మహిమాన్వితుడు మణికంఠుడు పార్ట్ వన్ ఇప్పుడు తెలుసుకుందాం..
పులుల గుంపుతో రాజ్యానికి వచ్చిన మణికంఠుడు..
కారణ మేమిటి?
బాణం విసిరిన చోటనే ఆలయం కట్టాలని అయ్యప్ప ఆదేశం..
కార్తీకమాసం ప్రారంభం కాగానే అందరి మదిలో అయ్యప్ప మెదులుతాడు. మణికంఠుణ్ణి దర్శించుకునేందుకు శబరిమలకు తరలివెళ్లే అయ్యప్పస్వాములు గుర్తుకువస్తారు. ఇంతకీ మణికంఠుడు ఎవరు? శబరిమలలో ఎందుకు కొలువయ్యాడు? ఆ మహిమాన్వితుని గొప్పతనం ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.
పందళ దేశాన్ని పాలించే రాజశేఖరుడు సంతానం లేక తీవ్ర మానసిక క్షోభ పడుతుంటాడు. ఒకరోజు వేటకు వెళ్లిన రాజశేఖరుడు పంబా నదీ తీరంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఎక్కడి నుంచో పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వచ్చిందో వెతకమని తన భటులను పంపిస్తాడు. ఒక పెద్దవృక్షం కింద పసిబాలుడు ఒంటరిగా కనిపించాడు. భటులు వెంటనే రాజుకు ఈ విషయాన్ని తెలిపారు. పిల్లలు లేని రాజు ఎంతో ఆసక్తిగా ఆ బాలుడు ఉన్న వృక్షం వద్దకు వచ్చి, ఆ శిశువును అక్కున చేర్చుకొని ముద్దాడుతాడు. ఆ బాలుడి మెడలో మణిహారం ఉండటంతో భగవంతుడే తనకు సంతానం లేదని గ్రహించి ఈ శిశువును అందించాడని పందళరాజు ఎంతో సంతోషిస్తాడు. తల్లిదండ్రులు ఎవరో తెలియని బిడ్డను తన రాజ్యానికి తీసుకెళ్తే రాజకుమారునిగా ప్రజలు ఆమోదిస్తారా? అనే అనుమానం మదిలో మెదులుతున్నా రాజపురానికి బయలుదేరుతాడు. అరణ్యమార్గంలో వెళ్తుండగా రాజశేఖరునికి.... అగస్త్య మహాముని ఎదురవుతాడు. మహారాజు తీసుకు వెళుతున్నా ఆ బాలుడిని చూసి... ఈ బిడ్డ మీ రాజ్యానికే కాకుండా భూలోకానికంతటికీ వన్నె తెస్తాడు అని దీవిస్తాడు. అనంతరం ఆ బాలుని మెడలోని మణిహారం చూసి... ‘మణికంఠుడి’గా నామకరణం చేస్తాడు. వేటకు వెళ్లిన రాజు అంత త్వరగా తిరిగి రావడాన్ని చూసిన రాణి ఆశ్చర్యంగా ఎదురు వెళ్తుంది. తనకు ఆ బాలుడు ఎలా దొరికాడన్న విషయాన్ని రాజు ఆమెకు వివరించడంతో సంతానం లేని రాణి ఆనందంలో మునిగిపోతుంది. ఆ రాజదంపతులు తమ ఆనందాన్ని దేశప్రజలతో కలసి పంచుకొనేందుకు సంబరాలు జరుపుకుంటారు.
బాలుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ పందళరాజ్యం కూడా సకల సంపదలతో అభివృద్ధి చెందుతుంది. తమకు భగవంతుడు ప్రసాదించిన బాలుని కారణంగానే సంపద కలసి వస్తున్నదని రాజదంపతులు సంతోషిస్తారు. ఐదవ ఏటనే మణికంఠుణ్ణి విద్యాభ్యాసం కోసం గురువువద్దకు పంపిస్తారు. ఏది చెప్పినా వెంటనే గ్రహించే ఆ బాలుడిని చూసి కారణజన్మునిగా భావిస్తారు. కొంతకాలానికి రాజదంపతులకు మరింత ఆనందాన్ని కలిగిస్తూ రాణి గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిస్తుంది. భగవంతుడు ప్రసాదించిన మణికంఠుడు రాజభవనానికి వచ్చాకనే, తమకు సంతానం కలిగిందని రాజదంపతులు భావిస్తారు. 12 ఏళ్లకే సకల విద్యల్లో మణికంఠుడు ఆరితేరుతాడు. అన్ని విధాలుగా యోగ్యుడైన మణికంఠునికి పట్టాభిషేకం చేసి శేషజీవితాన్ని భగవన్నామ స్మరణలో గడపాలని పందళరాజు భావిస్తాడు. ఆ విషయాన్ని రాణికి చెప్పడంతో ఆమె కూడా ఎంతో సంతోషిస్తుంది.
అయితే దుష్ట బుద్ధి కలిగిన మంత్రికి.... మణికంఠునికి రాజ్యం అప్పగించడం ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో... మహారాణి మనసు మార్చాలని ప్రయత్నిస్తాడు. సొంత బిడ్డను రాజును చేయకుండా అడవిలో దొరికిన బాలుడికి ఎలా పట్ట్భాషేకం చేస్తారంటూ... రాణి మనసులో విషం నింపుతాడు. తరువాత మణికంఠుణ్ణి అంతమొందించాలని రాణి, మంత్రి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అవి సఫలం కాకపోవడంతో చివరకు రాణి తాను అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడుతుంది. దిగులు చెందిన పందళరాజు వైద్యులను పిలిపించి, ఆమెకు తగిన చికిత్స చేయాల్సిందిగా కోరుతాడు. అయితే రాణి.... తనకు వచ్చిన రోగానికి మందు లేదని, పులిపాలను చూర్ణంలో కలిపి ఆ ఔషధం సేవిస్తే తప్ప తగ్గదని రాజుకు చెబుతుంది. ఈ విషయాన్ని మంత్రి తెలియజేశారని రాణి తన భర్తకు వివరిస్తుంది.
పులిపాలను తీసుకొచ్చే వారికి ఎంత ధనమైనా ఇస్తానని రాజ్యమంతా చాటింపు వేయించినప్పటికీ ఎవరూ ముందుకురారు. ఈ విషయం తెలిసిన మణికంఠుడు తానే వెళ్లి పులిపాలు తీసుకొస్తానంటాడు. అయితే తాను ఎంతో గారాబంగా పెంచుకున్న మణికంఠుణ్ణి అడవికి పంపించడానికి రాజు ఇష్టపడడు. అయితే మణికంఠుణ్ణి కుట్రపూరితంగా అడవికి పంపించించి, క్రూరమృగాలకు ఆహారమయ్యేలా రాణి, మంత్రి వ్యూహం పన్నుతారు. పులిపాలు తీసుకొని రావడం మణికంఠుడికి తప్ప ఎవరికీ సాధ్యం కాదని.... వారు రాజుకు నచ్చజెప్పుతారు. మరోమార్గం లేక అయిష్టంగానే మణికంఠుడిని పులిపాల కోసం అడవికి పంపించడానికి రాజు ఒప్పుకుంటాడు. అడవిలో వెళ్తున్నపుడు ఉపయోగపడతాయని రెండు అరలు కలిగిన సంచిలో... ఒక అరలో తినుబండారాలు, మరొక అరలో భగవంతుని నివేదనకు వస్తువులను మూటగట్టి మణికంఠునికి అందజేస్తారు. మణికంఠుడు పులులను వెతుక్కుంటూ అడవి మార్గంలో వెళుతుండగా ఎరుమేలిలో అటవీ ప్రాంత రాజు వావర్‌కు మణికంఠుడు తారసపడతాడు. బాలుడి మెడలో ధగధగ మెరిసే మణిహారంపై కన్నేసిన వావర్ దానిని లాక్కునేందుకు ప్రయత్నించగా మణికంఠుడు అతడితో యుద్ధం చేసి, ఓడిస్తాడు. ఫలితంగా వావర్ మణికంఠునికి శరణుజొచ్చి సేవకునిగా మారుతాడు. అనంతరం మణికంఠుడు అడవిలో ముందుకు వెళ్లగా... శాపం కారణంగా మహిషి రూపంలో ఉన్న రాక్షసుడు కనిపిస్తాడు.
మహిషిని... మణికంఠుడు సంహరించగానే దేవతలు ప్రత్యక్షమై.... మణికంఠుడి నిజరూపాన్ని తెలుసుకుంటారు. తాను పులిపాల కోసం అడవికి వచ్చినట్టు చెప్పగానే దేవతలంతా పులుల గుంపుగా మారి మణికంఠుడితో కలిసి పందళరాజ్యానికి బయలుదేరుతారు. పులి వాహనుడై వచ్చిన మణికంఠుణ్ణి చూసి ప్రజలు, రాజు, రాణి, మంత్రి భయపడిపోతారు. తల్లి వైద్యానికి పులిపాలు పిండి ఇస్తానని మణికంఠుడు చెప్పగానే.... మణికంఠుడు సామాన్య బాలుడు కాదని, సాక్షాత్తూ భగవత్ స్వరూపుడిగా గ్రహించి... తమను మన్నించమని అందరూ వేడుకుంటారు. మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలని రాజదంపతులు నిర్ణయించగా, తాను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్తానని మణికంఠుడు చెబుతాడు. తాను విసిరే బాణం ఎక్కడ పడితే.. అక్కడ తనకు గుడి కట్టించమని కోరుతాడు. తమను వదిలివెళ్లవద్దని ఎంతగా వారు ప్రాధేయపడినప్పటికీ మణికంఠుడు అంగీకరించడు. చివరకు ప్రతీ సంవ్సరం మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో దర్శనం ఇస్తానని చెప్పి, అడవిలోకి వెళ్లిపోతాడు. మణికంఠుడు బాణం వదిలిన చోట అయ్యప్ప స్వామి ఆలయం వెలిసిందని పురాణ గాథ చెబుతోంది.
అయ్య అంటే విష్ణువు... అప్ప అంటే శివుడు..... ఈ ఇరువురి పేర్ల సంగమంతో అయ్యప్ప అనే నామం పుట్టింది. హరిహర సుతునిగా అయ్యప్ప జన్మించినట్టు పురాణగాథలు చెబుతున్నాయి. కేరళలోని పత్తినంతిట్ట జిల్లా పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో శబరికొండపై అయ్యప్ప కొలువుదీరాడు. సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అటవీ ప్రాంతంలో 18 కొండల నడుమ శబరి గిరీశుని ఆలయం వెలిసింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని స్వయంగా పరుశురాముడు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. రెండు వందల ఏళ్ల క్రితం 1819లో 70 మంది భక్తులు దర్శించగా ఏడు రూపాయల ఆదాయం వచ్చినట్టు ఈ ఆలయాన్ని నిర్మించిన పందళరాజ వంశీయుల రికార్డుల్లో ఉన్నట్టు చారిత్రక పరిశోధకులు గుర్తించారు.
1907 వరకు శబరిమలలో అయ్యప్ప ఆలయానికి పైకప్పు ఎండుగడ్డి, ఆకులతో కప్పబడి ఉండేదట. గర్భగుడిలో అయ్యప్ప విగ్రహం కూడా శిలా రూపంలో ఉండేదని పూర్వీకులు చెబుతారు. గడ్డి, ఆకులు, తడకలతో ఉన్న ఈ ఆలయం 1909లో ఆగ్నికి ఆహుతి కావడంతో పునర్నిర్మించినట్టు ఈ ప్రాంతవాసులు చెబుతుంటారు. అప్పుడే అయ్యప్ప శిలావిగ్రహానికి బదులు పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానం అధీనంలో ఉండగా... భక్తుల సంఖ్య ఏటా లక్షలాదిగా పెరగడంతో దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసి, ఆలయ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అప్పటి వరకు కేవలం మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ‘జ్యోతి దర్శనాని’కి మాత్రమే తెరిచే ఆలయాన్ని మండల పూజలకు కూడా తెరవడం ఆరంభించారు. భక్తుల సంఖ్య మరింత పెరగడంతో 1945 నుంచి ఓణం వంటి పర్వదినాల సందర్భంగా ఆలయాన్ని తెరవడం ప్రారంభించారు.
మహిమాన్వితుడు మణికంఠుడు పార్ట్ 2 లో శబరిమల ఆలయానికి సంబంధించిన మరిన్ని వివరాలతోపాటు అయ్యప్ప దీక్ష విధి విధానాలు తదితర ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments