మనిషి జీవితం లో అనేక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు ఎదురవుతుంటాయి.. అయితే ఒక్కోసారి కొన్ని నీతి కధలు మన జీవితాలపై ప్రభావాన్ని చూపి మనల్ని విజయం వైపు పరుగులు పెట్టిస్తాయి.. మార్పుకు నాంది అవుతాయి.. అలాంటి మూడు విభిన్నమైన కధలు ఇప్పుడు తెలుసుకుందాం..
మానవుడికి ముఖ్యంగా కావలసింది ఏమిటి?
'అది ఒక చిన్న కొండ. ఆ కొండ మీద ఓ పూరిగుడిసె! ఓ ముసలిభార్యాభర్తా, వారికొడుకూ కోడలూ ఆ ఇంట్లో ఉండేవారు. అంతాబాగానే ఉంది. పొద్దున లేచి గుడిసెలోంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది, ఎదురుగుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు. కొండ కింద ఉన్న ఊరిలో ఇంటిపెద్దాయనా, ఆయన కొడుకూ పనికి వెళ్తారు. రోజంతా ఒళ్లు వంచి పనిచేసి, మర్నాటికి సరిపడా సంపాదించుకొని ఇంటికి చేరతారు.
ఓ రోజు తండ్రీకొడుకులు ఎప్పటిలాగే పనికి బయల్దేరారు. ఆ సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులు వచ్చారు. బుర్ర మీసాలు, బారెడు గడ్డంతో వారంతా చాలా చిత్రంగా ఉన్నారు. కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ‘ఎవరయ్యా మీరు! పాపం దారి తప్పి వచ్చినట్లున్నారు. రండి కాసిని మంచినీళ్లు తాగండి. మాతో కలిసి భోంచేయండి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి,’ అంటూ ఇంటావిడ సాదరంగా ఆహ్వానించింది.
ఇంటావిడ మాటలకు ఆ నలుగురూ చిరునవ్వు నవ్వి ‘మరేం ఫర్వాలేదు. మేము ఈ అరుగు మీదే కూర్చుంటాము. మీ ఇంట్లోవారంతా వచ్చిన తర్వాతే మేము ఇంట్లోకి వస్తాము,’ అని చెప్పారు. మరికాసేపటికి తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికి చేరుకోనే చేరుకున్నారు. ఇంటి బయట ఉన్నవారి గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది. వెంటనే ఆ ఇంటి పెద్దాయన బయటకు వెళ్లి- ‘ఇంట్లో వారమంతా వచ్చేశాము. దయచేసి లోపలకి రండి,’ అంటూ ఆహ్వానించాడు.
‘మేము నలుగురమూ ఒకేసారి లోపలకి రావడం కుదరదు. మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి, మరొకరు విజయానికి సూచన, ఇంకొకరు డబ్బుకి చిహ్నం, నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి,’ అని వారిలో ఒకరు చెప్పారు.
వారి మాటలు విన్న పెద్దాయన ఇంట్లోకి వెళ్లి విషయం చెప్పాడు- ‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది? ముందు డబ్బుని లోపలకి రమ్మనండి. ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను,’ అన్నాడు కొడుకు.
‘అబ్బే డబ్బుదేముంది! ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కీర్తి శాశ్వతం కదా. ముందు ఆ కీర్తిని లోపలకు రమ్మని పిలవండి,’ అని చెప్పింది కోడలు.
‘ఇన్నాళ్లూ నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను. ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాను. నేను విజయాన్నే లోపలకు పిలుస్తాను,’ అన్నాడు తండ్రి.
‘భలేవారే! మన అరాయించుకోలేనంత డబ్బు, డప్పు కొట్టుకొనేంత కీర్తి, తలపొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్లూ సుఖంగా ఉన్నామా లేదా! అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే! ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే... తతిమావి ఉండి మాత్రం ఏం లాభం? నా మాట విని వెళ్లి ఆ ప్రేమను లోపలకు పిలవండి,’ అని గట్టిగా చెప్పింది భార్య.
ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచింది. వెంటనే వెళ్లి ‘మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి!’ అని పెద్దాయన పిలవగానే అందులో ఒకరు లేచి లోపలకి అడుగుపెట్టారు. విచిత్రం! ప్రేమ లోపలకు అడుగుపెట్టగానే మిగతావారు కూడా ఆయన వెంటనే లోపలకు వచ్చేశారు.
‘మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా, మిగతా ముగ్గురూ తిరిగి వెళ్లిపోయేవారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది. విజయం ఉన్నచోట డబ్బు, కీర్తి ఉంటాయి. మిగతా లక్షణాలు అలా కాదు! ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు!’ అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు. అప్పటి నుంచీ వారి జీవితాల్లోనూ, మనసుల్లోనూ ఏ లోటూ లేకుండా పోయింది.
జీవితం పై ఆశ ఎలాంటి ప్రభావం చూపుతుంది?
అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. యుద్ధంలో తలలు తెగిపడుతున్నాయి. తీవ్రంగా గాయపడినవారు జీవచ్ఛవాల్లా సైనికులు ఆసుపత్రుల్లో పడి ఉన్నారు. అలాంటి ఓ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు పక్కపక్కనే ఉన్నారు. వారిలో ఒకరికి కాస్త లేచి కూర్చనేంత ఓపికైనా ఉంది. మరొకరికి మాత్రం ఆ అవకాశం కూడా లేదు. తూట్లు పడిన శరీరంతో నిస్సహాయంగా మంచం మీద పడి ఉన్నాడు.ఈ మందులన్నీ దండుగ. నేను చచ్చిపోవడం ఖాయం. లేచి కూర్చోలేనివాడిని, నా కాళ్ల మీద ఇంకెప్పటికీ నిలబడలేను కదా!అంటూ ఏడ్చేశాడు రెండో సైనికుడు.
అబ్బే అదేం కాదు! నువ్వు సుబ్బరంగా లేచి తిరుగుతావు. నాదీ హామీ. అసలు నా పక్కన ఉన్న కిటికీని చూశావా? ఈ కిటికీలోంచి కనిపించే ప్రపంచాన్ని చూస్తే రోజురోజుకీ నాలో జీవించాలన్న ఆశ పెరిగిపోతోంది అన్నాడు మొదటి సైనికుడు.
మరి నాకా భాగ్యం లేదు కదా! ఈ నాలుగు గోడలూ తప్ప ఉత్సాహం కలిగించేది ఏదీ నాకు కనిపించడం లేదు అని వాపోయాడు రెండో సైనికుడు.
అయితే ఓ పని చేద్దాం! నేను రోజూ కిటికీలోంచి కనిపించే అందమైన ప్రపంచాన్ని నీకు వర్ణిస్తూ ఉంటాను. నువ్వు హాయిగా కళ్లు మూసుకుని వాటిని ఊహించుకో అని సూచించాడు మొదటి సైనికుడు.
రెండో సైనికుడికి ఈ పద్ధతి బాగుంది. మొదటి సైనికుడు రోజూ బయట ఉన్న వాతావరణాన్ని వర్ణించేవాడు. అందమైన సూర్యోదయాల గురించీ, చిగురించే చెట్ల గురించీ, చిరుజల్లుల గురించీ వర్ణించేవాడు. దూరంగా ఉన్న సరస్సునీ, దాని మీద వాలుతున్న కొంగలనీ, అందులో ఈత కొడుతున్న పిల్లలనీ వర్ణించేవాడు. ఆసుపత్రి పక్కగా వెళ్తున్న మనుషుల గురించీ, వారి హావభావాల గురించీ వర్ణించేవాడు. మొదటి సైనికుడు కళ్లు మూసుకుని అవన్నీ ఊహించుకోసాగాడు. అతనిలో రోజురోజుకీ జీవించాలన్న ఆశ పెరిగిపోసాగింది. ఎలాగైనా ఆరోగ్యం బాగుపడాన్నల కోరిక బలపడింది. తను కూడా ఆ సూర్యోదయాలను చూడగలగాలి, తన పిల్లలతో తిరిగి సంతోషంగా గడపగలగాలి… అవే తన లక్ష్యాలు గా ఏర్పడ్డాయి!
రెండో సైనికుడి ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడింది. రేపటి నుంచీ నువ్వు లేచి ఓ నాలుగు అడుగులు వేయవచ్చు అని వైద్యులు కూడా చెప్పారు. ఆ రేపటి కోసం ఎదురుచూస్తూ హాయిగా నిద్రపోయాడు రెండో సైనికుడు. మర్నాడు ఉదయం నిద్రలేచి చూసేసరికి తన పక్కనే ఉన్న మంచం ఖాళీగా కనిపించింది.
ఈ మంచం మీద ఉన్న వ్యక్తి ఏమయ్యాడు అంటూ ఆతృతగా అడిగాడు నర్సుని.
అతను ఇవాళ తెల్లవారుజామున చనిపోయాడు అన్న సమాధానం వినిపించింది.
తనలో ఇన్నాళ్లుగా ఆశని రేకెత్తించిన వ్యక్తి చనిపోవడం అతనికి చాలా బాధని కలిగించింది. ఆతృతగా లేచి వెళ్లి కిటికీలోంచి తొంగిచూశాడు. ఆశ్చర్యం! ఆ కిటికీకి దగ్గరలోనే మరో గోడ అడ్డంగా ఉంది. అందులోంచి అసలు సూర్యోదయం కూడా కనిపించే అవకాశం లేదు.
రోజూ ఈ కిటికీలోంచి చూస్తూ నా మిత్రుడు ఎన్నో దృశ్యాలను వర్ణించేవాడే అని ఆశ్చర్యపోయాడు సైనికుడు.
అసాధ్యం. ఎందుకంటే అతను ఈ ఆసుపత్రిలో చేరేనాటికి అతనికి చూపు లేదు! అంది అక్కడే ఉన్న నర్సు !
పిరికితనం పోగొట్టుకోవడం ఎలా?
అనగనగా ఓ ఊళ్లో ఓ కుర్రవాడు ఉండేవాడు. అతను చచ్చేంత పిరికివాడు. తన పిరికితనంతో జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోయాడు ఆ కుర్రవాడు. అంతేకాదు… భయంతో ఎక్కడికీ వెళ్లేవాడు కాదు, ఏ పనీ చేసేవాడు కాదు. ఇంతలో అతనికి ఓ విషయం తెలిసింది. తన ఊళ్లోకి యుద్ధ విద్యలను నేర్పే ఓ గురువుగారు వచ్చారు. ఆయన దగ్గరకి వెళ్లి యుద్ధవిద్యలన్నీ నేర్చేసుకుని బోలెడంత దైర్యాన్ని తెచ్చుకోవాలని అనుకున్నాడు ఆ కుర్రవాడు. వెంటనే ఈ గురువుగారి దగ్గరకు వెళ్లి గురువుగారూ ఎంత కష్టమైనా సరే నేను మీ దగ్గర యుద్ధ విద్యలను నేర్చుకుంటానుఅని ప్రాథేయపడ్డాడు.
అదెంత భాగ్యం! కానీ అంతకంటే ముందు నువ్వో పని చేయాల్సి ఉంటుంది. అన్నారు గురువుగారు. మీ దగ్గర విద్యని సాధించేందుకు ఏ పని చేయడానికైనా నేను సిద్ధమే!అన్నాడు కుర్రవాడు.
అయితే వెంటనే ఈ ఊరిని ఆనుకుని ఉన్న నగరానికి వెళ్లు. ఓ నెల రోజులు అక్కడే ఉండు. ప్రతిరోజూ నగరంలోకి వెళ్లి నీకు ఎదుటపడే మనుషుల కళ్లలోకి చూస్తూ గట్టిగా నేను పిరికివాడినిఅని చెప్పు అన్నారు గురువుగారు. ఆ మాటలు విని, గురువుగారికి మతిగానీ పోయిందా అనుకున్నాడు కుర్రవాడు. కానీ ఇప్పుడిక వెనుకడుగు వేయలేడు. వేస్తే గురువుగారు ఊరుకునేట్లు లేరు. అందుకని ఆయన చెప్పినట్లుగానే మూటాముల్లే సర్దుకుని నగరానికి బయల్దేరాడు.
తన గురువుగారు చెప్పినట్లుగానే తనకి ఎదురుపడినవారితో నేను పిరికివాడినిఅని చెప్పాలనుకున్నాడు ఆ కుర్రవాడు. కానీ ఓ రెండు రోజులపాటు నోరు పెగలనే లేదు. చివరికి మూడో రోజున ఓ వ్యక్తి కళ్లలోకి సూటిగా చూస్తూ నేను పిరికివాడిని అని చెప్పేశాడు. ఆశ్చర్యం! తన గొంతు అనుకున్నంత బలహీనంగా ఏమీ లేదు. రోజులు గడిచేకొద్దీ తనకి ఎదురుపడినవారికల్లా నేను పిరికివాడినిఅని చెప్పడం మొదలుపెట్టాడు ఆ కుర్రవాడు. విచిత్రమేమిటంటే కాలం గడిచేకొద్దీ తన గొంతు మరింత స్పష్టంగా మారింది. తను ఇతరుల కళ్లలోకి సూటిగా చూడగలుగుతున్నాడు. చెప్పాలనుకున్నది దృఢంగా చెప్పగలుగుతున్నాడు. నేను పిరికివాడిని అంటున్నాడే కానీ తనలో పిరికితనం పోయిందనిపిస్తోంది. అనిపించడం ఏంటి! ఓ మూడు వారాలు పూర్తయేసరికి అతనిలో ఇక పిరికితనమే మిగల్లేదని అర్థమైపోయింది!
నెలరోజుల గడువు పూర్తయిన తరువాత కుర్రవాడు తన గురువుగారి దగ్గరకు తిరిగి వెళ్లాడు. గురువుగారూ మీరు పెట్టిన పరీక్ష అద్భుతంగా పనిచేసింది. కానీ అదెలా సాధ్యం! అని అడిగాడు అయోమయంగా.
మరేం లేదు. పిరికితనం అనేది ఒక అలవాటు మాత్రమే! ఆ అలవాటు ఎంత బలంగా ఉంటే నువ్వు అంత బలహీనంగా మారిపోతావు. నీ మనసులో ఉన్న మాటని చెప్పాలన్నా, ఎదుటివారితో మాట్లాడాలన్నా, వారిని ఎదుర్కోవాలన్నా… నువ్వు తెగ భయపడిపోయేవాడివి. అందుకే నీకు ఆ పరీక్ష పెట్టాను. నువ్వే పని చేయడానికైతే భయపడ్డావో ఆ పనిని చేయించాను. ఎలాగైతే పిరికితనం ఓ అలవాటో ధైర్యం కూడా అలవాటే! అది ఇప్పడు నీకు అబ్బింది. భయం అనే మార్గాన్ని నువ్వు దాటి ధైర్యం అనే ప్రపంచంలోకి అడుగుపెట్టేశావు! అంటూ చిరునవ్వుతో జవాబిచ్చారు గురువుగారు.
మీకు ఈ మూడు నీతి కధలలో ఏది బాగా నచ్చింది? ఒక్కో నీతి కధలో మీరు గ్రహించిన సారాంశం ఏమిటి? మొదలైన అంశాలు కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments