జీవితానికి కొత్త అర్థాన్నిచ్చే
ఐన్‌స్టీన్ ఐడియాలజీ
దేవుడు ఉన్నాడా?
అతీంద్రియశక్తుల సంగతేంటి?
ఆలోచనా విధానం ఎలా ఉండాలి?
మానవుని సనాతన ఆలోచనా విధానాన్ని పునాదులతో సహా పెకిలించి, శాస్త్రీయంగా ఆలోచించే విధానాన్ని అందజేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు. ఛార్లెస్ డార్విన్ తన ‘జీవ పరిణామ సిద్ధాంతంతో సృష్టి రహస్యాన్ని ఛేదించాడు. కార్లమార్క్ ‘పెట్టుబడి’లో అదనపు విలువకున్న ప్రాముఖ్యతను ఆవిష్కరంచాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘మనో విశ్లేషణ’ ఫలకంపై కొత్త ఆలోచనల్ని రేకెత్తించి సరికొత్త చర్చలకు తెర లేపాడు. ఆ కోవకు చెందిన విశ్వ విశ్యాత శాస్త్రవేత్త ‘ఐన్‌స్టీన్ భౌతిక శాస్త్రంలో ‘సాపేక్ష సిద్ధాంతం’తో సంచలనం సృష్టించాడు. ఐన్‌స్టీన్ ఐడియాలజీ మన జీవితాలను సమూలంగా మార్చివేసి కొత్త ధృక్ఫధాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.
ఐన్‌స్టీన్ దృష్టిలో దేవుడంటే ప్రకృతి, ప్రకృతి ధర్మాలు మాత్రమే! ఆయన అతీంద్రియ శక్తుల్నిగానీ, క్రైస్తవ మతంలోని ట్రినిటీనిగానీ, ఏసుక్రీస్తు మహిమల్నిగానీ, ఆత్మ అమరత్వాన్నిగానీ, గ్రహ బలం గురించి గానీ ఎప్పుడూ నమ్మలేదు. “దేవుడు ఈ విశ్వంతో ఎప్పుడూ ఆటలాడుకోడు” అని ఐన్‌స్టీన్ తరచుగా అంటుండేవారు.
‘దైవ సిద్ధాంతాన్ని వదిలి నైతిక విలువల్ని స్థాపించాలి!’ అని మహాశాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్నారు. న్యూయార్క్ మహానగరంలో సండే స్కూల్‌లో ఆరో తరగతి చదివే ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో ఐన్‌స్టీన్‌కు ఒక ఉత్తరం రాశాడు. అందులో ఒక ప్రశ్న ఉంది. “శాస్త్రవేత్తలు ప్రార్థన చేస్తారా?, చేస్తే దేని కోసం చేస్తారు?” అని!. దానికి ఐన్‌స్టీన్ ఇలా సమాధానమిచ్చాడు. “ప్రకృతి సూత్రాలకనుగుణంగా ప్రతిదీ జరుగుతూ ఉందన్న భావన మీద శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. అందువల్ల ప్రార్థనతోనో, అతీంద్రియ శక్తులతోనో, ఆరాధనతోనో సహజ పరిణామాల్ని ప్రభావితం చేయవచ్చని ఏ పరిశోధకుడూ నమ్మడు అని ఐన్‌స్టీన్ వివరణ ఇచ్చాడు.
విశ్వంలో యాదృచ్ఛికమైన గతులుండవు. గణిత సూత్రాలకు అనుగుణంగానే ప్రకృతి నడుస్తూ ఉందనే ఖచ్చితమైన అభిప్రాయం ఉన్నవాడాయన. ఆయన “మతం” అనే మాటకు మరొక అర్థం చెప్పారు. దేవునితో సంబంధం లేకుండా మనిషి నైతికతతో మెలిగి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే ‘మతం’ అన్నారు. ఆ అర్థంతోనే మతం, అభిమతం మానవాళికి అవసరమన్నాడు. అయితే ఈ అంశాన్ని ఆయన చెప్పిన స్థాయిలోకి వెళ్లి ఆలోచించాల్సి ఉంది. అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మతం, దేవుడు అనే మూఢత్వంలో కొట్టుకుపోయే జనానికి ఈ విషయం అర్థం కావడం కాస్త కష్టమే! అయితే అర్థం కానంత క్లిష్టమైంది కూడా కాదు. వంశపారంపర్యంగా జీర్ణించుకుంటూ వచ్చిన సనాతన భావ జాలాన్ని కొంచెం పక్కన పెట్టి, మెదడులో ఏ మూలో దాక్కుని ఉన్న హేతువును నిద్రలేపి, విశాల హృదయంతో కొంచెం కొత్తగా ఆలోచిస్తే చాలు. ఐన్‌స్టీన్ భావం మనకు అవగతమవుతుంది.
“మన ఈ మెటీరియలిస్టిక్ యుగంలో మానవాళి శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న, తపన పడుతున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, వైజ్ఞానిక రచయితలే అత్యంత విశ్వసనీయమైన మతస్థులు” అని ఐన్‌స్టీన్ అంటారు. వ్యక్తులు ఊహించుకున్న ‘దేవుణ్ణి’ ఐన్‌స్టీన్ ఏనాడూ నమ్మలేదు. ఆ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో విస్పష్టంగా చెప్పారు కూడా! “తను సృష్టించిన వాటిని తానే ఆదుకోలేక, మళ్లీ తనే శిక్షించే దేవుణ్ణి నేను ఊహించుకోలేను. హేతువుకు, భౌతిక శాస్త్ర సూత్రాలకూ వ్యతిరేకంగా ఆయన చూపే లీలల్ని కూడా నేను ఊహించుకోలేను. అసలు దేవుడంటే ఎవరు? మనిషి బలహీనతకు ప్రతిబింబం! మనిషి భయంలోంచి, అజ్ఞానం లోంచి, ఊహల్లోంచి, భ్రమల్లోంచి రూపుదిద్దుకున్న భగవంతుడు చూపిన లీలలకు, లేదా చూపాడని చెప్పుకుంటున్న మహిమలకు ఆధారాలే లేవు. అలాంటప్పుడు మనం వాటిని నమ్మేదెట్లా?” అన్నది ఐన్‌స్టీన్ సంధించిన ప్రశ్న!
“ఎవరో నమ్ముకున్న దేవుడు లేడని నేనెందుకు నిరూపించాలి? అది నా పని కాదు. నమ్ముతున్న వారే వారెందుకు నమ్ముతున్నారో నిరూపించుకోవాలి. దేవుడున్నాడని మాట్లాడితే నేనొక అబద్ధాలకోరు నవుతాను. అయినా, వాస్తవాలకు నిరూపణలు వెతకొచ్చు. అవాస్తవాలకు నిరూపణ లెక్కడ?” అని ప్రశ్నించిన ఐన్‌స్టీన్ మత ప్రచారకులకు కొన్ని సూచనలిచ్చాడు. మత ప్రచారకులంతా తమ వ్యక్తిగత దేవుడి సిద్ధాంతాన్ని వదిలేయాలి, తమ ఆధీనంలో ఉన్న పాప పుణ్యాల్ని, భయాల్ని, నిరాశవాదాన్ని, పునర్జన్మల్ని మొత్తానికి మొత్తంగా తుడిచేసుకోవాలి. నైతిక విలువల్ని కాపాడే పోరాటంలో సామాన్యులతో కలిసి రావాలి.
‘కార్యకారణ సూత్రం’పై పని చేసే ఈ విశాల విశ్వాన్ని అర్థం చేసుకోవాలి. జరిగిన జరుగుతున్న పరిణామాల మీద అవగాహన పెంచుకోవాలి. మతంపై నుండి దృష్టి మరల్చి, సామాజిక అసమానతలపై దృష్టి పెట్టాలి. మానవుడి అమరత్వంపై తనకు నమ్మకం లేదని, నీతి అనేది మానవాతీత శక్తి కాదని, మానవుడికి సంబంధించిందేనని అన్నారు. అది అతడు తన ఆత్మ విశ్వాసంతో సాధించుకోవచ్చని ఈ విషయంలో దేవుడి ప్రమేయమే లేదని కరాఖండిగా చెప్పిన ఈ శాస్త్రవేత్త, "మరణానంతర జీవితాన్ని" కొట్టి పారేశారు. భౌతికంగా మనిషి చనిపోయిన తర్వాత జీవి బతికే ఉండడం ఆత్మలు తిరుగాడుతూ ఉండడం అనేవి మూఢ నమ్మకాలేనన్నాడు. మనిషి అంతర్గత అనుభవాలన్నీ పునరుత్పత్తులతో ముడివడి ఉంటాయి తప్పితే, దేహమే లేకపోయినప్పుడు ఆత్మకు అర్థమే లేదన్నారు.
మతం గురించిన ప్రస్థావనలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒక చోట ఇలా రాసుకున్నాడు. మతపరమైన తీవ్ర ఒత్తిళ్లను ఆయన బాల్యంలోనే ఎలా అనుభవించాడో గుర్తు చేసుకున్నాడు ” నాకు పన్నెండో యేట నుండి పాఠశాల మీద, ఉపాధ్యాయుల మీద అపనమ్మకం ప్రారంభమైంది. స్కూలు నన్ను ఫెయిల్ చేసింది. నేను స్కూలును! ఉపాధ్యాయులెప్పుడూ మిలట్రీ సార్జంట్లలాగ ప్రవర్తించేవారు. నాకు కావాల్సింది నన్ను నేర్చుకోనిచ్చేవారు కాదు. ఆ పోటీ తత్వం నాకు నచ్చేది కాదు. ముఖ్యంగా క్రీడల్లో దీని వల్ల వాళ్లు నన్ను వెళ్లిపొమ్నని అనేకసార్తు ఆదేశించారు.
మ్యూనిచ్‌లో అది ఒక క్యాథలిక్ స్కూలు. ఇక చెప్పేదేముంది? నా జ్ఞాన తృష్ణను మెలిక వేసి తిప్పుతూ ఉండేవారు. ప్రెయిజ్ ద గాడ్! పైగా మార్కులు, గ్రేడ్‌లే వారి కొలబద్దలు. అలాంటి వ్యవస్థతో ఉపాధ్యాయులు పసి కూనలైన చిన్నారుల మనోభావాల్ని, ఉత్సాహాల్ని, అభిరుచుల్ని ఎలా బేరీజు వేయగలరో నాకు తెలిసేది కాదు.” ఐన్‌స్టీన్ బాల్య అనుభవాలకు, సమకాలీనంలో మన బాలబాలికల జీవితానికి పెద్దగా తేడా కనిపించదు. మిషనరీ స్కూలయితే ప్రేయర్. మదరసా అయితే అల్లా, వేద పాఠశాల అయితే వేదాలు. అంతే. మత ప్రమేయం లేకుండా విచక్షణా జ్ఞానాన్ని పెంచే చదువులున్నాయా? వాస్తవాలేవో, భ్రమలేవో, కల్పన లేవో పిల్లలకు విడమరిచి చెపుతున్నామా? మతం సాధించే విజయానికి, విద్యా వ్యవస్థ అపజయానికి నేరుగా అవినాభావ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది.
గతం గడిచిపోయింది. ఏం చేసినా దాన్నిక మార్చలేం కానీ, సుఖాంతమయ్యే ఒక కొత్త ప్రారంభానికి మనం బీజం వెయ్యవచ్చు కదా? ఆ దిశలో మనం ఎందుకు ఆలోచించగూడదు? థియోసఫీ, స్పిరిచ్యువలిజం వంటివన్నీ మత గ్రంథాల చుట్టూ తిరిగే గందరగోళాలే! అసలు మత గ్రంథాలన్నీ అవాస్తవాలు, కల్పిత గాథలు అని అనుకున్న వారికి కొత్త ఆలోచనలు వచ్చే అవకాశముంటుంది. వైజ్ఞానిక శాస్త్రం నైతికతను కించపరుస్తుందన్న అపవాదు ఉంది. కానీ, అది నిజం కాదు! మానవుడి నైతిక ప్రవర్తన సానుభూతి, విద్య, వైద్యం, సామాజిక అవసరాలు, స్నేహ బంధనాల మీద అధారపడి ఉంటుంది. అందులో మతానికి చోటే లేదు. అవసరమే లేదు. మత ప్రమేయం లేకుండా కూడా, మానవులుగా, మహనీయులుగా ఐన్‌స్టీన్ ఐడియాలజీతో నడిచే అవకాశం అందిరికీ ఉంది.
ఇలా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు ఆ మహనీయుడు.. ఇంతకీ ఈ అంశం పై మీ అభిప్రాయమేంటి?
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments