మ‌నజీవితాలు .. జిడ్డు కృష్ణ‌మూర్తి అర్థాలు ..

img

మ‌నజీవితాలు ..

జిడ్డు కృష్ణ‌మూర్తి అర్థాలు ..

మానవ సంబంధాలు, మానసిక తిరుగుబాటు, సమాజంలో రావాల్సిన మార్పుల గురించి ప్రముఖ‌ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చేసిన ప్రసంగాలు, రచనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేశాయి. అద్భుతమైన చైతన్యం ఆయనను ప్రపంచ దార్శనికునిగా నిలబెట్టింది. జీవన్మరణాలు నాణానికి రెండు వైపులా ఉండే ముద్రలని ఆయ‌న‌ చెబుతారు. జీవించడం ఒక అందమైన కళ అని చెప్పే కృష్ణ‌మూర్తి అందించిన జీవిత స‌త్యాల గురించి తెలుసుకుందాం...

తాదాత్మ్య భావన:

మీరు ఇంకొక వ్యక్తితోగాని, ఒక వర్గంతోగానీ, ఒక దేశంతో గాని ఎందుకు తాదాత్మ్యం చెందుతారు? మిమ్మల్ని క్రిస్టియన్ అనీ, హిందువు అనీ బౌద్ధుడనీ ఎందుకు చెప్పుకుంటారు? ఏదో ఒక మతశాఖకి ఎందుకు చెందుతారు? మతంలోనైనా, రాజకీయాల్లోనైనా, ఎవరో వ్యక్తితోనో, ఏదో వర్గంతోనో, సంప్రదాయ సిద్దంగా గాని, తాత్కాలికోద్రేకం చేతగాని, దురభిమానం చేతగాని, అనుకరణ ద్వారాగాని ఎందుకు మమైక్యం చెందుతారు? ఇటువంటి తాదాత్మ్యభావన, సృజనాత్మకమైన అవగాహనను అంతం చేస్తుంది. ఫ‌లితంగా ఒక పార్టీకి చెందిన‌ అధికారి చేతుల్లోనో, మరోనాయకుడి చేతుల్లోనో కీలుబొమ్మలవుతారు.

 

కుతూహలం:

కుతూహలం కనపరచటం అర్థం చేసుకోవటానికి మార్గం కాదు. స్వీయజ్ఞానంతోనే అవగాహన కలుగుతుంది. బాధపడే వాళ్ళు ఎప్పుడూ కుతూహలం కనపరచరు. ఉత్తి ఊహలతో కూడిన కుతూహలం ఆత్మజ్ఞానానికి అవరోధం. కుతూహలం కూడా ఊహించటం లాగే వ్యాకులతను సూచిస్తుంది. స్తిమితంగా లేని మనస్సు ఎంత గొప్పదైనప్పటికీ, అవగాహననీ, ఆనందాన్నీ నాశనం చేస్తుంది.

తప్పించుకోవడం:

ఇంకొకరి గురించి మంచిగా గానీ, చెడ్డగాగానీ మాట్లాడటం అంటే తన్ను తాను తప్పించుకోవటమే అవుతుంది. ఈ తప్పించుకోవటమే వ్యాకులతకి కారణం. తప్పించుకోవటంలోనే సహజంగా  అస్తిమితత్వం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల గురించి తాపత్రయ పడటమే కొందరి పని. లెక్కలేనన్ని పత్రికలు, పేపర్లూ వాటిలోని కబుర్ల గురించీ, హత్యల గురించీ, విడాకులు లాంటి గొడవల గురించీ చదవటంలో ఆ తాపత్రయం కనిపిస్తుంది.

ఆలోచ‌న ఆగిన‌పుడే ప్రేమ:‌

ఆలోచన ఆవేశపూరితమైనదీ... ఉద్రిక్తకరమైనదీ కాబట్టి అది ప్రేమ కాజాలదు. ఆలోచన ఉన్నప్పుడు ప్రేమకి తావు లేదు. ఆలోచన "జ్ఞాపకాల" మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమ జ్ఞాపకం కాదు. మీరు ప్రేమించే ఒక వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తున్న‌ప్పుడు ఆ ఆలోచన ప్రేమకాదు. మీ స్నేహితుని అలవాట్లనూ, ప్రవర్తించే లక్షణాలనూ, అవలక్షణాలనూ గుర్తుకి తెచ్చుకోవచ్చు. ఆ వ్యక్తితో మీకున్న సంబంధాన్ని బట్టి జరిగిన మంచి సంఘటనల్నీ చెడు సంఘటనల్నీ గుర్తుకి తెచ్చుకోవచ్చు. కానీ... ఆ ఆలోచనలు ప్రేరేపించే మనశ్చిత్రాలు మాత్రం ప్రేమకాదు. విభజన చేయటం ఆలోచన సహజ లక్షణం. సమయాభావం, స్థలాభావం, దూరం, దు:ఖం, అన్నీ ఆలోచన వల్ల పుట్టినవే. ఆలోచనా ప్రక్రియ ఆగిపోయినపుడే ప్రేమ ఉండటానికి సాధ్యమవుతుంది.

ఒంట‌రిత‌నం:

భయం, బాధతో కూడిన ఒంటరితనం అంటే ఒక్కరే ఒంటరిగా మిగిలిపోవడం. స్వార్థంతో చేసే పనులవల్ల కలిగే అనివార్య ఫలితం అది. ఒంటరితనం పరిమాణంలో పెద్దదైనా, చిన్నదయినా గందరగోళం, సంఘర్షణ, దు:ఖం ఎదురవుతాయి. ఒంటరితనంలోంచి ఏకాంతం ఉద్భవించదు. ఒంటరితనం పోతేగాని ఏకాంతం లభించదు. ఏకాంతం అవిభాజ్యమైనది. ఒంటరితనం అంటే ఎడబాటు. ఏకాంతంగా ఉన్నదాంట్లో మార్దవం, ఎంతో సహనం ఉంటాయి. ఏకాంతంగా ఉండేవారే కారణరహితమైన దానితో, అపరిమితమైన దానితో భాషించగలుగుతారు. ఏకాంతంగా ఉన్నదానికి జీవితం అనంతమైనదిగా ఉంటుంది. ఏకాంతంగా ఉన్నదానికి మృత్యువు ఉండదు. ఏకాంతంగా ఉన్నది గతించలేదు.

న‌మ్ర‌త అంతిమ ల‌క్ష్యం కాదు:

నమ్రత లేనప్పుడే ప్రతిఫలం, శిక్షా ఉంటాయి. ఆధ్యాత్మిక సాధనం వల్లనూ, ప్రాపంచిక విషయాలను త్యజించటం వల్లనూ సాధించే అంతిమ లక్ష్యం కాదు నమ్రత. నమ్రత సాధన చేసి పొందే గుణం కాదు. అభ్యాసంతో సాధించేదీ కాదు. అలవరచుకున్న గుణం సద్గుణం ఏనాటికీ కాదు. అది కేవలం ఒక సాధించిన విజయం అవుతుంది. మీ గొప్పల పట్టికలో మరొక అంశం అవుతుంది. సద్గుణాన్ని అలవరచుకోవడం అంటే అహాన్ని త్యజించడం కాదు. అహం ఉన్నదని స్పష్టంగా గ్రహించగ‌ల‌గ‌టం

 

స్వీయ జ్ఞానం:

స్వీయ జ్ఞానం లేకుండా, సహేతుకంగా ఆలోచించడానికి ఆస్కారం లేదు. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా సత్యం ఏమిటో ఎలా తెలుసుకోగలరు? స్వీయజ్ఞానం లేకపోతే భ్రాంతి మాత్రమే మిగులుతుంది. మీరు ఇది, మీరు అది అని ఎవరో చెబితే నమ్మడం పసితనం అనిపించుకుంటుంది. ఈలోకంలో గానీ, ఇంకోచోట గానీ ప్రతిఫలం చూపుతానన్న వాడిని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి.

గురువు ఎవ‌రికి కావాలి?

గురువు ఉన్నాడా లేడా అన్నది అల్ప విషయం. స్వలాభం కోసం ఇతరులను ఉపయోగించుకొనే వారికీ, రహస్య సంఘాలకీ, శాఖలకీ మాత్రం అది చాలా ముఖ్యమై విషయం. కాని, పరమానందదాయకమైన సత్యాన్నీ అన్వేషించే మనిషికి ఆ ప్రశ్న పూర్తిగా అసందర్భమైనదవుతుంది. గురువూ, శిష్యుడూ ఎంత ముఖ్యమైనవారో ధనవంతుడూ, కూలివాడూ కూడా అంతే ముఖ్యమైనవారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటమే ముఖ్యం.

తాప‌త్రయం:

తాప‌త్రయం నిండిన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేదు. ప్రశాంతత సాధన వల్ల గానీ, సమయానుకూలంగా గానీ లభించేది కాదు. అవగాహనలోనే ప్రశాంతత ఉంటుంది. ఏదో అవాలనే కోరిక అవగాహన కానివ్వదు. ఏదో అవాలనుకోవటం సమయాభావాన్ని కలుగచేస్తుంది. అంటే, నిజానికి, తక్షణం అవగాహన చేసుకోకుండా ముందుకి నెట్టటమే. ఫలానా మాదిరిగా అవుతాను అనే భ్రాంతి అహానికి ప్రాధాన్యం ఇవ్వటం వల్లనే కలుగుతుంది.

నమ్మకం:

ఒక నమ్మకం నుంచి మరొక నమ్మకానికీ, ఒక మూఢ సిద్ధాంతం నుంచి మరొక మూఢ సిద్ధాంతానికీ మారగలరు. కానీ, సత్యాన్ని గ్రహించే స్థితికి మారలేరు. నమ్మకం సత్యంకాదు. మీ మనస్సును మార్చుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. కానీ సత్యం అనేది, దైవం అనేది నమ్మకం కాదు. అది అనుభవంలోకి రావాలి. ఏదో నమ్మకంమీద, మూఢవిశ్వాసం మీద ఆధారపడినది కాదు. మీ అనుభవం ఏదైనా నమ్మకం మీద ఆధారపడినదైతే, మీ అనుభవం మీ నమ్మకం ప్రకారమే పరిమితమై ఉంటుంది. మీకేదైనా అనుభవం హఠాత్తుగా అనాలోచితంగా జరిగి, ఆ అనుభవం మీద మరికొంత అనుభవం అయితే అటువంటి అనుభవం కేవలం కొత్తగా ఎదురైన దాన్ని గుర్తుపట్టిన పాత జ్ఞాపకం మాత్రమే. జ్ఞాపకం అనేది ఎప్పుడూ గతించిపోయినదే. జీవించి ఉన్నదాని స్పర్శతో సజీవమవుతూ ఉంటుంది.

మ‌త‌మార్పిడి:

మతం మార్చుకోవటమంటే... ఒక నమ్మకం నుంచి మరొకదానికీ, ఒక మూఢ విశ్వాసం నుంచి మరొక దానికీ, ఒక పూజమాని మరింత తృప్తినిచ్చే మరొక పూజకీ మారటమే. దీనివల్ల సత్యాన్ని కనుక్కునే మార్గం మాత్రం కనిపించదు. పైగా తృప్తి పొందటం అనేది సత్యాన్ని కనిపించనివ్వదు. అయినప్పటికీ, మతసంస్థలూ, మతసంఘాలూ చేసే ప్రయత్నం అదే. మరింత ఒప్పించో, ఒప్పించకనో ఒక సిద్ధాంతం వైపుకో, మూఢవిశ్వాసం వైపుకో, ఆశవైపుకో మిమ్మల్ని మార్చాలని చూస్తారు. అంతకన్నా మంచి పంజరాన్ని ఇస్తామని ఆశచూపిస్తారు. అందులో మీకు సుఖంగా ఉండొచ్చు, ఉండక పోవచ్చు. అది మీ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. ఏమైనా అది ఒక ఖైదు.

పూజాపునస్కారాలు:

పూజాపునస్కారాల్లో పాల్గొనేవారికి అటువంటి వాటిలో సద్భావం కలగటం సహజం. అందరితో కలిసి చేసినా, వ్యక్తిగతంగా చేసినా, పూజా పునస్కారాల్లో కొంత మనశ్శాంతి లభిస్తుంది. నిత్య కార్యకలాపాలతోనూ, దైనందిన జీవితంలోనూ పోల్చుకుంటే, పూజల్లో కొంత అందం, క్రమపద్ధతీ ఉన్నప్పటికీ అవి ప్రధానంగా ఉత్తేజకాలు మాత్రమే. ఉత్తేజకాలు అన్నిటిలాగే అవికూడా మనస్సునీ, హృదయాన్నీ పూర్తిగా బండబారేటట్లు చేస్తాయి. పూజాపునస్కారాలు అలవాటయిపోతాయి. అవసరమనిపిస్తాయి. అవి లేకుండా ఉండలేమనిపిస్తుంది. ఈ అవసరాన్ని ఆధ్యాత్మిక పునరుద్ధరణ అనీ, జీవితాన్ని ఎదుర్కోవటానికి కావలసిన శక్తి అనీ, దినదినం, వారంవారం చేసే ధ్యానం అనీ పలువిధాలుగా పేర్కొంటారు. కానీ ఈ ప్రక్రియను మరింత పరీక్షగా చూస్తే నిజానికి, పూజలూ అవీ ఆత్మజ్ఞానం కలగకుండా గౌరవప్రదంగా బ్రహ్మాండంగా తప్పించుకోవటానికి చేసే వ్యర్ధ ప్రయాసలా కనిపిస్తుంది. తన‌ను తాను తెలుసుకోకుండా ఏపని చేసినా అర్ధం ఉండదు.

శ్లోకాలు, ప‌ద్యాలు:

పదేపదే శ్లోకాలు చదవటం, పదాలూ, వాక్యాలూ జపించటంవల్ల మనస్సును నిద్ర పుచ్చటం జరుగుతుంది. తాత్కాలికంగా కొంత ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ. ఈ నిద్రావస్థలో కొన్ని అనుభవానికి వస్తాయి. కానీ అవి స్వయం ప్రేరితమైనవే. ఎంత తృప్తినిచ్చినా, ఈ అనుభవాలు ఊహాజనితమైనవే. దేన్ని పదేపదే జపించినా, ఏ విధంగా సాధన చేసినా సత్యం అనుభవంలోకి రాదు. సత్యం ఒక గమ్యంకాదు. ఒక ఫలితం కాదు, ఒక లక్ష్యం కాదు. దాన్ని ఆహ్వానించలేం. అది మనస్సుకి సంబంధించినది కాదు. 

ఇలా చెప్పుకుంటూ పోతే జిడ్డు క్రిష్ణ మూర్తి భావజాలం అనంతమైనది, ఎంతో గొప్పది.. మరికొన్ని అంశాలు మరో వీడియోలో తెలుసుకుందాం.. 

మరిన్ని

Comments

0 Comments

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()