భగవానునితో అనుభవాలు..
రమణునిలో సుబ్రమణ్య స్వామి..
పరిగెత్తించే మాయ..
టెంకాయ కప్పు..
తన కాళ్లను ఒత్తుకుంటే పుణ్యమా?
గురుబోధ లేకుండానే, ఆధ్యాత్మిక సత్యాలను దర్శించిన అన్వేషి ఆ మహర్షి.... ‘నేను’ అనే మాట మీద దృష్టిని పెట్టండి చాలు, మాయ తెరలు తొలగిపోతాయని సూచించిన జ్ఞాని. తన 16వ ఏట మరణానుభవం కలిగిన దగ్గర్నుంచీ, నేనులోనే లీనమైపోయిన మహనీయుడు. 1896 మొదలు, ఐదు దశాబ్దాలకు పైగా తిరువణ్ణామలైలో ఆశ్రయం పొందిన మౌన స్వామి... ఆయనే భగవాన్ రమణ మహర్షి. ఆ మహనీయుని చెంత కాలం గడిపిన భక్తుల అనుభవాలు అక్షర రూపం దాల్చి, వివిధ పుస్తకాల్లో దర్శనమిచ్చాయి. వాటిలో కొన్ని మీకోసం...
ఒక వ్యక్తి చాలా నిష్ఠగా శాస్త్రాలలో చెప్పిన రీతిగా సుబ్రమణ్య స్వామిని ఆరాధించేవాడు. అతను ఒకసారి మహర్షిని దర్శించి ఇలా అన్నాడు... స్వామీ నేను చిన్నప్పటి నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో సుబ్రమణ్య స్వామిని కొలుస్తూ వస్తున్నాను. కానీ నాకు ఈ నాటి వరకు ఆ స్వామి దర్శనం కాలేదు.... అన్నాడు. భగవాన్ మౌనంగా ఉంటూ ఆ వ్యక్తినే తీక్షణంగా చూస్తున్నారు. అక్కడ కవి అయిన మురుగనార్ అనే ఆశ్రమవాసి కూడా ఉన్నారు. ఆయన కూడా ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. ఎవరు ఎన్ని అన్నా ఆయన మారుమాట్లాడేవారు కాదు. ఈ వ్యక్తి మాటలు విని మురుగనార్ తన చేతులు ఎత్తి భగవాన్ ని చూపిస్తూ అతనితో అన్నారు... నువ్వు సుబ్రమణ్య స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇప్పుడు నీ ఎదురుగా కూర్చుని కనిపిస్తున్న ఈ రూపం ఎవరని అనుకుంటున్నావు? అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి జీవితాంతం చేసిన సాధనకు ప్రతిఫలం ఇస్తున్నట్టు... భగవాన్ .. ఆ క్షణంలో సుబ్రమణ్య స్వామిగా మారిపొయారు. ఇది చూసిన ఆ వ్యక్తికి నోట మాట రాక పలుమార్లు తన కళ్లు రుద్దుకొని చూడసాగాడు. కొద్దిసేపటికి కళ్లు పూర్తిగా విప్పి ఆనంద భాష్పాలు కారుస్తూ ... అవును, అవును.. అని అన్నాడు. అదే రోజు సాయంత్రం ఆ వ్యక్తి రమణ ఆశ్రమం ఎదురుగా ఉన్న మురుగనార్ ఇంటికి వెళ్లి, చేతులు జోడించి.... మురుగనార్ చేసిన సాయానికి కృతఙ్ఞతలు తెలియజేశాడు.
ఒక రోజు అనుకోకుండా చాలామంది అతిథులు ఆశ్రమానికి వచ్చారు . వచ్చిన వాళ్లందరికీ భోజనం పెట్టవలసిన అవసరం ఏర్పడింది.
ఆశ్రమ వంట వాళ్లలో ఒకరు మహర్షి దగ్గరకు వచ్చి... స్వామీ... వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రమంలో సరిపోయినంత ఆహారం లేదని.. మా అందరికీ ఆందోళనగా ఉందని... ఏమి చేయమంటారు? అని అడిగాడు. దీనికి సమాధానంగా మహర్షి... మీరు ఏమీ ఆందోళన చెందకండి. అందరికీ
సరిపోయేటంత ఆహారం ఉంటుందని అన్నారు. అప్పుడే కొత్తగా ఆశ్రమానికి వచ్చిన ఒక భక్తుడు దీనినంతా గమనిస్తున్నాడు . ఇతరులతో పాటు ఆ భక్తుడు కూడా భోజనశాలలో ఏమి జరగబోతుందా? అని ఎదురుచూశాడు. భోజనాలు వడ్డించే ముందు, మహర్షి ప్రతివారి వంకా చూశారు. భోజనం ప్రారంభించక ముందే చాలా మందికి ఆకలి తీరిపోయింది. కడుపు నిండిపోయింది. ప్రతివారూ... తినవలసిన దానికంటే కొద్దిగానే తినగలిగారు. ఆ విధంగా, వండిన వంట అందరికీ సరిపోవడమే కాకుండా ఇంకా చాలా మిగిలింది. కొత్తగా వచ్చిన ఆ భక్తుని ఆశ్చర్యానికి అవధులు లేకుండాపోయాయి.
రమణ మహర్షిని ఒకతను ఎప్పటి నుంచో...మాయ అంటే ఏమిటి? అని అడుగుతూ ఉండేవాడు. అయితే మహర్షి ఏమీ చెప్పేవారు కాదు. మౌనంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజున అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మహర్షి దర్శనార్ధమై ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమవాసులందరూ చాలా హడావుడి చేశారు. మహర్షి ముఖంలో మాత్రం ఏ మార్పూ లేదు. ఒక సామాన్యుడు వస్తే ఎలా ఉన్నారో... రాష్ట్రపతి వచ్చినా అలాగే ఉన్నారు. బాబూ రాజేంద్రప్రసాద్ మహర్షి సమక్షంలో మౌనంగా కాసేపు కూర్చున్నారు. దర్శనం అయిపోయాక రాష్ట్రపతి వెళ్ళేటప్పుడు అందరూ ఆయనను సాగనంపడానికి పరిగెత్తి వెళ్లారు. మహర్షి దగ్గర ఎవరూ లేరు. అయితే మాయ అంటే ఏమిటి అనే సందేహం అడిగిన వ్యక్తి మహర్షి సమీపంలో ఉన్నాడు. అప్పుడు మహర్షి అతనితో...మాయ అంటే ఇదే....అని ఒక్కమాట మాత్రం చెప్పారు. ఆ వ్యక్తికి నోటమాటరాలేదు.
ధనికుడైన ఒక వ్యక్తి వెండితో చేసిన కప్పు, సాసరూ, చెమ్చాను ఆశ్రమానికి తెచ్చి... భగవాన్... మీరు ద్రవపదార్థం ఏదైనా తీసుకునేటప్పుడు వీటిని ఉపయోగించాలని కోరారు. భగవాన్ వాటిని ఆశ్రమవాసులకు ఇచ్చారు. వాటిని ఆశ్రమవాసులు అక్కడున్న బీరువాలో పెట్టబోతుండగా... భగవాన్... అక్కడెందుకోయ్....ఆఫీసులోనే ఉంచండి. అన్నారు.... దీంతో వారు భగవాన్.... వీటిని వాడుకునేందుకే కదా వారిచ్చారు ? అని అన్నారు. వెంటనే భగవాన్...సరిపోయింది ఇవన్నీ ధనవంతులు వాడేవి... మనకెందుకు ? కావాలంటే మన సొంత కప్పులు చెమ్చాలు ఉన్నాయి కదా... వాటిని వాడుకోవచ్చు . ఇవెందుకు? అని ఆన్నారు. తరువాత... ఏమోయ్ రేపటి నుంచి సొంత కప్పు వాడుకుందాం....తీసి ఇవ్వు అన్నారు భగవాన్. వెంటనే అతను సొంత కప్పేమిటి భగవాన్ ? అని అడిగారు... ఓ అదా.... టెంకాయ చిప్పలు అరగదీసి నునుపు చేసి పెట్టుకున్నాం కదా అవే నాకు
కప్పులూ, చెమ్చాలు. అవి మనకు సొంతం. వాటిని వాడుకుంటే సరిపోతుంది. ఈ వెండి వస్తువులు భద్రం చేయమనండి అన్నారు భగవాన్.
ఇవి మాత్రం భగవానునివి కాదా ? అన్నాడా భక్తుడు . భగవాన్ నవ్వుతూ...అది సరేనండీ.... ఆ ఆడంబరమంతా మనకెందుకు చెప్పండి ? అవి ఖరీదైనవి. ఏమరుపాటుగా ఉంటే వాటిని ఎవరైనా ఎత్తుకొనిపోతారు. వాటికి కాపలా కాయాలి. అదేనా... నా పని ? అదీగాక స్వామేకదా... అడిగితే ఇవ్వరా ? అని ఎవరైనా అనుకోవచ్చు. అప్పుడు కాదనలేం.... ఒకవేళ ఎవరికైనా ఇచ్చామా అంటే... స్వామికనితెస్తే ఎవరికో ఇచ్చారే అని వారనుకోవచ్చును. ఎందుకిదంతా ? మన సొంత కప్పులైతే ఎలా వాడుకున్నా, ఏం చేసుకున్నా పరవాలేదు అని చెబుతూ ఆ వెండి వస్తువులు అక్కడి నుంచి పంపించి, వెంటనే సొంత కప్పులు తీయించి, అందరికీ చూపించారు.
ఒకప్పుడు భగవాన్ రమణులకు కాళ్ళు నొప్పులు అధికంగా వుండటం వల్ల తైలం రుద్ది, కాళ్ళు వత్తేవారు సేవకులు. చొరవ చూపే భక్తులంతా అర గంట చొప్పున వంతులవారీగా రమణుల కాళ్ళు వత్తడం ప్రారంభించారు. ఆ విధంగా గురుసేవ చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల అభిప్రాయం. కానీ సర్వ జీవ సమభావం గల రమణులకు ఇది ఇష్టం లేదు. అలా అని వద్దు అని కఠినంగా చెప్పటం వారి పద్ధతి కాదు. అందువల్ల ఛలోక్తిగా....మీరంతా కాస్త ఆగండి. నేను కూడా కాసేపు కాళ్ళు వత్తుకుంటాను. ఆ పుణ్యం నాకు కూడా రావద్దూ?... అంటూ వారి చేతులు తొలగించి తన కాళ్లను తానే వత్తుకోవడం ప్రారంభించారు. దీంతో అందరూ ఆశ్చర్య పోయి విచిత్రంగా చూడటం మొదలు పెట్టారు. తనకు కూడా గురుపాదసేవా భాగ్యం కల్పించమని కోరిన ఒక భక్తునితో ...అత్మావై గురుః” అన్నారు. ఆత్మ సేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే అని దీని భావం....ఇక నైనా ఆత్మ సేవ చేసుకోండి. మాట్లాడకుండా ఊరికే వుంటే అంతే చాలు అని రమణులు అన్నారు.
రామనాథపురం రాజావారు ఒకసారి రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చారు.. ఆ సమయంలో భగవాన్ వంట గదిలో ఏదో పనిచేస్తున్నారు. రాజావారు వచ్చిన విషయం మహర్షికి చెప్పినా... పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత హాల్లోకి వచ్చిన భగవాన్‌కు రాజావారు నమస్కారం చేసి... తిరుగు ప్రయాణమయ్యారు.
రాజావారిని సాగనంపుతూ బయటకు వెళ్లిన ఆశ్రమ పెద్ద దండపాణిస్వామి.. ఆశ్రమంలోని వసతుల లేమి, ఆశ్రమ నిర్వహణకు కావాల్సిన ధనం గురించి రాజావారికి వివరించారు. ఈ విషయం తెలిసిన మహర్షి దండపాణిస్వామితో ఇలా అన్నారు.. నువ్వు రాజావారిని చెడగొట్టావు. ఆయనకు పెద్దరాజ భవనం, బోలెడు ధనం, వాటి వల్ల లభించే సుఖాలు ఉన్నాయి. అయినా ఇంకేదో అసంతృప్తితో ఆనందం కోసం ఆశ్రమానికి వచ్చారు.
నీ సమస్యలు చెప్పి ఆయనను బిచ్చం అడిగావు అన్నారు మహర్షి..
ఇలా పుణ్యపురుషుల చర్యలకు అర్ధాలు ఎంతో గొప్పగా ఉంటాయి అని మనం అర్ధం చేసుకోవాలి..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments