకు వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎరుమేలి, రెండవది పంపానది. ఎరుమేలి మార్గాన్ని పెద్దపాదంగా... పంపా మార్గాన్ని చిన్నపాదంగా పిలుస్తారు. అయ్యప్ప తన తల్లి వైద్యం కోసం పులిపాలను తెచ్చేందుకు ఎరుమేలి మార్గంలోనే వెళ్లినట్టు భక్తులు విశ్వసిస్తారు. ఎరుమేలి వద్ద అయ్యప్పను మరో మతానికి చెందిన వావర్ అనే దొంగ అడ్డగించి యుద్ధం చేసి, ఆ తర్వాత శిష్యునిగా, భక్తునిగా మారినట్టు జానపదులు చెబుతుంటారు. ఈ కారణంగానే అయ్యప్ప భక్తులు ఎరుమేలి వద్ద మొదట వావర్ స్వామి దర్గాను, ఆ తర్వాత అయ్యప్ప ధర్మశాస్త ఆలయాల్ని సందర్శించుకుంటారు. ఈ నేపధ్యంలోనే పేట తులాల అనే గిరిజన నృత్యాన్ని ఆడుతారు. ఆ తర్వాతనే శబరియాత్ర ప్రారంభం అవుతుంది. ఎరుమేలి నుంచి పంపానదికి 80 కిలో మీటర్లు, పంపానది నుంచి 8 కిలో మీటర్ల దూరంలో శబరి గిరీశుని ఆలయం ఉంటుంది. ఎరుమేలి నుంచి వెళ్లే మార్గం దట్టమైన అడవిలోంచి కొండల మీదుగా రాళ్లు, రప్పలు, ముళ్లు దాటుకుంటూ వెళ్లడం అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ మార్గంలోనే అయ్యప్ప మహిషిని సంహరించినట్టు పురాణ గాధ ప్రచారంలో ఉంది. అయ్యప్పను సులభతరంగా దర్శించుకోవాలనుకునే వారు మాత్రం నేరుగా పంపానది వద్దకు వెళ్లి అక్కడి నుంచి ఆలయానికి చేరుకుంటారు. ఏ మార్గం నుంచి వచ్చే భక్తులైనా తప్పనిసరిగా 8 కిలో మీటర్లు కాలి నడకన వెళ్లాల్సివుంటుంది. శబరి పీఠానికి చేరుకోవడానికి కాలినడకే శరణ్యం. తనను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కఠిన మార్గం ద్వారా చేరుకోవాల్సిందేనన్న నియామాన్ని అయ్యప్ప పెట్టాడన్న నమ్మకంతో ఇక్కడ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం లేదు. ప్రధాన మంత్రి, రాష్టప్రతి వంటి ప్రముఖులైనా అయ్యప్పను దర్శించుకోవాలంటే ఈ 8 కిలోమీటర్లు కాలినడకన చేరుకోవాల్సివుంటుంది..
అయితో అనారోగ్యంతో కానీ, వయోభారంతో కానీ శబరికొండపైకి ఎక్కలేని వారిని పైకి తీసుకెళ్లడానికి డోలీ సౌకర్యం ఉంటుంది. డబ్బులు తీసుకుని స్థానికులు డోలీని మోస్తారు. ఏ మార్గం నుంచి వచ్చిన భక్తులైనా మొదట పంపానదిలో స్నానమాచరించిన తర్వాతనే శబరికొండకు బయలుదేరాలనేది నియమమం. శబరికొండపైకి ఎక్కి స్వామి సన్నిధానం చేరుకున్న తర్వాత మాల ధరించిన అయ్యప్పలను మాత్రమే 18 మెట్లపై నుంచి అనుమతిస్తారు. దీక్ష చేయకుండా వచ్చే వారిని పక్కనున్న మార్గం ద్వారా ఆలయంలోకి అనుమతిస్తారు. అయ్యప్ప దర్శనం తర్వాత ఇరుముడిని సమర్పించిన అనంతరం మెడలో మాలను తీసివేయడం నియమం. ఎక్కువ మంది భక్తులు మాలను శబరిలోనే విసర్జిస్తారు. కొందరు మాత్రం ఎక్కడైతే మాలను ధరించారో తిరిగి అక్కడికి వచ్చేదాక దీక్షను కొనసాగిస్తారు.
అయ్యప్పస్వామి దర్శనంలో భక్తులు పరమ పవిత్రంగా భావించేది పదునెట్టాంబడి... అంటే 18 మెట్లు. ఈ మెట్లను పరశురాముడు స్వయంగా నిర్మించినట్టు పురాణగాథ చెబుతోంది. వీటిపై నుంచి వెళ్లాకే పరశురాముడు అయ్యప్పను దర్శించుకున్నట్టు భక్తుల విశ్వాసం. మండలం పాటు దీక్ష చేసిన స్వాములు మాత్రమే ఇరుముడిని తలపై ధరించి, వీటిని ఎక్కడానికి అర్హులవుతారు దీక్ష పూనకుండా అయ్యప్పను దర్శించుకునే భక్తులకు వేరే మార్గం ఉంటుంది. అయ్యప్ప సన్నిధానం 18 పర్వాతాల మధ్య ఉండటంతో 18 మెట్లు ఏర్పాటు చేసినట్టు పూర్వీకులు చెబుతారు. పొన్నంబలమేడు, గౌడెన్నల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, ఖల్గిమల, తంగమల, మ్యద్లుంల, శ్రీపాదమల, దేవర్మల, నిలక్కల్, తలప్పరమల, నీలిమల, కరిమల, పుదుసేర్య్మల, కలకెట్టిమల, ఇంచిప్పరమల, శబరిమల మొదలైన 18 పర్వతాలు ఉన్నాయి. 18 సంఖ్యకు పురాణాలు, ఇతిహాసాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. భగవద్గీత, మహాభారతంలలో 18 అధ్యాయాలు ఉన్నాయి. మహాభారత యుద్ధం, రావణ సంహారం 18 రోజులు జరిగినట్టు చెబుతారు.
పదునెట్టాంబడిలోని మొదటి ఎనిమిది మెట్లు అరిషడ్వర్గాలకు గుర్తు. ఇవి రాగద్వేషాలను సూచిస్తాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దంబం, అహంకారం వంటివి అధిగమించాలని దీని అర్థం. తర్వాతి ఐదుమెట్లు పంచేంద్రియాలు అంటే కళ్లు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శ. తదుపరి మూడు మెట్లు గుణాలను సూచిస్తాయి. అంటే రజస్సు, తమస్సు, సత్వం. చివరి రెండు మెట్లు: విద్య, అవిద్యను సూచిస్తాయి.
శబరియాత్రకు నిష్ఠతో వెళ్లడం తేలికేమీ కాదు. అయ్యప్ప మాల ధరించాలంటే మండలం పాటు అంటే 41 రోజుల పాటు కఠిన దీక్షను పాటించాలి. ఈ దీక్షలోని కఠోర నియామావళి వెనుక అనేక ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. దీక్షా నిబంధనల నుంచి ఎవరికీ మినహాయింపు లేదు. రాజుకైనా, భటుడికైనా, సంపన్నుడైనా, కటిక దరిద్రునికైనా ఒక్కటే నియమావళి అనసరించాల్సి ఉంటుంది. మొదటిసారి అయ్యప్ప మాల ధరించే స్వాములు తప్పనిసరిగా నల్లటి దుస్తులే ధరించాలి. గురుస్వామి హోదాకు చేరుకున్న తర్వాత మాత్రమే కాషాయం, నీలి దుస్తులు ధరించవచ్చు. నల్లటి దుస్తులు తమోగుణాన్ని సూచిస్తాయి. నలుపు శనికి ప్రీతి. నల్లటి రంగుకు వేడిని గ్రహించే గుణం ఉంటుంది. దీక్ష సమయంలో స్వాములు బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం బుద్ధికి, శక్తికి నిదర్శనం. స్వాములు దీక్ష సమయంలో కటిక నేలపై వస్త్రం పరుచుకొని పడుకోవాలి. నేలపై పడుకోవటం వల్ల వెన్నుపూస గట్టిపడి అయ్యప్ప దర్శనానికి వెళ్లినప్పుడు శబరి పర్వతారోహణ సులువు అవుతుంది.
స్వాములు ప్రతినిత్యం సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తర్వాత రెండుసార్లు చన్నీటితో తలస్నానం ఆచారించాలి. చన్నీటి స్నానం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి భగవత్ ధ్యానానికి ఉపకరిస్తుంది. బ్రహ్మీ ముహుర్తంలోనే పూజించడం వల్ల భగవంతుడు ప్రసన్నం అవుతాడని నమ్మకం. అయ్యప్పలు ఏకభుక్తం అంటే...మధ్యాహ్నం ఒకే పూట భోజనం చేయాలి. మద్యం, మాంసం, పొగాకు, ధూమపానం, తాంబూలం పూర్తిగా నిషిద్ధం. పూర్తిగా సాత్వికాహారం మాత్రమే స్వీకరించాలి. ఉదయం, సాయంత్రం అల్పాహారం, పండ్లు స్వీకరించవచ్చు. ఒంటి పూట భోజనం చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉండడం సులభతరం అవుతుంది. తాంబూలం, మసాలా దినుసులు, ఉల్లిపాయలు వంటివి భోజనంలో నిషిద్ధం. ఇవి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి. అయ్యప్ప దీక్షాధారులు కేశ ఖండనం చేసుకోకూడదు. చెప్పులు ధరించకూడదు. తోటివారిని ‘అయ్యప్ప’ అని మాత్రమే పిలవాలి. పిల్లలను మణికంఠుడని, మహిళలను మాలికాపురం మాత అని సంభోదించాలి. మధ్యాహ్నం స్వీకరించే భోజనాన్ని భిక్షగా, రాత్రి చేసే అల్పహారాన్ని సద్దిగా పిలవాలి. నొసట ఎల్లప్పుడూ విబూది, చందనం, కుంకుమ బొట్టు ధరించాలి. దీక్షా సమయంలో భార్యతో పాటు స్త్రీ మూర్తులందరినీ మాతలుగా భావించాలి. అశుభకార్యాలకు వెళ్లడం నిషిద్ధం.
అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి. దీంతో రుతుక్రమం వయసులో ఉన్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించకూడదనేది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. ఈ మత విశ్వాసానికి చట్టబద్ధత కల్పిస్తూ 1991లో కేరళ హైకోర్టు అయ్యప్ప ఆలయంలోకి 10-50 మధ్య వయసు కలిగిన మహిళల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ తీర్పును కొందరు సవాల్ చేస్తూ 2006 లో సుప్రీంను ఆశ్రయించారు. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని వాదించారు. ఈ కేసును విచారించి సెప్టెంబర్ 28, 2018లో సుప్రీం కోర్టు తన తీర్పులో- ‘ఆలయ ప్రవేశానికి స్త్రీ, పురుషులని వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. దీనిని అయ్యప్ప భక్తులు, హిందు ధార్మిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించడంతో మళ్లీ వివాదం రాజుకుంది. ఆలయ ప్రవేశానికి సుప్రీం అనుమతి ఇచ్చిందని కొందరు మహిళలు మతాచారాలకు విరుద్ధంగా శబరిమలకు చేరుకోవడంతో అప్పట్లో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది.
ఇదీ శబరిమళ ప్రశస్థి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments