అంటురోగం కన్నా... అధైర్యమే ప్రమాదకరం..
శోకాన్ని తప్పించుకునే ఉపాయం, నిజమైన వ్యవసాయం..
మనుషులను మార్చే బుద్ధుని బోధనలు..
మానవాళి ఎదుర్కొంటున్న అంటువ్యాధుల ముప్పు ఈనాటిది కాదు. మానవుడు ప్రకృతికి విరుద్ధంగా నడుచుకున్నా, జీవరాశులన్నిటితో స్నేహంగా మెలగకపోయినా ఇటువంటి ఉత్పాతాలు తప్పవు. ఈ విషయమై గౌతమ బుద్ధుడు ఏనాడో హెచ్చరించాడు. శోకం లేని జీవితం లేదని, దానిని తప్పించుకునే ఉపాయాన్నీ చెప్పాడు. అంతటితో ఆగని బుద్దుడు తాను చేసే వ్యవసాయం గురించి కూడా వివరించాడు.... రండి... ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం....
అంటురోగం కన్నా... అధైర్యమే ప్రమాదకరం
బుద్ధుడు మగధ రాజధాని రాజగృహం లో ఉంటున్న రోజులవి. ఒకనాడు కొందరు బాటసారులు ఆయన దగ్గరకు వచ్చి... ‘‘భగవాన్! వైశాలి రాజ్య పరిస్థితి ఘోరంగా ఉంది. వైశాలి నగరం అంటురోగాలతో అల్లాడుతోంది... అని చెప్పారు. బుద్ధుడు వెంటనే తన వెంట 500 మంది భిక్షువులను తీసుకొని వైశాలికి వెళ్ళాడు. ఆ ప్రాంతం తీవ్ర అనావృష్టితో విలవిలలాడుతోంది. చెరువులు ఎండిపోయాయి. ఆ బురద నీటినే మనుషులూ, పశువులూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి కొరతతో, ఆహారం కొరతతో ఎన్నో పశువులు మృతిచెందాయి. అంతటా దుర్గంధం వ్యాపించింది. క్రమేపీ ప్లేగు, కలరా లాంటి అంటు రోగాలు ప్రబలిపోయాయి. వేలాది మంది మరణించారు. బౌద్ధ సంఘం వైశాలిలో ప్రవేశించిన రోజున... అనుకోకుండా కుంభవృష్టి కురిసింది. ఎన్నో జంతు కళేబరాలు, మనుషుల శవాలు నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయాయి. ప్రజలెవరూ బయటకు రావడం లేదు. రాజు, రాజ పరివారమంతా బంగళాలలో బందీలైపోయారు. నగరాన్ని శుభ్రం చేసేవారెవరూ లేరు.
బుద్ధుడు వచ్చాడని తెలిసి, కొందరు ధైర్యం చేసి బయటకు వచ్చారు. బుద్ధుడు సరాసరి రాజ మందిరానికి చేరుకున్నాడు. రాజును ఉద్దేశించి ...రాజా! ఏమిటీ పని! ఎందుకీ భయం! ఇలాంటి సమయంలోనే ధైర్యాన్ని కోల్పోకూడదు. రాజు ఆసరా ఇప్పుడే ప్రజలకు అవసరం. మీరూ, మీ రాజోద్యోగులూ, మంత్రులూ... అందరూ నగరంలోకి వెళ్ళండి. ప్రజలను ఉత్సాహపరచండి. వారిలో ధైర్యం నింపండి. అంటురోగాల కన్నా అధైర్యమే ప్రమాదకరం. భయమే ఎక్కువ కీడు చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు కోలుకోవడానికి కావలసిన సపర్యలు చేయాలి. వారికి తగిన ఔషధాలు అందివ్వాలి. ఈ విషయంలో మీరు సంచార ఆటవిక జాతుల నుంచి ఎంతో నేర్చుకోవాలి... అని చెప్పాడు. అనంతరం బుద్ధుడు భిక్షు సంఘంతో వీధుల్లోకి వెళ్ళాడు. భిక్షువులు నగరాన్ని మధ్యాహ్నానికల్లా శుభ్రం చేశారు. బౌద్ధ వైద్యుడు జీవకుడు తెచ్చిన ఔషధాలను ప్రజలకు అందించారు. భిక్షువులు వైద్యులుగా మారారు. ప్రజలు ధైర్యం తెచ్చుకున్నారు. ఆ రోజు సాయంత్రం బుద్ధుడు వారికి కొన్ని ప్రబోధలు చేశాడు. అవే ‘రత్న సూత్ర, మైత్రీ సూత్రాలు’ గా బౌద్ధ సాహిత్యంలో నిలిచిపోయాయి.
శోకాన్ని తప్పించుకునే ఉపాయం:
కిసా గౌతమి ఒక సంపన్న కుటుంబానికి చెందిన యువతి. ఆమె ఒక వ్యాపారిని వివాహం చేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు ఒక సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు.. అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా మరణించాడు. కిసా గౌతమి బాధపడసాగింది. ఆమె తన ఏకైక బిడ్డ మరణాన్ని భరించలేకపోయింది. ఏడుస్తూ, కేకలు వేస్తూ, చనిపోయిన తన బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని, తన కొడుకును తిరిగి బతికించడానికి ఒక మార్గం చూపించాలంటూ పట్టణంలోని ప్రజలందరినీ వేడుకుంటూ తిరుగుతోంది. వాస్తవానికి ఎవరూ ఆమెకు సహాయం చేసే స్థితిలో లేరు. ఇంతలో కిసా గౌతమికి ఒక వ్యక్తి ఎదురై.. ఇక్కడకు దగ్గరిలో బుద్ధుడు ఉన్నాడు.... అక్కడకు వెళితే తప్పక ప్రయోజనం ఉంటుంది అని చెప్పాడు. కిసాగౌతమి అతను చెప్పినట్టు బుద్ధుడున్న చోటుకు వెళ్లింది...... తన చనిపోయిన బిడ్డను బుద్ధుని వద్దకు తీసుకెళ్ళి, తన విషాధ కథను బుద్ధునికి చెప్పింది. బుద్ధుడు సహనంతో, కరుణతో ఆమె చెప్పినది విన్నాడు. తరువాత ఆమెతో... కిసా గౌతమీ... మీ సమస్యను పరిష్కరించడానికి ఒకే ఒక మార్గం ఉంది. మరణమన్నదే లేని నాలుగు, ఐదు ఇళ్ళకు వెళ్ళి పిడికెడు ఆవాలు తీసుకుని రా తల్లీ.. అని చెప్పాడు. కిసా గౌతమిలో ఆశ చిగురించింది. మరణమే లేని ఇంటిని వెతకడానికి బయలుదేరింది. అయితే ఆమె వెళ్లిన ప్రతీ ఇంటిలో ఒకరో లేదా ఇద్దరో మరణించారని ఆమె తెలుసుకుంది. చివరకు బుద్ధుడు తనకు ఏమి చెప్పాలనుకున్నాడో ఆమె గ్రహించింది... బాధ అనేది జీవితంలో ఒక భాగమని, మరణం మనందరికీ వస్తుందని గ్రహించింది. మరణం అనివార్యం అనే వాస్తవాన్ని కిసా గౌతమి అంగీకరించిన తర్వాత... ఆమె శోకం అణగారిపోయింది. తరువాత ఆమె బుద్ధుని వద్దకు తిరిగి వచ్చి అతని అనుచరులలో ఒకరిగా మారింది.
నిజమైన వ్యవసాయం
కాశీలోని ఏకనాళ వద్ద దక్షణా గిరి మీద తథాగత బుద్ధుడు ఒకప్పుడు ఉండేవాడు. భిక్షాటన కోసం తథాగతుడు భిక్షాపాత్ర తీసుకుని భారద్వాజుడు అనే బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళాడు. భారద్వాజుడు ఐదువందల నాగళ్ళతో వ్యవసాయం చేయిస్తున్నాడు. నాగళ్ళు దున్నే వారికి ఆహారం పెడుతున్న సమయానికి తథాగతుడు అక్కడకు వెళ్ళాడు. భారద్వాజుడు ఆహారం పంపిణీ చేస్తున్నాడు. బుద్ధుడు కూడా ఒక ప్రక్కగా భిక్షాపాత్ర పట్టుకుని నిలుచున్నాడు. భిక్ష కోసం నిలుచున్న బుద్ధుడిని చూసి భారద్వాజుడు ఇలా అన్నాడు....ఓ సన్యాసీ... నేను భూమిని దున్ని, విత్తనాలు జల్లి, పంట పండాక వచ్చిన ఫలసాయంతో జీవిస్తున్నాను. మీరు కూడా అలా దున్నాలి, విత్తనాలు జల్లాలి, అప్పుడే అన్నం తినాలి. అని అన్నాడు. అప్పుడు బుద్ధుడు... భారద్వాజునికి ఇలా సమాధానం ఇచ్చాడు.... ఓ భారద్వాజా ! నేను కూడా భూమి దున్నుతాను, విత్తనాలు జల్లుతాను... ఆ తరువాతనే తింటాను అని అన్నాడు.
వెంటనే భారద్వాజుడు... మేము ఎప్పుడూ మీరు కాడిని, నాగలిని, కర్రును, ములుగర్రను పట్టుకున్నది చూడనేలేదు, మీ దగ్గర ఎద్దులు కూడా లేవు అని అన్నాడు. దీనికి సమాధానంగా గౌతమ బుద్ధుడు... నేను కూడా భూమి దున్నుతున్నాను. విత్తనాలు విత్తుతున్నాను... ఆ తరువాత వచ్చిన ఫలసాయాన్ని తింటున్నానని చెప్పాడు.
భారద్వాజుడు... మీరు నిజంగా నాగలి పట్టుకుని భూమి దున్నేవారే అయితే నేనెప్పుడూ మీరు అటువంటి పనిచేయడాన్ని చూడలేదు. మీరు నిజంగా కర్షకులు అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి.... అని గౌతమ బుద్ధుడిని ప్రశ్నించాడు.
బుద్ధ భగవానుడు చిరుమందహాసంతో ఇలా సమాధానం ఇచ్చాడు... శ్రద్ధ నా విత్తనం. తపస్సు వర్షం... ప్రజ్ఞ నా కాడి, నా గతి...సిగ్గు నా ఏడికర్ర, మనసు కాడి పొలుపు... సతి నా నాగలి కర్రు మరియు ములుగర్ర...
శరీరాన్ని కాచుకున్న వాణ్ణి, మాటలను కాచుకున్న వాణ్ణి, అన్నం కోసం ఆకలి నిగ్రహించుకున్నవాణ్ణి, నేను సత్యాన్ని కలుపు తీసే కొడవలిగా వాడతాను. మృదుత్వం నా విమోచనం. నిర్వాణానికి మార్గం చూపుతున్నాను. శోకాన్ని పారద్రోలడానికి మార్గాన్ని చూపుతున్నాను....నేను ఈ విధంగా దున్నుతున్నాను అని తథాగతుడు చెబుతూ.... ఈ మార్గం వలన నీతివంతమైన మనుషులుగా మారతారు. ఈ పని పూర్తి అయిన తరువాత సర్వ దు:ఖాల నుండి విముక్తిని పొందుతారు. అని తథాగతుడు భారద్వాజునితో చెప్పాడు.
ఈ మాటలు విన్న భారద్వాజుడు... ధర్మాన్ని నాకు చక్కగా వివరించారు. దారి తప్పిన వారికి మీ మాటలు దారిచూపుతున్నాయి. రహస్యంగా ఉన్న ధర్మ సూక్ష్మాలను వెలికి తీసి, చీకట్లో ఉన్న నాకు జ్ఞానదీపం సాయంతో దారి చూపుతూ వెలుగులోకి తీసుకువచ్చారు. నేను ఇక నుండి భగవాన్ బుద్ధుణ్ణి ధర్మాన్ని, సంఘాన్ని శరణు వేడుకుంటున్నాను. అని అన్నాడు.
ఇలాంటి అనేక జీవిత సత్యాలను ఉదాహరణలతో నలుదిక్కులా చాటాడు గౌతమ బుద్దుడు..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments